- పూజలు చేయకపోయినా
- అర్చకుల ఖాతాల్లోకి సొమ్ము
- ఫిర్యాదులతో సోషల్ ఆడిట్‌కు ప్రభుత్వం ఆదేశాలు
- భక్తుల దర్శన, ప్రత్యేక పూజల టికెట్ల వ్యవహారంపైనా ఫోకస్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ధూపదీప నైవేద్యం(డీడీఎన్) పథకంలో భారీ అక్రమాలు జరుగుతున్నాయి. మారుమూల ఆలయాల్లోనూ నిత్యం దీపం వెలగాలన్న సదుద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తున్న నిధులు అక్రమార్కుల పాలవుతున్నాయి. అసలు ఆలయమే లేకపోయినా, ఉన్న చోట కనీసం గుడి తలుపులు తీయకపోయినా.. రికార్డుల్లో మాత్రం సవ్యంగా ఉన్నట్లు చూపి నిధులు డ్రా చేస్తున్నారనే ఆరోపణలున్నాయి.
గత బీఆర్ఎస్హయాంలో మొదలైన ఈ అక్రమ వ్యవహారం ఇప్పటికీ కొనసాగుతున్నట్లు ఫిర్యాదులు అందడంతో రాష్ట్ర సర్కార్ ఫోకస్ పెట్టింది. ఈ స్కీమ్‌లో పారదర్శకత పెంచేందుకు సోషల్ ఆడిట్ నిర్వహించాలని నిర్ణయించింది. ఇందుకు ఇప్పటికే సొసైటీ ఫర్ సోషల్ ఆడిట్, అకౌంటబిలిటీ అండ్ ట్రాన్స్ఫరెన్సీ (ఎస్ఎస్ఏఏటీ)కి వర్క్ ఆర్డర్ ఇచ్చింది. దీంతో వచ్చే వారంపది రోజుల్లో ఆడిట్ బృందాలు క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించి, సర్కారుకు రిపోర్ట్ ఇవ్వనున్నాయి.
క్షేత్రస్థాయిలో సోషల్ఆడిట్..
ఆరోపణల నేపథ్యంలో డీడీఎన్ స్కీమ్ అమలు తీరుపై ప్రభుత్వం దృష్టి సారించింది. అక్రమాలకు చెక్ పెట్టేందుకు సోషల్ ఆడిట్ చేయాలని నిర్ణయం తీసుకుంది. సోషల్ ఆడిట్ కోసం వర్క్ ఆర్డర్ ఇచ్చేందుకు సర్వం సిద్ధమైంది. వారంపది రోజుల్లో ఈ ఆడిట్ ప్రక్రియ ప్రారంభం కానుంది. దీంట్లో భాగంగా ఆడిట్ బృందాలు నేరుగా గ్రామాలకు వెళ్లి క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టనున్నాయి. రికార్డుల్లో ఉన్న ఆలయం అక్కడ ఉందా? ఉంటే ఏ స్థితిలో ఉంది? అక్కడ నిత్యం పూజలు జరుగుతున్నాయా? అర్చకుడు స్థానికంగా అందుబాటులో ఉంటున్నారా లేదా ? అనే విషయాలపై ఆరా తీయనున్నాయి. అనంతరం పూర్తిస్థాయి నివేదిక రూపొందించి, ప్రభుత్వానికి అందజేయనున్నాయి. అక్రమాలు రుజువైతే నిందితులపై ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. ఒకవేళ గుడి ఉండి, నిరాదరణకు గురవుతున్న చోట్ల అర్హులను ఎంపిక చేసి అప్పగించాలని నిర్ణయించారు.
ఆలయాల్లో టికెట్ల దందాపైనా..
