పాలసీ సొమ్ము పది రోజుల్లోనే..! ఇందిరమ్మ బీమా కోసం విధివిధానాలు..1.15 కోట్ల కుటుంబాలకు రూ.3 వేల 509 చొప్పున ప్రీమియం?

పాలసీ సొమ్ము  పది రోజుల్లోనే..! ఇందిరమ్మ బీమా కోసం విధివిధానాలు..1.15  కోట్ల కుటుంబాలకు రూ.3 వేల 509 చొప్పున ప్రీమియం?
  • జూన్ నెల నుంచి ఇంటింటికీ వెళ్లి వివరాల నమోదు
  • రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి కచ్చితంగా వర్తింపు
  • ఇతర కిందిస్థాయి ఉద్యోగులకు కల్పించే అవకాశం 
  • కుటుంబంలో ఎవరి పేరు మీద కోరితే వారి పేరు పైనే లైఫ్ ఇన్సూరెన్స్
  • నామినీ, ఇన్సూరెన్స్​ అర్హత వయస్సు 18 నుంచి 60 ఏండ్లలోపు ఉండాలి
  • ఇప్పటికే బడ్జెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 4 వేల కోట్లు కేటాయింపులు.. కేబినెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చర్చించిన మంత్రులు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని పేద కుటుంబాలకు ధీమా కల్పించేలా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్న ‘ఇందిరమ్మ బీమా’ పథకానికి సంబంధించిన విధివిధానాలు దాదాపు ఖరారయ్యాయి. అర్హులైన లబ్ధిదారులకు ఏదైనా ప్రమాదం లేదా అనుకోని విపత్తు సంభవించినప్పుడు కేవలం పది రోజుల్లోనే పాలసీ సొమ్ము బాధితులకు అందేలా ప్రభుత్వం సరికొత్త మార్గదర్శకాలను రూపొందిస్తోంది. త్వరలోనే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆధ్వర్యంలోని కేబినెట్ సబ్ కమిటీ ఈ పథకంపై సుదీర్ఘంగా చర్చించి తుది నిర్ణయాలు తీసుకోనుంది. 

రాష్ట్రవ్యాప్తంగా 1.05 కోట్ల మంది రేషన్ కార్డులు కలిగి ఉన్నారు. మొత్తం  3.35 కోట్ల మంది ఉన్నారు. అయితే ప్రభుత్వం మాత్రం  సుమారు 1.15 కోట్ల పేద కుటుంబాలకు ఈ సామాజిక భద్రతా పథకం వర్తింపజేస్తామని స్పష్టం చేసింది. ప్రీమియంపై ఇన్సూరెన్స్​ కంపెనీతో సంప్రదింపుల తర్వాత ఎంత అనేది ఫైనల్​ చేయనున్నారు. అయితే, బడ్జెట్‌లో ఇప్పటికే చేసిన కేటాయింపుల ప్రకారం  ఒక్కో కుటుంబానికి రూ. 3,509 చొప్పున అయ్యే ప్రీమియం మొత్తాన్ని పేదలపై పైసా భారం పడకుండా ప్రభుత్వమే పూర్తిగా భరించనుంది.  

వచ్చే నెల నుంచే ఈ పథకానికి సంబంధించిన క్షేత్రస్థాయి ప్రక్రియను ప్రారంభించేందుకు అధికార యంత్రాంగం అంతా సిద్ధమైంది. శనివారం  జరిగిన కేబినెట్​ సమావేశంలోనూ ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా చర్చకు వచ్చింది. జూన్​ 2న పథకానికి సంబంధించిన విధివిధానాలను రిలీజ్​ చేయనున్నట్టు తెలిసింది.  

పారదర్శకంగా.. సులభంగా..

ఈ మెగా ఇన్సూరెన్స్ పథకాన్ని అత్యంత పారదర్శకంగా, లబ్ధిదారులకు సులభంగా ఉండేలా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా వచ్చే నెల నుంచి ప్రభుత్వ సిబ్బంది నేరుగా ఇంటింటికీ వెళ్లి అర్హులైన వారి వివరాలను సమగ్రంగా నమోదు చేయనున్నారు. లబ్ధిదారుల ఎంపికలో ఎలాంటి రాజకీయ జోక్యానికి తావులేకుండా కేవలం తెల్ల రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకోనున్నారు. ఈ సర్వే ప్రక్రియలో కుటుంబ సభ్యులందరి వివరాలు సేకరించి, డిజిటల్ డేటాబేస్‌ను సిద్ధం చేయాలని అధికారులను కేబినెట్ సబ్ కమిటీ ఆదేశించింది. 

