
- గ్రేటర్లో ఏడాదిలో 25 శాతమే మంజూరు
- వంద శాతం ఇచ్చినట్టు మంత్రి కేటీఆర్ స్టేట్మెంట్
- స్కీమ్‌ను పట్టించుకోని బల్దియా అధికారులు
హైదరాబాద్, వెలుగు: స్ట్రీట్ వెండర్స్‌కి వంద శాతం పీఎం స్వనిధి లోన్లు అందించామని మంత్రి కేటీఆర్ కొద్ది రోజుల కిందట ప్రకటించగా, గ్రౌండ్లెవల్లో పరిశీలిస్తే వేరేగా ఉంది. గ్రేటర్లో 10 మంది స్ర్టీట్వెండర్స్ను అడిగితే ఏడుగురికి లోన్లు రాలేదని చెప్పారు. గతేడాది జులైలో పీఎం స్ట్రీట్ వెండర్స్ ఆత్మ నిర్భర్ నిధి(పీఎం స్వనిధి) స్కీమ్ ను కేంద్రం ప్రారంభించింది. ఎంతమందికైనా లోన్లు ఇచ్చేందుకు సిద్ధంగా కేంద్రం ఉందని చెప్పగా, బల్దియా అధికారుల నిర్లక్ష్యం కారణంగా అర్హులకు సకాలంలో లోన్లు అందడంలేదు. గ్రేటర్ లో1 లక్షా 60 వేల 205 మంది స్ర్టీట్వెండర్స్ ఉన్నట్లు బల్దియా అధికారులు గుర్తించారు. ఇందులో 1 లక్షా 59 వేల 424 మందికి గుర్తింపు కార్డులను కూడా ఇచ్చారు. ఇందులో 40,237 మందికే రూ. 10 వేల చొప్పున లోన్లు అందించారు. మిగతా వారికి రావడం లేదు. ఇస్తరో.. లేదో కూడా అధికారులు చెప్పడంలేదు. ఈ ఏడాదిలో ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు కేవలం 6 వేల మందికి మాత్రమే అందించారు. అది కూడా అంతకు ముందు శాంక్షన్అయిన వారికే ఇచ్చారు. కొత్త వారినైతే అసలు గుర్తించడం లేదు.
ఆఫీసర్ల చుట్టూ తిరుగుతున్న స్ట్రీట్ వెండర్స్
స్కీమ్ షురూ అయినప్పటి నుంచి గ్రేటర్లో 25 శాతం మంది అర్హులకే లోన్లు అందాయి. బల్దియా అధికారులు, ఇంట్రెస్ట్ చూపకపోవడంతో స్ట్రీట్ వెండర్స్‌కు వెంటనే లోన్లు అందడం లేదు. లోన్ల కోసమైతే చాలామంది ఆఫీసర్ల చుట్టూ తిరుగుతున్నా కూడా ఇచ్చేందుకు చర్యలు తీసుకోవడంలేదు. స్ట్రీట్ వెండర్స్‌కు సంబంధించిన డాక్యుమెంట్లను తీసుకొని బల్దియా ఆఫీసర్లు బ్యాంకులో అందజేస్తే లోన్లు మంజూరు చేస్తారు. ఆ పని కూడా చేయడం లేదు. కరోనా, లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన ఎంతోమంది స్ట్రీట్వెండర్స్గా మారారు. ‘30 ఏండ్లుగా పండ్లు అమ్ముతున్న. లోను కోసం ఏడాది కిందట అప్లయ్ చేశా. ఎప్పుడిస్తరో ఎవరిని అడగాలో తెలియడం లేదు’ అని టోలీచౌకి చెందిన స్ట్రీట్ వెండర్ షేక్ హమీద్ వాపోయాడు.