సర్కారు దవాఖాన్ల బ్రాండింగ్ ఇంకెప్పుడు?..కాగితాలకే పరిమితమైన కార్పొరేట్ లుక్

సర్కారు దవాఖాన్ల బ్రాండింగ్ ఇంకెప్పుడు?..కాగితాలకే పరిమితమైన కార్పొరేట్ లుక్
  • కలర్ కోడెడ్ లైటింగ్, రిసెప్షన్, హెల్ప్ డెస్కులంటూ హడావుడి 
  • ప్రైవేట్​ సంస్థ డిజైన్లు నచ్చక పక్కనపెట్టిన అధికారులు 
  • ఏడాది దాటినా మొదలుకాని పనులు

హైదరాబాద్, వెలుగు: వైద్యారోగ్య శాఖ ఎంతో ఆర్భాటంగా ప్రకటించిన సర్కారు దవాఖాన్ల బ్రాండింగ్ ప్రక్రియ అటకెక్కింది. ప్రైవేటు హాస్పిటల్స్ కు దీటుగా కలర్ కోడెడ్ లైటింగ్, డిజిటల్ బోర్డులు, హెల్ప్ డెస్కులు, ఆధునిక వెయిటింగ్ హాల్స్ ఏర్పాటు చేస్తామన్న హామీలు ఏడాది దాటినా కాగితాలకే పరిమితమయ్యాయి. మంత్రి దామోదర రాజనర్సింహ ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన ఈ ప్రాజెక్టు, కనీసం పైలట్ దశను కూడా దాటకపోవడం అధికారుల అలసత్వానికి అద్దం పడుతోంది. ప్రైవేట్ కన్సల్టెన్సీ రూపొందించిన మోడల్ డిజైన్లు పేలవంగా ఉండటం, మరోవైపు ప్రపంచ బ్యాంకు నిధుల రాకలో తీవ్ర జాప్యం తలెత్తడంతో ఈ ఆధునీకరణపై నీలినీడలు కమ్ముకున్నాయి.

గాంధీలోనే ఆగిన పైలట్ ప్రాజెక్ట్ 

ప్రభుత్వ హాస్పిటల్స్ కు కార్పొరేట్ మేకోవర్ తీసుకొచ్చేందుకు తొలుత సికింద్రాబాద్‌‌‌‌‌‌‌‌ లోని గాంధీ దవాఖానను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. ఇక్కడ ఆధునీకరణ చేపట్టి, అదే నమూనాను రాష్ట్రమంతటా అమలు చేయాలని భావించారు. ఈ డిజైన్ల రూపకల్పన బాధ్యతను ఓ ప్రైవేట్ ఆర్కిటెక్చరల్ సంస్థకు అప్పగించారు. అయితే, ఆ సంస్థ సమర్పించిన శాంపిల్ డిజైన్లు, త్రీడీ మోడళ్లు కార్పొరేట్ ప్రమాణాలకు ఏమాత్రం సరితూగలేదన్న కారణంతో వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులు వాటిని పక్కనపెట్టేశారు. మరో సంస్థ నుంచి కొత్త ప్రతిపాదనలు తీసుకోవడంలో అధికారులు చూపిన నిర్లక్ష్యం, అంతర్గత సమన్వయ లోపం కారణంగా గాంధీలో ఇప్పటివరకు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు.

కేరళ మోడల్​తో 202 హాస్పిటల్స్

హాస్పిటల్స్ బ్రాండింగ్ కోసం వైద్యారోగ్య శాఖ అధికారులు ప్రత్యేకంగా కేరళ వెళ్లి అక్కడి ప్రభుత్వ ఆస్పత్రుల నిర్వహణ తీరును అధ్యయనం చేశారు. ఆ తరహాలోనే రాష్ట్రంలోని డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ), డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ (గతంలో టీవీవీపీ) పరిధిలోని మొత్తం 202 హాస్పిటల్స్ ను బ్రాండింగ్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. తొలి విడతగా 84 ప్రధాన ఆస్పత్రులను (డీఎంఈ పరిధిలో 44, డీఎస్‌‌‌‌‌‌‌‌హెచ్ పరిధిలో 40) ఎంపిక చేశారు. హాస్పిటల్ ఎంట్రన్స్ వద్దే యూనిఫాంతో కూడిన హెల్ప్ డెస్క్ సిబ్బంది, నిరక్షరాస్యులు సైతం ఓపీ, ల్యాబ్‌‌‌‌‌‌‌‌లు, ఎమర్జెన్సీ వార్డులను సులువుగా గుర్తించేలా కలర్ కోడెడ్ మార్కింగ్స్, చిన్నపిల్లల వార్డుల్లో బొమ్మల గోడలు, డిజిటల్ టోకెన్ విధానం తదితర మార్పులు తీసుకొస్తామని చెప్పినప్పటికీ.. క్షేత్రస్థాయిలో అవేవీ అమల్లోకి రాలేదు.

వరల్డ్ బ్యాంకు నిధుల ఆలస్యమే కారణమా?

ఈ భారీ ప్రాజెక్టు అమలుకు అవసరమైన నిధుల కోసం ప్రభుత్వం పూర్తిగా వరల్డ్ బ్యాంకు రుణంపైనే ఆధారపడింది. అయితే నిబంధనల చిక్కులు, కేంద్ర అనుమతులు, అధికారుల అలసత్వంతో ప్రపంచ బ్యాంకు నుంచి రావాల్సిన నిధుల ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం సైతం దీనికి స్పెషల్ బడ్జెట్ కేటాయించకపోవడంతో పనులు పూర్తిగా నిలిచిపోయాయి. ఓవైపు బ్రాండింగ్ ప్రక్రియ ముందుకు సాగకపోగా, మరోవైపు కనీస నిర్వహణ లోపించి దవాఖాన్లు అధ్వానంగా మారుతున్నాయి. ప్రభుత్వం కేవలం వరల్డ్ బ్యాంకు నిధుల కోసమే ఎదురుచూడకుండా, రాష్ట్ర బడ్జెట్ నుంచే ప్రత్యేక నిధులు కేటాయించి వెంటనే పైలట్ ప్రాజెక్టును పూర్తిచేయాలని ప్రజలు కోరుతున్నారు.