ఇల్లు కట్టుకోవడానికి జాగ రెడీ.. పైసలెవ్వి?

ఇల్లు కట్టుకోవడానికి జాగ రెడీ.. పైసలెవ్వి?
  • రూ. ఐదారు లక్షల సాయం ముచ్చట ముందటపడ్తలే
  • సర్కార్​ హామీ ఇచ్చి రెండున్నరేండ్లయినా గైడ్​లైన్స్​కే దిక్కులేదు
  • రేపో మాపో పైసలొస్తయని ఊర్లల్లో జనాన్ని మభ్యపెడ్తున్న లీడర్లు
  • వాళ్ల మాటలు నమ్మి ఉన్న గుడిసెలు కూల్చుకొని రోడ్డునపడ్డ పేదలు

హైదరాబాద్, వెలుగు: జాగ ఉంటే చాలు ఇల్లు కట్టుకోనీకి ఐదారు లక్షల దాకా సాయం చేస్తామని రాష్ట్ర సర్కారు మాటిచ్చి రెండున్నరేండ్లయింది. కానీ, ఇంతవరకూ ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ఈ హామీ ఇచ్చినప్పటి నుంచి మూడు బడ్జెట్లను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఏ బడ్జెట్​లోనూ ఇంటి నిర్మాణ సాయం కోసం నిధులు కేటాయించలేదు. ‘‘ఫికర్​ చెయ్యకుండ్రి. రెండు మూడు నెలల్ల పైసలొస్తయ్. మీరు జాగలు సాపుజేసుకొండ్రి” అని ఊళ్లల్లో జనాన్ని లోకల్​ లీడర్లు మభ్యపెడ్తున్నారు. వాళ్ల మాటలు నమ్మి జనం జాగలు సిద్ధం చేసుకుంటున్నా ఫాయిదా ఉంటలేదు. కొందరైతే జాగలు రెడీ చేసుకునేందుకు గుడిసెలు, రేకుల ఇండ్లను కూల్చేసుకొని కిరాయి ఇండ్లల్లో ఉంటున్నారు.  

ఇండ్లు లేని ఫ్యామిలీలు 27.82 లక్షలు

2014 ఆగస్టు 19న సమగ్ర కుటుంబ సర్వేను ప్రభుత్వం నిర్వహించింది. ఆ రోజు రాష్ట్రంలోని కుటుంబాలన్నీ ఇండ్లకే పరిమితం కాగా ఇంటింటి సర్వే చేపట్టారు. ఇందులో 91.38 లక్షల కుటుంబాలు ఉన్నట్లు గుర్తించగా.. సగం కుటుంబాలు (45.02 లక్షలు) సింగిల్ రూముల్లోనే నివాసం ఉంటున్నట్లు వెల్లడైంది. 24,58,381 ఫ్యామిలీలు కిరాయి ఇండ్లలో ఉంటుండగా.. స్లమ్స్, ప్రభుత్వ స్థలాల్లో మరో 3,24,312 కుటుంబాలు తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేసుకున్నట్లు తేలింది. మొత్తంగా27.82 లక్షల కుటుంబాలకు సొంతిండ్లు లేవని ఏడేండ్ల కిందటి సమగ్ర కుటంబ సర్వేలో వెల్లడైంది. ఈ ఏడేండ్లలో ఆ సంఖ్య 32 లక్షలు అయి ఉండొచ్చని అంచనా. 

ఎదురుచూపులు ఎన్నాళ్లు..?

డబుల్ బెడ్రూం ఇండ్ల హామీని నెరవేర్చడంలో ఫెయిలైన సర్కార్.. సొంత జాగలోనైనా ఇల్లు కట్టుకుందామంటే ఆర్థిక సాయమూ చేయడం లేదు. ఇంటి నిర్మాణానికి రూ. 5 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు మంజూరు చేస్తామని 2018 ఎన్నికల మేనిఫెస్టోలో టీఆర్​ఎస్​ హామీ ఇచ్చింది.మళ్లీ అధికారంలోకి వచ్చి రెండున్నరేండ్లయినా ఆ హామీని పట్టించుకోవడం లేదు. సర్కారు నుంచి సాయం అందుతుందని ఎదురుచూస్తున్న పేదలకు నిరాశే మిగులుతోంది. రాష్ట్రంలో చాలా మంది పేదలు కూలీనాలీ చేసుకుని, కొంత అప్పు తీసుకుని తక్కువ ధరలో ఇండ్ల జాగ కొనుక్కుంటున్నారు. నాలుగు రేకులు వేసుకుని షెడ్లలో జీవనం సాగిస్తున్నారు. ఇలాంటి వారికి ఇండ్ల జాగలు ఉన్నప్పటికీ పైసలు లేక పక్కా ఇండ్లు కట్టుకోవడం లేదు. ప్రస్తుత సిమెంట్, ఐరన్, ఇటుక, ఇసుక, ఇతర భవన నిర్మాణ సామగ్రి ధరల్లో చిన్నపాటి ఇల్లు కట్టుకోవాలన్నా గ్రామాల్లో కూడా కనీసం రూ. పది లక్షల నుంచి 15 లక్షల దాకా ఖర్చవుతుంది.  దీంతో 2018 ఎన్నికల  మేనిఫెస్టోలో చెప్పినట్లు రూ. 5 లక్షల ఆర్థిక సాయం చేస్తే మిగతా సొమ్మును అప్పోసప్పో చేసి తెచ్చుకొని ఇండ్లు కట్టుకుంటామని జనం అంటున్నారు. 

