క్రిస్టియన్, ముస్లింల భవనాలకు నో ఫండ్స్

క్రిస్టియన్, ముస్లింల భవనాలకు నో ఫండ్స్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ముస్లిం, క్రిస్టియన్​మైనార్టీల సంక్షేమం కోసం చేపట్టిన ముఖ్య భవనాల నిర్మాణాలు ఏండ్లు గడుస్తున్నా పూర్తి కావడం లేదు. నిధులు కేటాయిస్తున్నట్లు కాగితాల్లో చూపిస్తున్నా, ఫండ్స్​రాక పనులు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. క్రిస్టియన్ భవన్, మక్కా మసీద్​రిపేర్స్, జేపీ దర్గా డెవలప్​మెంట్, తెలంగాణ ఇస్లామిక్​కల్చరల్ అండ్ కన్వెన్షన్ సెంటర్, రాష్ట్రవ్యాప్తంగా చర్చిల్లో రిపేర్స్, రినోవేషన్​పనులు, కొత్త వక్ఫ్ ఇన్​స్టిట్యూట్ల నిర్మాణం, 117 చోట్ల షాదీఖానాల నిర్మాణం.. ఇలా ముస్లిం, క్రిస్టియన్​మైనార్టీలకు సంబంధించిన ముఖ్య భవనాల నిర్మాణాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. వీటికి మొత్తం రూ.538 కోట్లు మంజూరు చేసినట్లు ప్రభుత్వం కాగితాల్లో లెక్కలు చూపెడుతున్నా, ఇప్పటి వరకు రిలీజ్​చేసింది రూ.131 కోట్లు మాత్రమేనని ఆఫీసర్లు అంటున్నారు.

50 కోట్ల హామీ ఉత్తదేనా..

రంగారెడ్డి జిల్లా కొత్తూరు పరిధిలో ప్రసిద్ధి చెందిన జహంగీర్ పీర్ దర్గాను పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దుతామని 2017లో అక్కడ పర్యటన సందర్భంగా సీఎం కేసీఆర్ తెలిపారు. ఏడాదిలోగా జేపీ దర్గాను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని అందుకు రూ.50 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. నాలుగేండ్లు అవుతున్నా పనులు మాత్రం మొదలు కాలేదు. అక్కడ100 ఎకరాల్లో విశ్రాంతి గదులు కూడా నిర్మిస్తామని చెప్పినా ఆ ప్రతిపాదన ఇంకా ప్లాన్​కే పరిమితమైంది. డెవలప్​మెంట్ కు 4 ఎకరాల స్థలం గుర్తించారు. కానీ పనులు మాత్రం మొదలుపెట్టలేదు. మక్కా మసీద్​ రెనోవేషన్​, ఇతర రిపేర్ల పనులు కూడా మూడేండ్లుగా సాగుతూనే ఉన్నాయి. రూ.9 కోట్లతో చేపట్టిన ఈ పనుల్లో ఇంకా 40 శాతం చేయాల్సి ఉంది.

రాష్ట్రంలో కొత్తగా వక్ఫ్​ఇన్​స్టిట్యూట్లు నిర్మించడంతో పాటు ఉన్నవాటిని డెవలప్​చేస్తామని టీఆర్​ఎస్​పార్టీ రెండుసార్లు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టడమే కాకుండా పలుమార్లు అసెంబ్లీ వేదికగా సీఎం కేసీఆర్ కూడా హామీ ఇచ్చారు. వీటి కోసం రూ.293 కోట్లు కేటాయించినా, రూ.30 కోట్లే ఇచ్చినట్లు ఆఫీసర్లు చెప్తున్నరు. రాష్ట్రవ్యాప్తంగా 117 చోట్ల షాదీఖానాలు నిర్మిస్తామని చెప్పారు. ఇందుకు రూ.41.49 కోట్లు కేటాయించినప్పటికీ నిధులు మాత్రం రిలీజ్​చేయలేదు. హైదరాబాద్ కోకాపేటలో పది ఎకరాల విస్తీర్ణంలో అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఇస్లామిక్ కల్చరల్ కన్వెన్షన్ సెంటర్(టీఐసీసీసీ) ను నిర్మించాలని రాష్ట్ర సర్కార్​2017లో నిర్ణయించింది. ఆ ఏడాది అక్టోబర్​23వ తేదీన సీఎం కేసీఆర్​ మూడు వారాల్లోగా నిర్మాణ పనులు మొదలు పెట్టాలని ఆదేశించారు.10 ఎకరాల స్థలం గుర్తించి మైనార్టీ వెల్ఫెర్​డిపార్ట్​మెంట్​కు అప్పగించారు. ఇది జరిగి నాలుగేండ్లు పూర్తవుతున్నా ఇంతవరకు నిర్మాణ పనులు మొదలు పెట్టలేదు.

స్థలం మాత్రమే కేటాయించి..

క్రిస్టియన్లకు భవనం నిర్మిస్తామని టీఆర్ఎస్​  2014 ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొంది. అధికారంలోకి వచ్చాకా జీవో ఇచ్చినా.. ఏడేండ్ల నుంచి నిర్మాణ పనులు మాత్రం చేపట్టలేదు.10 ఎకరాల స్థలం కేటాయించామని చెప్తున్నారే తప్ప అక్కడ మట్టి కూడా తీయలేదు. క్రిస్టియన్ శ్మశాన వాటికల కోసం ఒక్క రూపాయి కేటాయించలేదు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలు, మండల కేంద్రాల్లో గ్రేవ్​యార్డుల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించినప్పటికీ మూడు ప్రాంతాల్లోనే స్థలాలను గుర్తించారు. మేడ్చల్ లో 5, రంగారెడ్డి జిల్లాలో 4, వికారాబాద్​లో ఒక చోట కలిపి 42.21 ఎకరాలు గుర్తించారు. వాటి నిర్మాణాలు మాత్రం మొదలుపెట్టలేదు. రాష్ట్రవ్యాప్తంగా 411 చర్చిల్లో రినోవేషన్​పనులు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. కానీ 43 చోట్లనే పూర్తి చేశారు. ఈ పనులకు గానూ మొత్తం రూ.32 కోట్లకు రూ.5 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు.