
- తమ భూములంటూ ప్రైవేట్ వ్యక్తులు దాఖలు చేసిన పిటిషన్లు కొట్టేయాలని విజ్ఞప్తి
హైదరాబాద్, వెలుగు: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా శామీర్‌పేట మండలం దేవరయాంజల్ గ్రామంలో 1,521.13 ఎకరాలు శ్రీ సీతారామ స్వామి ఆలయానికి చెందిన భూములేనని రాష్ట్ర సర్కార్ హైకోర్టుకు నివేదించింది. సర్వే నంబర్ 688 నుంచి 712, 716ల్లోని ఆలయ భూమిని సీసీఎల్‌ఏ నిషేధిత జాబితాలో చేర్చుతూ 2014లో జారీ చేసిన ప్రొసీడింగ్స్‌ను రద్దు చేయాలంటూ సుమారు 300కుపైగా పిటిషన్లను డిస్మిస్ చేయాలని కోరింది. రెవెన్యూ ఆఫీసర్లు.. ప్రైవేట్ వ్యక్తులతో కుమ్మక్కై ఈ భూ బాగోతానికి తెరతీశారని తెలిపింది. చట్ట ప్రకారం భూములను నిషేధిత జాబితాలో చేర్చామని వెల్లడించింది.
ప్రైవేట్ వ్యక్తులు తమ భూములేనని దాఖలైన 300 పిటిషన్లపై జస్టిస్ జూకంటి అనిల్ కుమార్ విచారణ చేపట్టారు. ప్రభుత్వ న్యాయవాది వాదిస్తూ, 2014లో ప్రభుత్వం ఇచ్చిన ప్రొసీడింగ్స్ చట్టబద్ధంగా ఉన్నాయని తెలిపారు. పిటిషనర్ల వద్ద ఆర్‌వోఆర్ ప్రొసీడింగ్స్, పట్టాదార్ పాస్ బుక్స్ లేవని, సేత్వార్ కూడా తప్పుగా ఉందని, 1,354 సేత్వారి (1944లో) సర్కారి భూమిగా ఉందని తెలిపారు.
1925–26 పహాణిలో ఆలయ భూమిగానే ఉందని, ఆలయ ట్రస్టీగా రాముడి పుల్లయ్య పేరు ఉందని వివరించారు. తర్వాత కొడుకు పేరు, ఆ తర్వాత అక్రమంగా ఇతరుల పేర్లు వచ్చాయన్నారు. 1954–55 కాలంలో కొందరు అధికారులతో ప్రైవేట్ వ్యక్తులు చేతులు కలిపి చట్ట వ్యతిరేకంగా పట్టా భూమిగా చూపారన్నారు. ఆక్రమణదారులు రైతు సమాఖ్య పేరుతో ప్రభుత్వానికి ఇచ్చిన వినతిపత్రం, ఇతర అంశాలపై సీసీఎల్‌ఏ విచారిస్తే 1,400 ఎకరాలు ఆలయానివేనని తేలిందని చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం భూములు తమవేనంటూ దాఖలైన పిటిషన్లను కొట్టేయాలని కోరారు.