రైతుకు రక్షణలేని రాజ్యం.. వ్యవసాయంపై దశ దిశ లేని రాష్ట్ర ప్రభుత్వం

రైతుకు రక్షణలేని రాజ్యం.. వ్యవసాయంపై దశ దిశ లేని రాష్ట్ర ప్రభుత్వం

గుప్తుల కాలం స్వర్ణయుగమని చరిత్ర పాఠాల్లో చదువుకుంటాం! నిజంగా నాటి కాలం స్వర్ణ యుగమా, ప్రజల స్థితిగతులేంటి అనేది వాస్తవంగా ఎవరికీ తెలియదు. ఫాహియాన్, హుయాన్ సాగ్ లాంటి విదేశీ లేఖకులు రాజదర్బారులో కూర్చొని రాసిన రాతలవి. పాలకులు, రాజ్యానికి వ్యతిరేకంగా రాస్తే పరిస్థితి ఏంటో నేటి ప్రజాస్వామిక వ్యవస్థలో చూస్తూనే ఉన్నాం. కేసీఆర్ బంగారు తెలంగాణ కూడా అలాంటి ప్రచారమే అనడం అతిశయోక్తి ఏమీ లేదు.

కోటి ఎకరాలకు సాగునీళ్లిస్తే.. 27 లక్షల బోర్లు ఎందుకు నడుస్తున్నయ్​

కేసీఆర్ ​ప్రచారం చేస్తున్న కోటి ఎకరాలకు సాగు నీరు అనే మాటల్ని నమ్మడం మన కంటిని మన వేళ్లతోనే పొడుచుకోవడం లాంటిది. కోటి ఎకరాలకు సాగునీరు అందించినట్లు చెప్పడం కేసీఆర్ గారడి మాటలకు నిదర్శనం. నిజానికి దక్కన్ పీఠభూమిపై  ఉన్న తెలంగాణ సగటు వర్షపాతం 600 మి.మీ. నుంచి 900 మి.మీ. ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకునే కాకతీయులు, నైజాం, తర్వాత వచ్చిన ప్రభుత్వాలు బహుళార్దక, మధ్యతరహా, చిన్నతరహా ప్రాజెక్టులు నిర్మించి ఆబి, తాబి (ఖరీఫ్, రబీ)కి నీరందించిన చరిత్ర ఉంది. గొలుసు కట్టు చెరువుల నిర్మాణానికి ఏడో నిజాం పెట్టింది పేరు. నిజాం రాష్ట్రంలో 50 వేలకు పైగా చెరువులు ఉన్న సంగతి తెలిసిందే. ఇంత గొప్ప నీటి పారుదల సౌకర్యాలు దాదాపు దేశంలో ఏ ప్రాంతంలోనూ కానరావు. దీనికి తోడు మెట్ట వ్యవసాయం, వర్షాధారిత పంటలు తెలంగాణలో మెండుగా ఉండి అన్ని రకాల పంటలకు ఆలవాలంగా వుండేది. ఒకప్పుడు ఈ ప్రాంతం గొప్ప ధాన్యాగారం. దాదాపు అన్ని గ్రామాలు చెరువులు, కుంటలు, చిన్న పాటి ఆనకట్టలతో నీటిసౌలత్​తో ఉండేవి. కానీ నేడు అవి అన్యాక్రాంతమై రాజకీయ నాయకుల చేతుల్లోకి వారి అనుంగుల చేతుల్లోకి వెళ్లి పోయాయి. మరి తెలంగాణ ఏర్పడిన తర్వాత వీటిని కేసీఆర్ ఎందుకు తిరిగి స్వాధీనం చేసుకోలేదో చెప్పాలి. ఇంత పటిష్టమైన నీటి పారుదల సౌకర్యాలున్న తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు వచ్చిన తర్వాతనే వ్యవసాయం ప్రారంభించినట్లుగా ప్రచారం చేయడం విడ్డూరం. సాగు నీటికి పెద్దపీట వేస్తున్నం.. మారుమూల గ్రామాల బీడు భూములకు సైతం నీరందిస్తున్నం అంటున్న రాష్ట్రంలో ప్రభుత్వ లెక్కల ప్రకారమే 27 లక్షల బోరుబావులు ఎందుకు నడుస్తున్నాయో వివరణ ఇవ్వాలి. సస్యశ్యామల రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నారో మాట్లాడాలి. డిసెంబర్ నాటికే భూగర్భజలాలు ఎందుకు అడుగంటుతున్నాయో స్పష్టంచేయాలి.

