
- ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం
హైదరాబాద్/కరీంనగర్, వెలుగు: 2025 సంవత్సరానికి గాను దాశరథి కృష్ణమాచార్య అవార్డుకు ప్రముఖ కవి, కాలమిస్ట్ అన్నవరం దేవేందర్ ఎంపికయ్యారు. ఈ మేరకు సోమవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. యువజన అభ్యున్నతి, పర్యాటక, సాంస్కృతిక శాఖ ప్రతి ఏటా ఈ పురస్కారాన్ని అందజేస్తుంది. ఈ అవార్డు ప్రదానానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. అవార్డు గ్రహీతకు రూ.1,01,116 నగదు బహుమతితో పాటు జ్ఞాపిక, శాలువా అందజేస్తారు. ఈ అవార్డు గ్రహీతను ఎంపిక చేసేందుకు ప్రభుత్వం ఒక కమిటీ ఏర్పాటు చేసింది.
భాషా, సాంస్కృతిక శాఖ డైరెక్టర్, కమిటీ సభ్య కార్యదర్శి తెలిపిన వివరాల ప్రకారం.. ఈ కమిటీ 2025, జులై 16న కళా భవన్, హైదరాబాద్‌లోని డైరెక్టర్ ఛాంబర్స్‌లో సమావేశమై అన్నవరం దేవేందర్ పేరును ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనను ప్రభుత్వం ఆమోదించింది. అన్నవరం దేవేందర్ రాసిన రచనల్లో తొవ్వ, మరోకోణం (సామాజిక వ్యాసాలు), నడక, మంకమ్మ తోట లేబర్ అడ్డా,- బుడ్డపర్కలు (నానీలు), బొడ్డు మల్లె చెట్టు, పొద్దు పొడుపు, ఫార్మాల్యాండ్ ఫ్రాగ్రెన్స్ వంటివి ఉన్నాయి.
కాగా, కరీంనగర్ జిల్లాకు చెందిన అన్నవరం దేవేందర్.. కవి, రచయిత, కాలమిస్ట్ గా 25 ఏండ్లుగా తెలంగాణ తెలుగులో కవిత్వాలు రాస్తున్నారు. 1986 టైమ్‌లో వివిధ పత్రికల్లో జర్నలిస్టుగా పని చేశారు. పంచాయతీరాజ్ శాఖలో ఉద్యోగం చేసి రిటైర్ అయ్యారు. జాతీయ, రాష్ట్ర స్థాయిలో 25కు పైగా పురస్కారాలు అందుకున్నారు. నిరుడు ప్రముఖ కవి, రచయిత జూకంటి జగన్నాథంకు దాశరథి కృష్ణమాచార్య పురస్కారం లభించింది.