V6 News

సర్కారు చేతికి మెట్రో..15 వేల కోట్లతో 100 శాతం వాటా కొనుగోలు

సర్కారు చేతికి మెట్రో..15 వేల కోట్లతో 100 శాతం వాటా కొనుగోలు
  •  
  • హైదరాబాద్ మెట్రో ఫేజ్-1 టేకోవర్‌‌‌‌పై ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
  • ఎల్ అండ్ టీ వాటాను కొనుగోలు చేసిన హెచ్ఎంఆర్ఎల్
  • 15 వేల కోట్లతో 100 శాతం వాటా కొనుగోలు
  • మెట్రో బోర్డు డైరెక్టర్ల నామినేషన్ పూర్తి
  • కొత్త చైర్మన్​గా సీఎస్ రామకృష్ణారావు, ఎండీగా సర్ఫరాజ్ అహ్మద్
  • ఈ నెల 30తో ముగియనున్న అధికారిక బదిలీ ప్రక్రియ

హైదరాబాద్, వెలుగు:  హైదరాబాద్ మెట్రో రైలు పూర్తిస్థాయిలో ప్రభుత్వ పరం కానుంది. హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్-1లో ఇప్పటిదాకా ఎల్ అండ్ టీకి ఉన్న 100 శాతం ఈక్విటీ వాటాను రాష్ట్ర ప్రభుత్వం(హెచ్ఎంఆర్ఎల్ ద్వారా) కొనుగోలు చేసింది. సుమారు 15 వేల కోట్ల రూపాయల వ్యయంతో (అప్పులతో కలిపి) ఈ టేకోవర్ ప్రక్రియను పూర్తి చేస్తూ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ శనివారం జీవో నెంబర్ 128 జారీ చేసింది. ఈ నెల 30వ తేదీతో ఎల్ అండ్ టీ నుంచి ప్రభుత్వానికి అధికారికంగా యాజమాన్య హక్కులు బదిలీ కానున్నాయి.

మెట్రో కొత్త బోర్డు ఖరారు..

మెట్రో నిర్వహణ కోసం ప్రభుత్వం కొత్త బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లను నామినేట్ చేసింది. ఈ బోర్డుకు చైర్మన్‌ గా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) కె. రామకృష్ణారావు వ్యవహరించనున్నారు. మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ)గా ప్రస్తుతం ఎండీగా ఉన్న సర్ఫరాజ్ అహ్మద్‌ ను నియమించారు. ఇతర డైరెక్టర్లుగా రాష్ట్రంలోని కీలక శాఖల ఉన్నతాధికారులను ప్రభుత్వం నియమించింది.

షేర్ల కేటాయింపు...

టేకోవర్ ప్రక్రియలో భాగంగా నామినీ డైరెక్టర్లకు ఒక్కో షేర్ చొప్పున కేటాయించారు. మిగిలిన షేర్లు ప్రభుత్వం, హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్(హెచ్ఎంఆర్ఎల్) పేరిట ఉండనున్నాయి. మెట్రో రైలును ప్రభుత్వమే నేరుగా నిర్వహించాలనే ఉద్దేశంతో ఈ భారీ డీల్‌ ను ప్రభుత్వం క్లోజ్ చేసింది. దీనివల్ల మెట్రో ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలు అందుబాటులోకి వస్తాయని ప్రభుత్వం భావిస్తోంది.

మెట్రో రైలు కొత్త బోర్డు సభ్యులు వీరే..
1.  చైర్మన్: కె. రామకృష్ణారావు (సీఎస్)
2.  ఎండీ: సర్ఫరాజ్ అహ్మద్ (ఎండీ, హెచ్ఎంఆర్ఎల్)
3.  డైరెక్టర్: జయేష్ రంజన్ (స్పెషల్ సీఎస్, పురపాలక శాఖ)
4.  డైరెక్టర్: వికాస్ రాజ్ (స్పెషల్ సీఎస్, రవాణా & బీ అండ్ సీ)
5.  డైరెక్టర్: సందీప్ కుమార్ సుల్తానియా (ఆర్థిక శాఖ కార్యదర్శి)
6.  డైరెక్టర్: బి. శివధర్ రెడ్డి (డీజీపీ)
7.  డైరెక్టర్: సర్ఫరాజ్ అహ్మద్ 
   (హెచ్ఎండీఏ కమిషనర్)
8.  డైరెక్టర్: కె. అశోక్ రెడ్డి (ఎండీ, జలమండలి)
9.  డైరెక్టర్: జితేష్ వి. పాటిల్ (సీఎండీ, టీజీఎస్పీడీసీఎల్)
10. జాయింట్ ఎండీ: శివేంద్ర ప్రతాప్