గైడ్ లైన్స్​కే దిక్కులేదు

సొంత జాగల్లో ఇండ్లు కట్టుకునే లబ్ధిదారుల ఎంపికకు ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి గైడ్ లైన్స్‌‌ను రూపొందించలేదు. పేదల నుంచి దరఖాస్తులు తీసుకోవడం కూడా  ప్రారంభించలేదు. దీంతో అసలు ఈ స్కీమ్‌‌ను ప్రారంభిస్తరా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సొంత స్థలాల్లో ఇండ్ల నిర్మాణానికి అవసరమయ్యే బడ్జెట్ ప్రతిపాదనలను గత బడ్జెట్​కు ముందు కూడా తాము ఆర్థిక శాఖకు పంపామని, అయితే బడ్జెట్‌‌లో మాత్రం ఎలాంటి కేటాయింపులు జరగలేదని హౌసింగ్ శాఖలోని ఓ సీనియర్ అధికారి చెప్పారు. 

లక్ష దాటని డబుల్ బెడ్రూం ఇండ్లు

సొంత ఇండ్లు లేని కుటుంబాలు రాష్ట్రంలో 27.82 లక్షల వరకు ఉంటాయని ఏడేండ్ల కిందట సమగ్ర కుటుంబ సర్వే చెప్తుండగా..  ప్రభుత్వం మాత్రం 5.74 లక్షల ఇండ్ల నిర్మాణాన్నే  టార్గెట్ గా పెట్టుకుంది. అందులోనూ గత ఆరేండ్లలో గ్రేటర్ హైదరాబాద్​లో లక్ష, జిల్లాల్లో 1,91,057.. మొత్తంగా 2,91,057 ఇండ్లను మంజూరు చేసింది. వీటిలో ఇప్పటి వరకు 98,978 ఇండ్ల నిర్మాణం పూర్తికాగా, మరో 67,469 ఇండ్ల నిర్మాణం 90 శాతం మేర పూర్తయినట్లు అధికారిక లెక్కలు చెప్తున్నాయి. మరో 63,678 ఇండ్ల నిర్మాణానికి పునాది కూడా తీయలేదు.  గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 51,346 ఇండ్లు పూర్తి కాగా, ఇప్పటివరకు 3,466  ఇండ్లను మాత్రమే పంపిణీ చేశారు. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఇండ్లను పూర్తి చేసి, పంపిణీ చేయడానికే మరో ఏడాది, రెండేండ్లు పట్టేలా కనిపిస్తోంది. ఇప్పటికే చాలాచోట్ల పేదలు తమకు ఇండ్లు ఇవ్వాలంటూ ఆందోళనకు దిగుతున్నారు. వివిధ కార్యక్రమాలకు వచ్చే లీడర్లను అడ్డుకుంటున్నారు.  

అదీ లేదు.. ఇదీ లేదు

కూలీ చేస్తేగాని పూటగడవని పరిస్థితి మాది. సొంత ఇల్లు లేక గుడిసెలో ఉంటున్నం. వానాకాలం చాలా తిప్పలైతంది. గుడిసె మీద కవర్లు కప్పినం. ఇంట్లకు పాములు, తేళ్లు వస్తున్నయ్​. భయం భయంగా బతుకుతున్నం. గుడిసెలున్నోళ్లందరికీ డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తమని ఎలక్షన్లప్పుడు చెప్పిన్రు. కానీ ఇండ్లు శాంక్షన్ చెయ్యలే. సొంత జాగ ఉంటే  ఇల్లు కట్టుకోనీకి ఐదారు లక్షలు ఇస్తమన్నరు. అదీ లేదు. 
- శ్రీనివాస్, సికింద్లాపూర్, మెదక్ జిల్లా

