ఐటీఐ ప్రిన్సిపాల్స్ కు తొలిసారి అవార్డులు

ఐటీఐ ప్రిన్సిపాల్స్ కు తొలిసారి అవార్డులు
  • ఏటీసీల్లో వంద శాతం అడ్మిషన్లు వారికి గుర్తింపు
  • టీచర్స్ డే సందర్భంగా అందజేయనున్న మంత్రి వివేక్ వెంకటస్వామి

హైదరాబాద్, వెలుగు: కార్మిక శాఖలో తొలిసారి ఇండస్ర్టియల్  ట్రైనింగ్  ఇన్ స్టిట్యూట్ (ఐటీఐ) ప్రిన్సిపాల్స్ కు అవార్డులు అందించనున్నారు. ప్రిన్సిపాల్స్ తో పాటు ట్రైనింగ్  ఆఫీసర్లు, అసిస్టెంట్  ట్రైనింగ్  ఆఫీసర్, డిప్యూటీ ట్రైనింగ్  ఆఫీసర్లకు టీచర్స్ డేను పురస్కరించుకుని ఈ అవార్డులు ప్రదానం చేయనున్నారు. 

సోమవారం హైదరాబాద్  రెడ్ హిల్స్ లోని ఎఫ్ టీటీసీ ఆడిటోరియంలో కార్మిక శాఖ మంత్రి వివేక్  వెంకటస్వామి, కార్మిక శాఖ ప్రిన్సిపల్  సెక్రటరీ దానకిశోర్  ఈ పురస్కారాలను ప్రధనం చేయనున్నారు. గత ఏడాది సెప్టెంబర్ 6 నుంచి ఈ ఏడాది సెప్టెంబర్ 6 వరకు వారి పనితీరును బట్టి అవార్డులకు ఎంపిక చేశారు. 

ఇందుకోసం కొద్ది రోజుల క్రితం జాయింట్  డైరెక్టర్  నగేశ్  చైర్మన్ గా, ఇద్దరు రీజనల్ డైరెక్టర్లు, డిప్యూటీ డైరెక్టర్, అడిషనల్  డైరెక్టర్లతో కార్మిక శాఖ ప్రిన్సిపల్  సెక్రటరీ దాన కిశోర్  జ్యూరీ కమిటీని ఏర్పాటు చేశారు. రాష్ర్టంలో ఉన్న నాలుగు కేటగిరిల అధికారులను ఈ అవార్డుల కోసం ఆన్ లైన్ లో అప్లై చేసుకోవాలని సూచించారు. ఇందుకు ప్రమాణాలను ఖరారు చేశారు. రాష్ర్టంలో 64 అడ్వాన్స్ డ్  టెక్నాలజీ సెంటర్లు (ఏటీసీలు) ఉండగా ఇందులో 54 ఏటీసీల్లో వంద శాతం అడ్మిషన్లు పూర్తయిన ప్రిన్సిపాల్స్ ను అవార్డుకు ఎంపిక చేశారు.