క్షేత్రస్థాయిలో నమోదు బాధ్యతలను పంచాయతీ కార్యదర్శులు, గ్రామ పాలన అధికారులు, మున్సిపల్ వార్డు అధికారులకు అప్పగించనున్నారు. ఎక్కడా ఎలాంటి అవకతవకలు జరగకుండా ప్రత్యేక మొబైల్ యాప్ ద్వారా ఈ వివరాలను నమోదు చేసేలా సాంకేతిక ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతీ పేద కుటుంబానికి ధీమా ఇవ్వడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని సర్కార్ భావిస్తున్నది.

కోరినవారి పేరు మీద పాలసీ..

ఇందిరమ్మ బీమా పథకంలో లబ్ధిదారులకు ప్రభుత్వం కీలక వెసులుబాటు కల్పిస్తున్నది. కుటుంబంలో ఎవరి పేరు మీద పాలసీ కోరితే వారి పేరుపైనే లైఫ్ ఇన్సూరెన్స్ వర్తింపజేస్తారు. సాధారణంగా ఇంటి యజమాని పేరు మీదనే బీమా ఉండే నిబంధనలకు భిన్నంగా, కుటుంబ సభ్యుల అభీష్టం మేరకే ఈ ఎంపిక ప్రక్రియ సాగనుంది. దీంతో కుటుంబంలో సంపాదించే వ్యక్తి లేదా వారు సూచించిన ముఖ్య వ్యక్తికి ఈ రక్షణ లభిస్తుంది. అయితే, ఈ పాలసీకి సంబంధించి  ఇన్సూరెన్స్​ కల్పించే వ్యక్తికి, నామినీకి  కనీస వయస్సు 18 ఏండ్లు నిండి ఉండాలనే నిబంధనను తీసుకురానున్నట్టు తెలిసింది. 

మైనర్లకు నామినీ హోదా పెడితే గార్డియన్​ డిక్లరేషన్​ అవసరం కనుక, కుటుంబంలో పెద్ద వయస్కులైన వారిని మాత్రమే నామినీగా ఎంచుకోవాలనే ప్రధాన సూచన చేయనుంది. క్లెయిమ్ ప్రక్రియలో భవిష్యత్తులో ఎలాంటి లీగల్ సమస్యలు రాకుండా ఉండేందుకే ఈ కనీస వయస్సు పరిమితిని ఖరారు చేసినట్టు తెలుస్తోంది. ఇక వయస్సు పరిమితి కూడా 60 ఏండ్లలోపు వాళ్లకే చేయనున్నారు. ప్రభుత్వానికి ఉన్న సమాచారం ప్రకారం 18–59 ఏండ్లలోపు ప్రతి ఏటా చనిపోతున్న వారి సంఖ్య 60 వేల దాకా ఉంటుంది. ఈ లెక్కన రూ.5 లక్షల చొప్పున పరిహారం ఇస్తే ఏడాదికి రూ.3 వేల కోట్లు అవుతాయి.  

ఒకే విడతలో ఇన్సూరెన్స్‌ కంపెనీలకు చెల్లింపు

రాష్ట్ర వార్షిక బడ్జెట్‌లో ఈ ఇందిరమ్మ బీమా పథకం కోసం ఏకంగా రూ. 4 వేల కోట్ల నిధులను ప్రభుత్వం కేటాయించింది.  అర్హులైన 1.15 కోట్ల కుటుంబాలకు రూ. 3,509 చొప్పున అయ్యే మొత్తం వార్షిక ప్రీమియం సొమ్మును ఒకే విడతలో ఇన్సూరెన్స్ కంపెనీలకు చెల్లించేందుకు సర్కార్ సర్వం సిద్ధం చేసింది. ఆర్థిక ఇబ్బందుల వల్ల ఏ ఒక్క పేద కుటుంబం కూడా బీమా పరిధి నుంచి దూరం కాకూడదనే ఉద్దేశంతోనే ఇంతటి భారీ బడ్జెట్‌ను కేటాయించారు. 

ఈ పథకాన్ని అత్యంత వేగంగా పట్టాలెక్కించేందుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలోని కేబినెట్ సబ్ కమిటీ త్వరలోనే సమావేశం కానుంది.  సబ్ కమిటీ సమావేశంలో ఇన్సూరెన్స్ కంపెనీల ప్రతినిధులు, ఉన్నతాధికారులతో కలిసి పాలసీ నిబంధనలను ఆఖరిసారిగా ఫైనల్ చేయాలని నిర్ణయించారు. 

అత్యవసర పరిస్థితుల్లో క్లెయిమ్ చేసుకున్న కేవలం పది రోజుల్లోనే నేరుగా నామినీ బ్యాంక్ ఖాతాలోకి బీమా సొమ్ము జమ అయ్యేలా రైతు బీమా కాన్సెప్ట్​ను బ్యాంకింగ్ చానెళ్లను అనుసంధానించనున్నారు. ఎలాంటి కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, మధ్యవర్తిత్వం లేకుండా దరఖాస్తు చేసిన వెంటనే క్లియరెన్స్ వచ్చేలా సింగిల్ విండో విధానాన్ని ప్రవేశపెడుతున్నారు.