రైతుబంధుతో ఎక్కువ లాభమెవరికి

రైతుబందు విషయంలో కేసీఆర్ దేశంలోనే కాదు ప్రపంచ స్థాయిలో రికార్డు సాధించారు. ఈ పథకం ద్వారా నిజంగా ఎవరు లబ్ధి పొందుతున్నారో వైట్​పేపర్ విడుదల చేయాలి. తెలంగాణ సామాజిక అభివృద్ధి నివేదిక-2017 ప్రకారం రాష్ట్రంలోని రైతు బంధు అందుతున్న భూముల్లో 19 శాతం కేవలం 3 శాతం మంది భూస్వాముల చేతిలో ఉంది. 25 శాతం భూమి (5 నుంచి పది ఎకరాల మధ్య) 11 శాతం మంది రైతుల ఆధీనంలో ఉంది. 86 శాతం మంది సన్న చిన్నకారు రైతుల చేతుల్లో ఉన్న భూమి 56 శాతమే. ఈ లెక్కన కేసీఆర్ ప్రభుత్వం ఇస్తున్న రైతుబంధుతో లాభం పొందుతున్నది ఎక్కువగా భూస్వాములే. నిజంగా వ్యవసాయంచేసే సన్న, చిన్నకారు రైతులకు దక్కుతున్న లబ్ది నామమాత్రమే. భూస్వాములు రైతుబంధు తీసుకుంటూ.. తమ భూమిని కౌలుకు ఇస్తూ రెండు రకాలుగా ఆదాయం పొందుతున్నారు. కౌలుకు తీసుకొని సాగు చేసిన వారికి ప్రభుత్వం నుంచి ఎలాంటి 
ప్రయోజనాలు అందడం లేదు. నష్టం వస్తే ఆత్మహత్యలే వారికి దిక్కవుతున్నాయి. స్థానిక సంస్థల ఆర్థిక పుష్టి కోసం మొదలైన తైబజారు వసూళ్లు రైతు సంక్షేమ రాజ్యంలో కూడా ఎందుకు కొనసాగుతున్నాయి?  వసూలు చేసిన సొమ్ముతో రైతులకు కల్పిస్తున్న సౌకర్యాలేంటి? మార్కెట్ సౌకర్యాలు, ఉచితంగా అమ్ముకునే విధానం, పంట నష్టం నుంచి రక్షణలేని రాష్ట్రం  రైతుబంధు రాజ్యంగా ప్రచారం చేయడం విచారకరం. తెలంగాణలో ఒకప్పుడు క్రాప్​ పాలసీలు, పంట మార్పిడి ఉండేది. దీంతో భూములు చేవగలిగి, పురుగులు, తెగుళ్ల బెడద ఉండేది కాదు. ఖరీఫ్, రబీ సీజన్లో వరి పండించినా, వేరు వేరు వంగడాలు పెట్టేవారు. కానీ ఇప్పుడు అంతా మారిపోయింది. ఎటుచూసినా వరి పొలాలే. ప్రభుత్వం ప్రోత్సహించడంతో రైతులంతా వరివైపు మళ్లడంతో ఇతర పంటల దిగుబడి తగ్గుతున్నది. నేల నిస్సారమైతున్నది. ఆరోగ్య రీత్యా కేవలం వరి అన్నాన్నే తినడం కూడా మంచిది కాదు. బియ్యంతో పాటు మొక్క జొన్నలు, జొన్నలు, రాగులు, ఇతర తృణ ధాన్యాలను విరివిగా పప్పు దినుసులను కూరగాయాలను వాడాల్సిందే. ఇలా అన్ని రకాల పంటలు పండించాల్సిందే. ఈ విషయాల్ని కేసీఆర్ పట్టించుకున్న సందర్భం లేదు. ఆరోగ్య తెలంగాణ కావాలంటే వ్యవసాయం కూడా ఆరోగ్యంగా ఉండాలె.

‘కాళేశ్వరం’ గొప్పలు..ఓ పెద్ద గోబెల్స్​ ప్రచారం

వ్యవసాయ రంగంపై ప్రచారాలు, హామీలు ప్రధాన అస్త్రాలుగా కేసీఆర్ దేశంలో రాజకీయాలకు బయల్దేరారు. మరి నిజంగా తెలంగాణలో వ్యవసాయం రంగం ఎంత అభివృద్ధి జరిగింది అని చూసినప్పుడు రాజకీయ ప్రచారం మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు చుట్టూ తిరుగుతున్నది. మాజీ సీఎం వైఎస్ఆర్​ చేపట్టిన ప్రాణహిత–చేవేళ్ల ప్రాజెక్టు రూపు రేఖల్ని మార్చి తప్పుడు గణాంకాల్ని చూపి కేసీఆర్​దాన్ని తన ఆలోచనగా ప్రచారం చేసుకుంటున్నారు. లక్ష కోట్ల రూపాయల భారీ వ్యయంతో అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు పంపు హౌస్​లు మొదటి వరదకే ఎందుకు మునిగాయో చెప్పాలి. ఇంతాచేస్తే కాళేశ్వరం నీరు శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు చేరుకోలేదు. అప్పర్ మానేరును పలకరిం చనేలేదు. నిజాంసాగర్​ను కనికరించ లేదు. ఏయే పరివాహక ప్రాంతాల నుంచి గోదావరికి నీరు లభిస్తుందో, ఆ ప్రాంతాలకే మళ్లీ ఆ జలాల్ని పంపిస్తాననడమే ఓ పెద్ద గోబెల్స్ ప్రచారం.

డాక్టర్ లచ్చయ్య గాండ్ల