పీక్ టైమ్ లో బ్యాటరీ పవర్!..ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ను బలోపేతం చేయడంపై సర్కారు ఫోకస్!

పీక్ టైమ్ లో బ్యాటరీ పవర్!..ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ను బలోపేతం చేయడంపై సర్కారు ఫోకస్!
  • జెన్​కో పరిధిలో 750, సింగరేణి పరిధిలో 250 మెగావాట్ల ప్లాంట్​ల ఏర్పాటుకు నిర్ణయం
  • మందమర్రిలో ఇప్పటికే మెగావాట్​ బీఈఎస్​ఎస్​ ప్లాంట్

హైదరాబాద్, వెలుగు: పీక్ టైమ్​లో బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ (బీఈఎస్​ఎస్)​ ద్వారా కరెంట్ సప్లయ్ చేస్తూ రాష్ట్రంలో అసలే కరెంట్​ కోతలు లేకుండా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. ఉదయం 6 నుంచి 10, సాయంత్రం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు కొనుగోలు చేసే కరెంట్ ఖర్చును కూడా తగ్గించుకోవాలని యోచిస్తున్నది. రాష్ట్రంలో సోలార్​ బ్యాటరీ పవర్​తో నడిచే కరెంట్ సప్లయ్ వ్యవస్థను బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నది. 

రాష్ట్రవ్యాప్తంగా జెన్​కో ఆధ్వర్యంలో 750 మెగావాట్లు, సింగరేణిలో 250 మెగావాట్ల సామర్థ్యం కలిగిన బీఈఎస్ఎస్ ప్లాంట్లు ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతున్నది. ఇప్పటికే సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో మందమర్రిలో నిర్మించిన ఒక మెగావాట్​ సామర్థ్యం గల బీఈఎస్​ఎస్ ప్లాంట్ ప్రారంభానికి సిద్ధంగా ఉన్నది. బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ ద్వారా పనిచేసే తొలి ప్లాంట్ ఇదే కానున్నది.

బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ (బీఈఎస్​ఎస్​) అంటే ఏంటి?

మనం ఇండ్లల్లో కరెంట్ పోయినప్పుడు ఇన్వర్టర్​లను ఎలాగైతే ఉపయోగించి విద్యుత్ లైట్లు వెలిగేలా, ఫ్యాన్లు తిరిగేలా పవర్ వినియోగిస్తామో.. అలాగే, భారీ స్థాయిలో బ్యాటరీల సహాయంతో విద్యుత్ శక్తిని నిల్వ చేసి, అవసరమైనప్పుడు దాన్ని వినియోగించే వ్యవస్థనే బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ (బీఈఎస్ఎస్)​ అంటారు. సోలార్, గాలి వంటి పునరుత్పాదక ఇంధన వనరుల నుంచి వచ్చే విద్యుత్​ను బ్యాటరీలలో నిల్వ చేసి సూర్యుడు లేని సమయంలో.. అంటే పీక్​ పీరియడ్​లో నిల్వ చేసిన విద్యుత్​ను ఉపయోగించుకోవడానికి ఈ సిస్టమ్ ఉపయోగపడుతుంది. 

విద్యుత్ నిల్వ చేయడానికి లీథియం, ఐయాన్, ఫ్లో బ్యాటరీలను ఉపయోగిస్తారు. బ్యాటరీ మేనేజ్‌‌మెంట్ సిస్టమ్ (బీఎంఎస్), ఎనర్జీ మేనేజ్‌‌మెంట్ సిస్టమ్ (ఈఎంఎస్) పద్ధతి ద్వారా కరెంట్ సప్లయ్ చేస్తారు. షార్ట్​గా చెప్పాలంటే విద్యుత్‌‌ను ‘పొదుపు’ చేసి అవసరమైనప్పుడు వాడుకోవడానికి ఉపయోగపడే ఆధునిక బ్యాటరీ వ్యవస్థ అని అర్థం. పగటిపూట ఉత్పత్తి జరిగే సోలార్ విద్యుత్​లో వినియోగించబడని కరెంట్​ను ఉచితంగా గ్రిడ్ కు సరఫరా చేయకుండా, బ్యాటరీలో నిలువ చేసుకొని, అవసరమైనప్పుడు వాడుకునే అవకాశం కలిగించే బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ ను రాష్ట్రంలోనే తొలిసారిగా సింగరేణిలో ప్రారంభించనున్నారు.