రాష్ట్రంలో 6,541 ఆలయాలు ఉండగా.. ఇందులో ఆలయాలు 704 ఈవోల పరిధిలో ఉన్నాయి. దేవాలయాల నుంచి వచ్చే ఆదాయం (హుండీలు, దానాలు, ఆస్తుల రూపంలో), ఖర్చులు (అభివృద్ధి పనులు, నిర్వహణ), స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్స్(ఎస్డీఎఫ్) కింద ఆలయాల అభివృద్ధి పనులు, భక్తులకు సౌకర్యాల కల్పన (వసతి గృహాలు, పార్కింగ్, పరిశుభ్రత) ఎలా ఉంది? నిధులు వినియోగం తీరు తదితర అంశాలపై తనిఖీలు చేయనున్నారు. గతంలో భక్తులకు ఇచ్చే దర్శన, ప్రత్యేక పూజల టికెట్ల దందాపై ఫిర్యాదులు అందిన నేపథ్యంలో వాటిపై సోషల్ ఆడిట్ చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ముందుగా డీడీఎన్ స్కీమ్‌పై ఆడిట్పూర్తయిన తర్వాత టికెట్లలో అక్రమాలపై ఫోకస్ పెట్టనున్నట్లు తెలిసింది.
గతంలో బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో నకిలీ టికెట్ల బాగోతం వెలుగుచూసింది. వీఐపీ టిక్కెట్లలోనూ గోల్‌మాల్ జరిగిన సంఘటనలున్నాయి. ఈ నేపథ్యంలో ఆలయాల్లో టికెట్ల విక్రయాలపైనా తనిఖీలు చేయనున్నట్లు తెలిసింది. ఆలయ నిర్వహణలో లోపాలు, అవినీతి ఆరోపణలపై ఫిర్యాదులను స్వీకరించి, వాటిని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లనున్నారు. ఆలయ ఆస్తులు, నిధుల వినియోగం తీరుపై ప్రధానంగా దృష్టిసారించనున్నారు. ముఖ్యంగా ఆలయాల్లో రికార్డుల నిర్వహణ గురించి సోషల్ ఆడిట్ ద్వారా తెలుసుకోనున్నారు. ఈ మేరకు భక్తులు, ఆలయ నిర్వాహకుల నుంచి అభిప్రాయాలు సేకరించనున్నారు.
గుడి లేకున్నా.. పూజలు చేయకున్నా..
గ్రామీణ ప్రాంతాల్లోని పురాతన ఆలయాలు, ఆదాయం లేని గుళ్లలో నిత్య దీపారాధన కోసం ప్రభుత్వం ధూప,దీప నైవేద్య పథకం కింద నిధులు మంజూరు చేస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుతం 6,271 ఆలయాల్లో డీడీఎన్ పథకం అమలు అవుతుండగా.. ప్రతి నెలా రూ.10వేల చొప్పున రూ.6.54 కోట్ల నిధులు కేటాయిస్తోంది. ఇందులో రూ.7వేలు అర్చకులకు గౌరవ భృతి కాగా, రూ.3వేలు పూజా సామగ్రి కోసం వినియోగించాల్సి ఉంది. కానీ, సిబ్బందితో కుమ్మక్కై కొందరు అక్రమాలకు తెరతీశారు.
అసలు గుడి లేకున్నా.. ఉన్నట్లు రికార్డుల్లో చూపించి నెలనెలా నిధులు కాజేస్తున్నారు. మరికొన్ని చోట్ల గుడి ఉన్నా.. తలుపులు తీసే నాథుడే లేకపోయినా.. నిత్యం ధూప, దీప, నైవేద్యాలు సమర్పిస్తున్నట్లు చూపించి సర్కారు డబ్బులు కొట్టేస్తున్నారు. ఒకే అర్చకుడు పలు దేవాలయాల పేర్లతో నిధులు డ్రా చేస్తున్నట్లు ఫిర్యాదులు అందాయి. గత సర్కార్ హయాంలో కొందరు ప్రజాప్రతినిధులు ఆలయాలు లేకపోయినప్పటికీ ధూపదీప నైవేద్యం పథకంలో తమ పేరు చేర్చి నిధులు కాజేస్తున్నారనే ఆరోపణలూ ఉన్నాయి.
