ఫ్రీ కరెంటు అన్నరు.. ఫ్యూజులు పీక్కపోతున్రు

ఫ్రీ కరెంటు అన్నరు.. ఫ్యూజులు పీక్కపోతున్రు
  • ఏప్రిల్ నుంచి అమల్లోకి వస్తుందని జీవో ఇచ్చినా ఫాయిదా లేదు
  • సీఎం మాటలు నమ్మి 3 నెలల నుంచి బిల్లులు కట్టని లబ్ధిదారులు
  • ఎక్కడికక్కడ లైన్లు కట్​ చేస్తున్న కరెంటోళ్లు

హైదరాబాద్‌‌, వెలుగు: సెలూన్లు, లాండ్రీ షాపులు, దోభీఘాట్లకు రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన ‘ఫ్రీ కరెంట్’ అమలైతలేదు. సర్కారు జీవో ఇచ్చినా.. కరెంట్​ బిల్లులు వస్తూనే ఉన్నాయి. బిల్లులు కట్టకపోతే కరెంటోళ్లు ఫ్యూజులను పీక్కపోతున్నారు. కరెంట్​ లైన్లు కట్​ చేస్తున్నారు. నాయీబ్రాహ్మణుల సెలూన్లు, రజకుల లాండ్రీ షాపులు, దోభీఘాట్లకు 250 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్‌‌ ఇస్తామని 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుంచి సీఎం కేసీఆర్ హామీ ఇస్తూ వస్తున్నారు. జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో, నాగార్జున సాగర్​ ఉప ఎన్నికలోనూ దీన్నే ప్రచారం చేసుకున్నారు. ఎట్టకేలకు ఇందుకు సంబంధించి ఏప్రిల్​  4న సర్కారు జీవో ఇచ్చింది. మారుమూల పల్లె నుంచి పట్నం వరకు ఏప్రిల్‌‌ ఫస్ట్​  నుంచి ‘250 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్’ ఇస్తామని అదే రోజు సీఎం స్పష్టం చేశారు. ఈ మాటలు నమ్మి.. చాలా మంది బిల్లులు కట్టలేదు. కానీ ఎప్పటిలాగానే  మే, జూన్​లో కరెంట్ ​బిల్లులు జనరేట్​ అయ్యాయి. జులైలోనూ వచ్చాయి. బిల్లులు కట్టడం లేదని చెప్పి కరెంట్​ సిబ్బంది కరెంట్​ లైన్లు కట్​ చేస్తున్నారు. 

ఫ్రీ కరెంట్​ గురించి ప్రశ్నిస్తే.. ఉన్నతాధికారుల నుంచి తమకు ఎలాంటి ఆదేశాలు రాలేదని, కరెంట్‌‌‌‌ బిల్లులు కట్టాల్సిందేనని కరెంటోళ్లు తేల్చిచెప్తున్నారు. ఒక్కో షాపునకు మూడు నెలల కరెంట్​ బిల్లు వేలల్లో జనరేట్​ అయింది. వాటిని కట్టే స్థోమత లేక నాయీ బ్రాహ్మణులు, రజకులు షాపులను మూసేస్తున్నారు. 

మొన్నటి దాకా దరఖాస్తులంటిరి.. ఇప్పుడేమాయె..?

ఏప్రిల్​ నుంచి ఫ్రీ కరెంట్​ అమలు చేస్తామని చెప్పిన సర్కారు ఇందుకు సంబంధించి జూన్​ 30 వరకు దరఖాస్తులు తీసుకుంది. మొదట దరఖాస్తులకు అనేక నిబంధనల పేరుతో కొర్రీలు పెట్టినా వివిధ సంఘాల విజ్ఞప్తుల మేరకు సడలింపులు ఇచ్చింది.  నాయీ బ్రాహ్మణుల నుంచి 16 వేలు, రజకుల నుంచి 9,883 అప్లికేషన్లు వచ్చాయి. గత రెండు నెలలు అప్లికేషన్ల ప్రాసెస్‌‌‌‌ కొనసాగిందనుకున్నా.. ఈ నెలైనా బిల్లులు జనరేట్‌‌‌‌ కావద్దు. కానీ ఇప్పుడు బిల్లులు రావడంతో ఆయా వృత్తిదారులు అయోమయానికి గురవుతున్నారు. 3 నెలల నుంచి బిల్లులు కట్టకపోవడంతో ఒక్కో షాపునకు రూ. వేలల్లో బిల్లులు వచ్చాయి. వాటికి డబ్బులు ఎక్కడికెంచి తెచ్చి కట్టాల్నని, సర్కారు మాటలు నమ్మితే  ఫ్యూజులు గుంజుకపోతున్నారని నాయీ బ్రాహ్మణులు, రజకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు కరెంట్‌‌‌‌ బిల్లు కట్టాల్నా? వద్దా? అనేది తెలియక ఆందోళన చెందుతున్నారు.

అప్లయ్​ చేసుకునేందుకు మరో చాన్స్‌‌‌‌..!

