
- ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
- చైర్మన్గా కార్మిక శాఖ కమిషనర్
- కమిటీలో దిల్ రాజు సహా పలువురు నిర్మాతలు, సినీ కార్మిక నేతలు
- 2 నెలల్లో ప్రభుత్వానికి నివేదిక
- దసరా తరువాత కమిటీ తొలి మీటింగ్
హైదరాబాద్, వెలుగు: తెలుగు సినీ పరిశ్రమలో సినీ కార్మికుల సమస్యలపై చర్చించేందుకు ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు కార్మిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిశోర్ ఆదివారం జీవో 395 జారీ చేశారు. ఈ కమిటీలో మొత్తం ఏడుగురు సభ్యులు ఉన్నారు. చైర్మన్ గా కార్మిక శాఖ కమిషనర్ దాన కిశోర్ ఉండగా.. మెంబర్ కన్వీనర్ గా కార్మిక శాఖ అడిషనల్ కమిషనర్, మెంబర్లుగా ఎఫ్ డీసీ చైర్మన్ దిల్ రాజు, ఫిల్మ్ చాంబర్ నుంచి ఇద్దరు మెంబర్లు నిర్మాతలు దామోదర ప్రసాద్, యార్లగడ్డ సుప్రియ, సినీ కార్మికుల యూనియన్ల నుంచి ప్రెసిడెంట్ అనిల్ కుమార్, సెక్రటరీ అమ్మిరాజు ఉన్నారు.
ఈ కమిటీ సినీ కార్మికుల సమస్యలపై చర్చించి.. 2 నెలల్లో ప్రభుత్వానికి రిపోర్ట్ అందజేయనుంది. కార్మికుల వేతనాలు 30 శాతం పెంచాలని డిమాండ్ చేస్తూ ఈ ఏడాది ఆగస్టు 4 నుంచి 18 రోజుల పాటు సినీ కార్మికులు సమ్మె చేయడంతో షూటింగ్ లు నిలిచిపోయాయి. దీంతో సీఎం రేవంత్ రెడ్డి జోక్యం చేసుకొని చర్చలు జరపాలని కార్మిక శాఖను ఆదేశించగా.. నిర్మాతలు, యూనియన్ ప్రతినిధులతో చర్చలు జరిపారు. దశల వారీగా రెండేండ్లలో 22.5 శాతం వేతనాలు పెంచేందుకు నిర్మాతలు అంగీకరించడంతో సమ్మెను విరమించారు. ఇటీవల సీఎంతో సినీ నిర్మాతలు, కార్మికుల యూనియన్ ప్రతినిధులు సమావేశం కాగా.. ఈ అంశం మరోసారి చర్చకు వచ్చింది. ఈ నేపథ్యంలో ఇతర సమస్యలపై చర్చించేందుకు కార్మిక శాఖ కమిటీ ఏర్పాటు చేసింది. దసరా పండుగ తరువాత ఈ కమిటీ తొలి భేటీ కానున్నట్టు సమాచారం.