
- ఐదేండ్ల భారం ఒకేసారి వేసే యోచనలో సర్కార్
హైదరాబాద్, వెలుగు: వచ్చే ఏప్రిల్ 1 నుంచి కరెంటు చార్జీలు భారీగా పెరగనున్నాయి. ఐదేండ్లుగా చార్జీలు పెంచనందున ఒకేసారి ఈ మొత్తం భారాన్ని ప్రజలపై మోపాలని సర్కార్ యోచిస్తోంది. విద్యుత్ సంస్థలు 2021–22, 2022–23 ఆదాయ, వ్యయాలకు సంబంధించిన ఏఆర్‌ఆర్ ప్రతిపాదనలను మంగళవారం విద్యుత్ నియంత్రణ మండలి(ఈఆర్‌సీ)కి ఇచ్చా యి. రెవెన్యూ లోటును భర్తీ చేసుకోవడానికి చార్జీలు పెంచక తప్పదని అందులో పేర్కొన్నాయి. దీంతో టారీఫ్ చార్జీలు ప్రకటించిన తర్వాత పబ్లిక్ హియరింగ్ నిర్వహించి చార్జీల పెంపుకు అనుమతిస్తామని ఈఆర్‌సీ తెలిపింది.
పెంచక పోతే కష్టమే అంటున్న డిస్కంలు
2019-–20 నాటికే నికర నష్టాలు రూ.25058.50కోట్లు ఉండగా, 2020–21 నష్టాలు, 2021–22 రెవిన్యూ లోటు రూ.10,624కోట్లు, 2022–23 లోటు రూ.10,928కోట్లు కలుపుకొని మొత్తం నష్టాలు రూ.50వేల కోట్లకు పైగా చేరనున్నాయి. సంస్థలను అమ్ముకున్నా అప్పులు పూర్తిగా తీర్చలేని దుస్థితిలో విద్యుత్ సంస్థలు కొనసాగుతున్నాయి.
రాష్ట్ర సర్కార్ పూర్తిగా చెల్లించకపోవడంతో డిస్కంల రెవెన్యూ లోటు పెరుగుతోంది. ఏటా పదివేల కోట్లు ప్రకటిస్తున్నా నికరంగా రూ.5వేల కోట్లే ఇస్తున్నట్లు ఏఆర్‌ఆర్‌లో స్పష్టమైంది. నష్టాలు పెరుగుతున్నాయని చార్జీల పెంపుపై సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. దీంతో అన్ని కేటగిరీలకు విద్యుత్ చార్జీల పెంచేందుకు విద్యుత్ సంస్థలు ప్రతిపాదనలు చేశాయి. తాజా ప్రతిపాదనల నేపథ్యంలో వచ్చే ఏప్రిల్1 ఇండ్ల కరెంటు చార్జీలతో పాటు, కమర్షియల్, ఇండస్ట్రియల్ కేటగిరీలు అన్నింటీకి చార్జీలు పెంచడానికి రెడీ అయ్యాయి. ఈ ప్రతిపాదనలపై ఈఆర్‌సీ పబ్లిక్ హియరింగ్ నిర్వహించి చార్జీలు పెంచుకోవడానికి అనుమతి ఇవ్వడమే మిగిలింది.
ఒకే సారి ఐదేండ్ల భారం
తాజాగా పెంచనున్న కరెంటు చార్జీల్లో ఒకే సారి ఐదేండ్ల భారం మోపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ భారం అంతా వచ్చే ఏప్రిల్ నుంచి వినియోగదారులపై మోపే చాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఎంత భారం ఎవరికి వేయాలనేది డిస్కంలకు ప్రశ్నార్థకంగా మారింది. అందుకే ఏఆర్ఆర్ రిపోర్ట్‌లో చార్జీలపై స్పష్టమైన టారీఫ్ ఇవ్వలేదని తెలుస్తోంది. టారీఫ్ చార్జీల ప్రతిపాదన కొలిక్కి వస్తే అన్ని వర్గాల వినియోగదారుకుల యూనిట్ ధరలు భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఈఆర్‌సీ ఆదేశాలు బేఖాతర్.
నాలుగేండ్లుగా ఏఆర్‌ఆర్ ప్రతిపాదనలు ఇవ్వకుండా ఆలస్యం చేసినా విద్యుత్ సంస్థలు పట్టించుకోక పోవడంపై విమర్శలు వస్తున్నాయి. నిరుడు వెంటనే ఏఆర్‌ఆర్ ప్రతిపాదనలు చేసినా 14 నెలల వరకు డిస్కంలు రిపోర్ట్ ఇవ్వకపోయినా వాటిపై ఎలాంటి చర్యలు తీసుకోక పోవడం విమర్శలకు తావిస్తోంది. ఎట్టకేలకు రెండేండ్ల ఏఆర్‌ఆర్ దాఖలు చేసినా టారీఫ్ ప్రతిపాదనలు చేయక పోవడం గమనార్హం. ఇప్పటికే కేంద్రం ఈఆర్‌సీకి ఇచ్చిన ఆదేశాలు అమలు చేయడంలో జాప్యం చేస్తుందనే విమర్శ ఉంది. తాజాగా టారీఫ్ చార్జీలపై కూడా నిర్దిష్ట గడువు ఇవ్వక పోవడంతో డిస్కంలు ఎప్పుడు ప్రకటిస్తాయనేది తేలక పోవడం గమనార్హం.
చార్జీల టారీఫ్ ప్రతిపాదనలు ఇస్తేనే పెంపుపై నిర్ణయం
విద్యుత్ సంస్థలు టారీఫ్ చార్జీల ప్రతిపాదనలు ఇస్తేనే చార్జీల పెంపు నిర్ణయంపై ముందుకు సాగుతం. గతంలో ఏఆర్‌ఆర్ ఇవ్వని 2019–20, 2020–21కు సంబంధించి ట్రూ అప్ చార్జీలకు అనుమతిస్తాం. చార్జీలకు సంబంధించి టారీఫ్‌ను వెంటనే ప్రకటించాలని డిస్కంలను ఆదేశించాం. వచ్చే ఏప్రిల్ 1 నుంచే కొత్త విద్యుత్ చార్జీలు ఉంటాయి. - ఈఆర్‌సీ చైర్మన్ శ్రీరంగరావు