పైసలిస్తరని జాగ సాఫ్‌‌ జేస్కున్నం

ఇండ్లు లేనోళ్లకు డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తమన్నరు.  కానీ మా వాడల కొందరికే ఇచ్చిన్రు. ఇండ్లు రానోళ్లకు వాళ్ల జాగల కట్టుకునె టందుకు పైసలిప్పిస్తమన్నరు. అది నమ్మి గుడిసె ముంగట గుండ్లు ఉంటే అవి తీసేసి, జాగ సాఫ్‌‌ చేసి పెట్టుకున్నం. కానీ పైసలు శాంక్షన్  చేస్తలేరు.  
– యాదగిరి, సికింద్లాపూర్, మెదక్ 

గుడిసె తీసేసి ఇల్లు కట్టుకుందమంటే..!

ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇల్లు మంజూరు చేస్తదని ఐదేండ్లుగా ఎదురుచూస్తూ గుడిసెలోనే  బతుకుతున్నం. మాకు సొంతంగా 5 గుంటల భూమి ఉంది. ప్రభుత్వం రూ. 5 లక్షలు ఇస్తే మా సొంత జాగలో గుడిసె తీసేసి ఇల్లు కట్టుకుంటం. మా గ్రామంలో ఎక్కువ మంది గిరిజనులు ఇండ్లు లేక గుడిసెల్లోనే ఉంటున్నరు.  
- పాయం కన్నప్ప, పార్థసారథిపురం,   పెనుబల్లి, ఖమ్మం జిల్లా

ఐదు లక్షలు రాకపాయె...ఇల్లు లేకపాయె

నేను టిఫిన్ సెంటర్ పెట్టుకుని కుటుంబాన్ని పోషించుకుంటున్న. తల్లిదండ్రులు సంపాదించిన ఇంటి జాగలో 100 గజాలు వచ్చింది. అందులో ఇల్లు కట్టుకుందమని అనుకున్న. ఈలోపల ఎన్నికలు రావడంతో సీఎం కేసీఆర్ డబుల్ బెడ్రూం ఇల్లు ఇస్తామని, ఒకవేళ జాగ ఉన్నోళ్లు ఇల్లు కట్టించుకుంటే రూ. ఐదు లక్షలు ఇస్తామనడంతో ఆశపడ్డ. ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్న. ఇప్పటికీ రాలే. ఇల్లు వచ్చేటట్లు లేదని రేకుల షెడ్డు వేసుకొని పిల్లలతో ఉంటున్న. 
- తన్నీరు నారాయణ, మునగాల, సూర్యాపేట జిల్లా

డబుల్ బెడ్రూం ఇల్లు రాలే..ఐదు లక్షలూ ఇయ్యలే..

ప్రభుత్వం డబుల్  బెడ్రూం ఇల్లు ఇస్తుందని ఐదేండ్ల  కింద దరఖాస్తు చేసిన. మా నియోజకవర్గంలో ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయలేదు. ఉన్న కొద్ది జాగలో ఇల్లు కట్టుకుందామనుకున్నం. ప్రభుత్వం రూ. 5 లక్షలు ఇస్తదేమోనని ఎదురుచూస్తున్నం. అవి కూడా వస్తలేవు. రెక్కాడితే గానీ డొక్కాడని పేద కుటుంబం మాది. ఇల్లు లేక అవస్థలు పడుతున్నం. ప్రభుత్వం ఇప్పటికైనా మాలాంటి నిరుపేదలకు న్యాయం చేయాలె. 
- కాంపాటి మల్లమ్మ, తుంగతుర్తి, సూర్యాపేట 

పాతింట్ల భయం భయంగా..

ఎన్నికల్లో కేసీఆర్  చెప్పినట్లు జాగ ఉన్నోళ్లు ఇల్లు కట్టుకోవడానికి పైసలిస్తే ఇల్లు కట్టుకుందామని ఎదురుచూస్తున్నం. వంద ఏండ్లకు పైబడిన ఇంట్లో మేము, మా మరిది కుటుంబం ఉంటున్నం. ఎప్పుడు వర్షం వచ్చినా భయం భయంగా బతుకుతున్నం. డబుల్ బెడ్రూం ఇల్లు ఇస్తలేరు. ఇల్లు కట్టుకోనీకి పైసలూ  ఇస్తలేరు. 
-  పల్లవి, కోడిమ్యాల, జగిత్యాల జిల్లా