‘ఫ్రీ కరెంట్’ స్కీం  కోసం వేల మంది ఇంకా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. అప్లయ్​ చేసుకునేందుకు క్యాస్ట్ సర్టిఫికెట్​కావాల్సి ఉండటంతో కరోనా, ఇతర కారణాలతో అనేక మందికి సర్టిఫికెట్లు ​లభించలేదు. వాటి కోసం తహసీల్దార్‌‌‌‌ ఆఫీసుల చుట్టు తిరుగుతున్నారు. వీళ్లు కూడా దరఖాస్తు చేసుకోవడానికి మరోసారి అవకాశం ఇస్తున్నట్లు రజక, నాయీ బ్రాహ్మణ సంఘాలకు అధికారులు తెలియజేశారు. వెబ్‌‌‌‌సైట్‌‌‌‌ ఓపెన్‌‌‌‌లోనే ఉంది. కొత్తగా అప్లై చేసుకున్న వాళ్లకు ఏప్రిల్‌‌‌‌ నుంచి కాకుండా, అప్లయ్​ చేసుకున్న తర్వాత నెల నుంచి ఫ్రీ కరెంట్​ స్కీం అమల్లోకి వస్తుందని ఆఫీసర్లు చెప్తున్నారు. ఇంకా 10 వేల మంది రజకులు, 50 వేల మంది నాయీ బ్రాహ్మణులు దరఖాస్తు చేసుకునేందుకు ఎదురుచూస్తున్నారు. 

పేరు ఆర్‌‌.రాంచంద్రం. నిజామాబాద్‌‌ టౌన్‌‌లో లాండ్రీ షాపు నడిపిస్తున్నరు. ఏప్రిల్​ నుంచి ఫ్రీ కరెంట్‌‌ అని సర్కారు చెప్పడంతో బిల్లు కట్టలేదు. దీంతో వారం కింద కరెంటోళ్లు వచ్చి ఫ్యూజ్‌‌ తీసుకపోయిన్రు. ప్రభుత్వం చెప్పిన ఫ్రీ కరెంట్​ గురించి కరెంటోళ్లను  ప్రశ్నిస్తే.. తమకేం తెల్వదని, ఫస్ట్‌‌  బిల్లు కట్టాలని చెప్పిన్రు. ఏప్రిల్​ నుంచి వరుసగా మూడు నెలల కరెంట్​ బిల్లు రూ. 8,800 కట్టలేక రాంచంద్రం తన షాపును బంజేసిన్రు. 

సీఎం చెప్పిండని నమ్మినం

సీఎం చెప్పడంతో ఫ్రీ కరెంట్ అనే నమ్మినం. పోయిన నెలలో అప్లికేషన్‌‌ కూడా పెట్టుకున్నం. కానీ ఈ నెల మళ్లీ కరెంట్‌‌ బిల్లు వచ్చింది. ఇంకా పేమెంట్‌‌ చేయలేదు. ఏం చేయాల్నో అర్థమైతలేదు. అందరి పరిస్థితి ఇట్లనే ఉంది.  
‑ మహేశ్​, నాయీబ్రాహ్మణుడు, రాంనగర్, హైదరాబాద్‌‌

కరెంట్​ కట్​ చేయొద్దు

నాయీబ్రాహ్మణులంతా ఫ్రీ కరెంట్‌‌‌‌ అనే మూడ్‌‌‌‌లోనే ఉన్నారు. బిల్లులు మాత్రం జనరేట్‌‌‌‌ అయ్యాయి. కొంత మంది కట్టారు. మరికొందరు పేమెంట్‌‌‌‌ చేయలేదు. దీనిపై కరెంట్‌‌‌‌ ఆఫీసర్లకు పూర్తి క్లారిటీ ఇవ్వాలి. అప్లికేషన్‌‌‌‌  ఫాం రిసిఫ్టు చూపిస్తే కనీసం కరెంట్‌‌‌‌ కట్‌‌‌‌ చేయకుండానైనా ఆదేశాలు ఇవ్వాలి.
- దేవరకొండ నాగరాజు, ప్రెసిడెంట్‌‌‌‌, తెలంగాణ రాష్ట్ర నాయీబ్రాహ్మణ సంఘం 

వెంటనే అమలు చేయాలి

ఏప్రిల్‌‌‌‌ నెల నుంచి ఉచిత కరెంట్ ఇస్తామని సీఎం కేసీఆర్ చెప్పారు. అదే నెల నుంచి దరఖాస్తులు కూడా తీసుకున్నారు. గత నెల 30న అప్లికేషన్ల ప్రక్రియ ముగిసింది. కానీ ఇంకా బిల్లులు వస్తూనే ఉన్నాయి. వృత్తిదారులు మాత్రం ఫ్రీ కరెంట్‌‌‌‌ వస్తుందనే ధీమాతో పేమెంట్‌‌‌‌ చేయలేదు. దీంతో కరెంట్​ సిబ్బంది లైన్లు కట్‌‌‌‌ చేస్తున్నారు. సీఎం ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలి. 
- కె. సంపత్, బీజేపీ రజక సెల్, కన్వీనర్‌‌‌‌