ఉపయోగాలు ఏంటి?

పీక్ టైమ్​లో విద్యుత్ కొనుగోళ్ల రేట్లు అధికంగా ఉంటాయి. విద్యుత్ శాఖ ఉద్దేశంలో ఉదయం 6 నుంచి 10, సాయంత్రం 6 నుంచి  రాత్రి 10 గంటల మధ్య ఉన్న సమయాన్ని పీక్ టైమ్​గా పేర్కొంటారు. ఈ టైమ్​లో విద్యుత్​ వినియోగం ఎక్కువగా ఉంటుంది. గృహ, ఇండస్ట్రీయల్, ఇతర అవసరాలకు కరెంట్ సప్లయ్ చేయడానికి బయటి నుంచి విద్యుత్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. 

యూనిట్​పై రూ.1 నుంచి రూ.3 వరకు అదనంగా ఖర్చు చేయాల్సి వస్తున్నది. దీంతో కొన్నిసార్లు డిమాండ్​కు అనుగుణంగా కరెంట్ సప్లయ్ చేయలేక విద్యుత్ కోతలు విధిస్తారు. దీంతో పెద్ద, పెద్ద ఇండస్ట్రీలు, హాస్పిటల్స్, డేటా సెంటర్లలో బ్యాకప్ పవర్ వినియోగిస్తూ భారీ మొత్తంలో ఖర్చు చేస్తుంటారు. 

అయితే, బీఈఎస్ఎస్ సిస్టమ్ ద్వారా విద్యుత్ కోతలను తగ్గించొచ్చు. 24/7 విద్యుత్ పునరుత్పాదక శక్తి అందుబాటులో ఉంచుతుంది. పీక్​ టైమ్​లో విద్యుత్ బిల్లులు తగ్గుతాయి. గ్రిడ్ స్థిరత్వం పెరుగుతుంది. వేల కోట్ల రూపాయల విద్యుత్ కొనుగోళ్ల ఖర్చులు తగ్గిపోతాయి.

వెయ్యి మెగావాట్ల విద్యుత్ స్టోరేజీ లక్ష్యం

రాష్ట్రంలో వెయ్యి మెగావాట్ల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టమ్ (బీఈఎస్​ఎస్)ను ఏర్పాటు చేయాలని  ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. జెన్​కో  ఆధ్వర్యంలో 750 మెగావాట్లు, సింగరేణి పరిధిలో 250 మెగావాట్ల స్టోరేజీ ప్లాంట్ల ఏర్పాటుకు సిద్ధమవుతున్నది. ఇప్పటికే మంచిర్యాల జిల్లా మందమర్రిలో 28 మెగావాట్ల సోలార్​  ప్లాంట్​తో లింక్ చేసి ఒక మెగావాట్ సామర్థ్యం కలిగిన  ప్లాంట్ ను పైలెట్ ప్రాజెక్ట్​గా ఏర్పాటు చేశారు. రూ.2.73 కోట్లు ఖర్చుచేశారు. 

ఏడాదికి 9.1 లక్షల యూనిట్ల పవర్​ను స్టోర్ చేసి పీక్​ టైమ్​లో ఉపయోగించి ఏడాదికి రూ.70 లక్షలు ఆదా చేసుకోవాలని భావిస్తున్నది. ఇది సక్సెస్ అయితే   అన్ని సింగరేణి ఏరియాల్లో 250 మెగావాట్ల సామర్థ్యంతో బీఈఎస్​ఎస్ ప్లాంట్ల ఏర్పాటుకు సింగరేణి  సిద్ధమవుతున్నది.  టీజీ జెన్​కో సంస్థ సైతం మొదటగా 275, 350 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 2 ప్లాంట్ల పనులు మొదలు పెట్టడానికి రెడీ అవుతున్నది. దీనికోసం రూ.2 వేల కోట్లు ఖర్చు చేయబోతున్నారు. షార్ట్ టైమ్ పాలసీలో  1,600, మీడియం టర్మ్​లో 3,800, లాంగ్ టర్మ్​లో 7,900 మెగావాట్ల  ప్లాంట్ల ఏర్పాటు లక్ష్యంగా  ముందుకు సాగుతున్నది.