కొనసాగుతున్న పంచాయతీ కార్యదర్శుల సమ్మె

కొనసాగుతున్న పంచాయతీ కార్యదర్శుల సమ్మె
  • నాలుగు రోజులుగా కొనసాగుతున్న పంచాయతీ కార్యదర్శుల సమ్మె
  • ఏమీ పట్టనట్లు ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో అధికారులు
  • జూనియర్ల స్థానంలో సీనియర్లకు బాధ్యతలు

హైదరాబాద్, వెలుగు: తమను రెగ్యులర్ చేయాలనే డిమాండ్‌‌తో జూనియర్ పంచాయతీ సెక్రటరీ (జేపీఎస్‌‌)లు చేస్తున్న సమ్మె నాలుగు రోజులుగా కొనసాగుతోంది. రెగ్యులర్ చేసే దాకా సమ్మె ఆపేది లేదని సెక్రటరీలు తేల్చిచెబుతున్నారు. మండల, జిల్లా కేంద్రాల్లో తమ పిల్లలతో కలిసి నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. వీరికి వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు మద్దతు తెలుపుతున్నాయి. ప్రభుత్వం మాత్రం ఏమీ పట్టనట్టుగానే వ్యవహరిస్తోంది. పైగా అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. జేపీఎస్‌‌ల స్థానంలో రెగ్యులర్ సెక్రటరీలకు ఒక్కొక్కరికీ 5, 6 గ్రామాల బాధ్యతలను మండల పంచాయతీ అధికారులు అప్పగిస్తూ సర్క్యులర్లు ఇస్తున్నారు. ఈ మేరకు పంచాయతీ రాజ్ ఉన్నతాధికారుల నుంచి తమకు ఆదేశాలు వచ్చాయని మండల అధికారులు చెబుతున్నారు. ఎంపీవోలు ఇస్తున్న బాధ్యతలను సీనియర్ సెక్రటరీలు తీసుకోవటానికి నిరాకరిస్తున్నారు. కలెక్టర్లు తమకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతున్నారు. దీంతో కలెక్టర్ల దృష్టికి ఎంపీవోలు ఈ అంశాన్ని తీసుకెళ్లారు.

సర్పంచ్‌‌ల మద్దతు

రాష్ట్రవ్యాప్తంగా జేపీఎస్‌‌లు చేస్తున్న నిరవధిక సమ్మెకు సర్పంచ్‌‌లు మద్దతు తెలుపుతున్నారు. రెగ్యులర్ సెక్రటరీలను సర్పంచ్ లు, ఉప సర్పంచ్ లు గ్రామాల్లోకి రానివ్వటం లేదు. జేపీఎస్‌‌లు 4 ఏళ్ల నుంచి తమతో కలిసి పనిచేశారని, వారిది న్యాయమైన డిమాండ్ అని చెబుతున్నారు. సోమవారం జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలంలోని అన్ని గ్రామాల సర్పంచులు ఏకగ్రీవంగా సెక్రటరీలకు మద్దతు ప్రకటించారు. వారి న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించి న్యాయం చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. సర్పంచులు అందరూ కలిసి రూ. లక్ష ఆర్థిక సాయం చేశారు.

పార్టీలు, నేతల మద్దతు

సెక్రటరీలకు రాజకీయ పార్టీలు, నేతల మద్దతు పెరుగుతోంది. ఇప్పటికే బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు బండి సంజయ్ వారికి మద్దతు ప్రకటించారు. జేపీఎస్‌‌లను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. 4 ఏళ్ల నుంచి గ్రామాలకు అవార్డులు రావటంలో కీలక పాత్ర పోషించారని, వారిది న్యాయమైన డిమాండ్ అని అన్నారు. సోమవారం నల్గొండ జిల్లా మునుగోడు మండల కేంద్రంలో సెక్రటరీల సమ్మెకు బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హాజరై మద్దతు తెలిపారు. సెక్రటరీలను రెగ్యులర్ చేయాలని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి మద్దతు తెలిపారు. 4 ఏళ్ల నుంచి రోజుకు 12 గంటల కష్టపడుతూ రాష్ట్రానికి అవార్డులు రావటంలో కీలకపాత్ర పోషించిన సెక్రటరీలను సీఎం కేసీఆర్ రెగ్యులర్ చేయాలని ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు.

రెగ్యులర్ చేయాలంటూ మంత్రి ఎర్రబెల్లికి వినతి

సమ్మె చేస్తున్న జేపీఎస్‌‌లను రెగ్యులర్ చేయాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును పంచాయతీ సెక్రటరీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మధుసూదన్ రెడ్డి కోరారు. సోమవారం సెక్రటేరియెట్‌‌లో మంత్రిని కలిసి వినతిపత్రం అందజేశారు. 3 ఏళ్ల ప్రొబేషన్ టైమ్ పూర్తయినా సీఎం మరో ఏడాది పెంచారని తెలిపారు. సెక్రటరీల కృషితోనే  అవార్డులు వస్తున్నాయని చెప్పారు.