జిల్లాల పేర్లు మార్చేందుకు ప్రభుత్వ నోటిఫికేషన్ 

జిల్లాల పేర్లు మార్చేందుకు ప్రభుత్వ నోటిఫికేషన్ 

వరంగల్‌ అర్బన్‌, వరంగల్‌ రూరల్ జిల్లాలను హన్మకొండ, వరంగల్‌ జిల్లాలుగా మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది. మార్పుపై అభ్యంతరాలు, వినతులకు నెల రోజుల గడువు విధించింది. హన్మకొండ, పరకాల రెవెన్యూ డివిజన్లతో కలిపి హన్మకొండ జిల్లా ఏర్పాటు చేస్తున్నట్లు నోటిఫికేషన్‌లో తెలిపింది.

రెండు జిల్లాల పేర్లు మారుస్తున్నట్లు వరంగల్‌ పర్యటనలో భాగంగా జూన్‌ 21న సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. ప్రజాప్రతినిధులు, స్థానికుల విజ్ఞప్తుల ప్రకారం వరంగల్ అర్బన్ జిల్లా పేరును హన్మకొండ జిల్లాగా మార్చుతామని సీఎం తెలిపారు. మొత్తం 12 మండలాలు ఈ జిల్లా పరిధిలోకి రానున్నాయి. వరంగల్‌ పశ్చిమ నియోజకవర్గం కేంద్రంగా హన్మకొండ జిల్లా కేంద్రం కొనసాగుతుంది. ఇందులో హన్మకొండ, కాజీపేట, ఐనవోలు, ధర్మసాగర్‌, వేలేరు, వర్ధన్నపేట, రాయపర్తి, పర్వతగిరి, హసన్‌పర్తి, ఎల్కతుర్తి, భీమదేవరపల్లి, కమలాపూర్‌ మండలాలు ఉండనున్నాయి.

వరంగల్‌, ఖిలావరంగల్‌, సంగెం, గీసుకొండ, ఆత్మకూరు, దామెర, పరకాల, నడికూడ, శాయంపేట, నర్సంపేట, నెక్కొండ, చెన్నారావుపేట, నల్లబెల్లి, దుగ్గొండి, ఖానాపురం మండలాలు వరంగల్‌ జిల్లాలో ఉండే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించి పరిశీలించిన తర్వాత గెజిట్ విడుదల చేయనుంది.