ఏప్రిల్, మే, జూన్​లో 4 వేల కోట్ల చొప్పున అప్పు

ఏప్రిల్, మే, జూన్​లో 4 వేల కోట్ల చొప్పున అప్పు
  • ఆర్బీఐకి సర్కార్ రిక్వెస్ట్​ 
  • ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.46 వేల కోట్లు  తీసుకొనే చాన్స్​

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర సర్కారు​ మూడు నెలల్లో రూ.12,500 కోట్లు అప్పు తీసుకునేందుకు రెడీ అయింది. ఏప్రిల్, మే, జూన్​ నెలల్లో ఈ అప్పు తీసుకోనుంది. వీటిని రిజర్వ్​బ్యాంక్​ఆఫ్​ఇండియా (ఆర్​బీఐ) నుంచి సమకూర్చుకోనుంది. ఈ మేరకు ఆర్​బీఐ మూడు నెలల ఇండికేటివ్​ క్యాలెండర్​లో రాష్ట్ర సర్కార్​ తీసుకోనున్న అప్పులను వెల్లడించింది. ఈ ఫైనాన్షియల్​ఇయర్​లో మొత్తం 46 వేల కోట్ల రూపాయలు అప్పుగా తీసుకోవాలని ప్రభుత్వం టార్గెట్ గా పెట్టుకున్నది. ప్రతి మూడు నెలలకు యావరేజ్​గా రూ.12 వేల కోట్ల చొప్పున ఈ మొత్తాన్ని సర్దుబాటు చేసుకుంటారు. క్వార్టర్​కు కొంత చొప్పున నాలుగు విడతల్లో ఈ మొత్తాన్ని తీసుకోనున్నట్లు ఆర్థిక శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.  ఇది గడిచిన ఆర్థిక సంవత్సరం కంటే రూ.3 వేల కోట్లు ఎక్కువ.  2022–-23 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం రూ.42 వేల కోట్ల మేర అప్పులు చేసింది. 

నెలకు యావరేజ్​గా రూ.4 వేల కోట్ల చొప్పున

ప్రభుత్వం ఒక్కో నెలలో యావరేజ్​గా రూ.4 వేల కోట్ల చొప్పున అప్పు తీసుకోనుంది. ఏప్రిల్ 11న రూ.2 వేల కోట్లు, 18న వెయ్యి కోట్లు, 25న ఇంకో వెయ్యి కోట్లు తీసుకోనుంది. మే నెలలో 9న రూ.వెయ్యి కోట్లు, 16న రూ.వెయ్యి కోట్లు, 30న రూ.1,500 కోట్లు కావాలని ఆర్​బీఐకి రాష్ట్ర ప్రభుత్వం రిక్వెస్ట్ ​పెట్టింది. ఇక జూన్​లో రైతుబంధు నేపథ్యంలో ఆ ఒక్క నెలలోనే 5 వేల కోట్ల తీసుకోవాలని నిర్ణయించింది. జూన్​6వ తేదీ రూ.1,500 కోట్లు, 20న రూ.1,500 కోట్లు, 26వ తేదీన రూ.2 వేల కోట్లు అప్పుకు ప్లాన్​ చేసింది.

జీతాలు, స్కీమ్​లకు అప్పులే?

రాష్ట్ర సర్కారు ​నెలానెలా ఉద్యోగులకు ఇచ్చే జీతాలకు కూడా అప్పులనే సర్దుబాటు చేస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి. మరోవైపు గతంలో చేసిన అప్పులకు కూడా.. మళ్లీ అప్పులు తీసుకొనే కిస్తీలు కడుతున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇక కొన్ని స్కీములకు తప్పనిసరి పరిస్థితుల్లో అప్పుల నుంచే ఇవ్వాల్సి వస్తోందని తెలుస్తోంది. రైతుబంధు, ఆసరా, ఇతర్రతా కొన్ని రెగ్యులర్ స్కీములకు కొంత మొత్తంలో వీటి నుంచి అడ్జస్ట్​ చేస్తున్నట్లు సమాచారం.