
కాళేశ్వరం పనులపై సర్కారు డైలమా
ఆర్నెళ్ల కింద రూ. 21 వేల కోట్లతో అడిషనల్ పనులకు టెండర్లు
బడ్జెట్లో దీనికి పైసలు లేని పరిస్థితి
అప్పులు ఇచ్చేందుకు బ్యాంకులు, ఫైనాన్స్ కంపెనీల వెనుకడుగు
హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం అడిషనల్ (మూడో) టీఎంసీ పనులకు రాష్ట్ర సర్కారు ఫుల్ స్టాప్ పెట్టినట్టు కనిపిస్తోంది. ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేరుకు థర్డ్ టీఎంసీ, మిడ్ మానేరు నుంచి మల్లన్న సాగర్‌కు సెకండ్ టీఎంసీ నీటి తరలింపు పనులకు నిధుల కటకట నెలకొంది. బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు లోన్ ఇచ్చేందుకు ముందుకురావడం లేదు. పనులకు అవసరమైన రూ. 21 వేల కోట్లను బడ్జెట్ నుంచి కేటాయించడం సాధ్యంకాని పరిస్థితి. దీనికితోడు అడిషనల్ టీఎంసీ పనులకు ఏ పర్మిషన్లూ లేకపోవడంతో.. పనులు చేపట్టొద్దని సీఎం కేసీఆర్ మౌఖికంగా ఆదేశించినట్టు తెలిసింది.
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి వరకు రోజుకు రెండు టీఎంసీల చొప్పున తరలించే పనులతోపాటు మూడో టీఎంసీకి సివిల్ వర్క్ చేశారు. పంపులు, మోటార్ల బిగింపు మాత్రమే పెండింగ్ ఉంది. ఆ సివిల్ వర్క్‌లను, హైడ్రో మెకానికల్, ఎలక్ట్రో మెకానికల్ పనులకు కలిపి రూ.4,500 కోట్ల టెండర్‌ను మేఘా కంపెనీకి సీఎం కేసీఆర్ నామినేషన్ పద్ధతిన అప్పగించారు. ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేరుకు థర్డ్ టీఎంసీ.. అక్కడి నుంచి మల్లన్నసాగర్‌కు రెండో టీఎంసీ పనులు చేసేందుకు ఏప్రిల్ నెలలో రూ.21,458 కోట్లతో టెండర్లు పిలిచారు. మే నెలలో ప్రైస్ బిడ్లను ఓపెన్ చేసి.. వర్క్ ఏజెన్సీలతో అగ్రిమెంట్ చేసుకున్నారు. జగిత్యాల జిల్లాలో అడిషనల్ టీఎంసీ పనులకు కేసీఆర్ శంకుస్థాపన చేయడానికి ముహూర్తం నిర్ణయించారు. కానీ రాష్ట్రంలో కరోనా తీవ్రత పెరగడంతో సీఎం టూర్ క్యాన్సిల్ అయింది.
ఇప్పుడు అప్పులు పుట్టక..
అడిషనల్ టీఎంసీ పనుల్లో.. వందేళ్లు నిలిచి ఉండే అండర్ టన్నెళ్లను కాదని, 25 ఏండ్లు కూడా పనిచేయని పైపులైన్లు వేస్తున్నారని, ఒక వర్క్ ఏజెన్సీకి లాభం చేకూర్చడానికే ఈ పని చేస్తున్నాదని కేంద్రానికి కంప్లైంట్లు అందాయి. రూ.27 వేల కోట్లతో అడిషనల్ టీఎంసీ పనులు చేపట్టబోతున్నా.. దానికింద ఒక్క ఎకరం కూడా అదనపు ఆయకట్టు లేదని మరికొందరు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ పనుల పూర్తి వివరాలు ఇవ్వాలని కేంద్రం చాలా సార్లు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. లెటర్లు రాసింది. అయినా వివరాలు వెల్లడించడానికి రాష్ట్ర సర్కారు వెనుకాడుతోంది. ఇక పర్మిషన్లేవీ లేకుండా థర్డ్ టీఎంసీ పనులు చేయవద్దని ఇటీవల అపెక్స్ మీటింగ్‌లో కేంద్రం స్పష్టం చేసింది. దీంతో ఈ పనులపై సర్కారు డైలమాలో పడింది. పనులు చేసేందుకు బడ్జెట్ కేటాయించ లేకపోవడం, గతంలో మాదిరిగా లోన్లు ఇవ్వలేమని ఫైనాన్స్ సంస్థలు, బ్యాంకుల కన్సార్షియం తేల్చిచెప్పడంతో.. అడిషనల్ టీఎంసీ పనులను పక్కన పెట్టాలని నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది.
వర్క్ ఏజెన్సీలకు నచ్చజెప్పి..
అడిషనల్ టీఎంసీ పనులు దక్కించుకున్న వర్క్ ఏజెన్సీలన్నీ ప్రభుత్వంతో సన్నిహిత సంబంధాలున్నవే కావడంతో.. వారికి నచ్చజెప్పి ఇప్పట్లో పనులు మొదలుపెట్టలేమని ఒప్పించాలని నిర్ణయించినట్టు సమాచారం. కొంతకాలం వేచిచూసి అన్నీ కుదురుకుంటే ఆ పనుల గురించి ఆలోచిద్దామని స్పష్టం చేయనున్నట్టు తెలిసింది. ఈ లోగా పనులకు అవసరమైన పర్మిషన్లు, ఇతర ప్రక్రియ పూర్తి చేసుకోవడానికి అవసరమైన చర్యలు చేపట్టనున్నారు. కనీసం రెండు, మూడేండ్ల పాటు కాళేశ్వరం అడిషనల్ టీఎంసీ పనులను పక్కనపెట్టవచ్చని ఇంజనీరింగ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
For More News..