హుజురాబాద్ బైపోల్‌కు సిద్ధంగా లేమన్న సర్కార్

హుజురాబాద్ బైపోల్‌కు సిద్ధంగా లేమన్న సర్కార్

దేశంలోని 4 అసెంబ్లీ నియోజకవర్గాల ఉపఎన్నికలకు ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చింది. బెంగాల్ లోని భవానీపూర్, షంషేర్ గంజ్, జంగిపూర్ నియోజకవర్గాలతో పాటు... ఒడిశాలోని పిప్లి నియోజకవర్గానికి కూడా ఉపఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 6న వీటికి నోటిఫికేషన్ రానుంది. ఈ నెల 30 పోలింగ్ నిర్వహిస్తారు. అక్టోబర్ 3న ఓట్ల లెక్కింపు ఉంటుంది.

అయితే దేశవ్యాప్తంగా 3 లోక్ సభ నియోజకవర్గాలు, 30కిపైగా అసెంబ్లీ నియోజకవర్గాలు ఖాళీగా ఉన్నాయి. వాటిల్లో బైపోల్స్ జరగాల్సి ఉంది. ఈ మధ్యే ఆయా రాష్ట్రాల అధికారులతో ఎలక్షన్ కమిషన్ చర్చలు జరిపింది. ఎన్నికల నిర్వహణకు అనుకూలమా... కాదా అనేది చర్చించింది. అయితే ప్రస్తుతం పండగలు, కరోనా లాంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని ఎన్నికలు నిర్వహించేందుకు తాము సిద్ధంగా లేమని 11 రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలు ECIకి రాతపూర్వకంగా తమ అభిప్రాయం తెలిపారు. ఇందులో తెలంగాణ కూడా ఉంది. దీంతో రాష్ట్రంలోని హుజూరాబాద్ నియోజకవర్గ ఉపఎన్నిక మరింత లేట్ కానుంది. 

ఎన్నికలకు పూర్తి సిద్ధంగా ఉన్నామని తెలిపిన... బెంగాల్ కూడా ఖాళీగా అన్ని నియోజకవర్గాలకు ఉపఎన్నికలు నిర్వహించడంలేదు. ఆ రాష్ట్రంలో 7 ఖాళీలుండగా... 3 నియోజకవర్గాలకు మాత్రమే షెడ్యూల్ విడుదలైంది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎమ్మెల్యేగా లేరు. సాధారణ ఎన్నికల్లో నందిగ్రామ్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు మమత. దీంతో ఆమె అసెంబ్లీకి ఎన్నిక కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. భవానీ పూర్ నియోజకవర్గం నుంచి ఆమె పోటీ చేయనున్నారు.