పోలవరం బ్యాక్ వాటర్‌‌ స్టడీలో అన్నీ లోపాలే

పోలవరం బ్యాక్ వాటర్‌‌ స్టడీలో అన్నీ లోపాలే
  • పోలవరం బ్యాక్ వాటర్‌‌ స్టడీలో అన్నీ లోపాలే
  • సీడబ్ల్యూసీ, పీపీఏకు తెలంగాణ లేఖ
  • శాస్త్రీయంగా అధ్యయనం చేయాలని డిమాండ్​

హైదరాబాద్‌‌, వెలుగు: పోలవరం బ్యాక్‌‌ వాటర్‌‌ ప్రభావంపై చేపట్టిన స్టడీ లోపాల పుట్ట అని తెలంగాణ మండిపడింది. పోలవరం డిశ్చార్జి కెపాసిటీ 36 లక్షల క్యూసెక్కుల వద్ద ఎగువన నిలిచే వరద నీటిపై చేసిన స్టడీలో అనేక లోపాలు ఉన్నాయని తేల్చిచెప్పింది. ఈమేరకు సీడబ్ల్యూసీ చైర్మన్‌‌, పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) సీఈవోకు ఇరిగేషన్‌‌ స్పెషల్‌‌ సీఎస్‌‌ రజత్‌‌ కుమార్‌‌ గురువారం లేఖ రాశారు. 20 ఏండ్ల కిందటి కొలమానాలనే ప్రామాణికంగా తీసుకున్నారని, అందులోనూ అనేక లోపాలు ఉన్నాయని తెలిపారు. పోలవరం డిశ్చార్జి కెపాసిటీని 50 లక్షల క్యూసెక్కులకు పెంచుతున్నారని, ఆ స్థాయిలో నీటిని నిల్వ ఉంచితే ఎగువ పడే వరద ప్రభావంపై స్టడీ చేసి తీరాలని డిమాండ్‌‌ చేశారు. పోలవరంపై స్టడీలో గుర్తించిన 18 లోపాలను లేఖలో ప్రస్తావించారు. పోలవరం ఎఫ్‌‌ఆర్‌‌ఎల్‌‌ 150 అడుగుల లెవల్‌‌లో నీటిని నిల్వ చేస్తే తెలంగాణలో 891 ఎకరాలు నీట మునుగుతాయని, ఆ భూములకు 2013 చట్టం ప్రకారం పరిహారం.. నిర్వాసితులకు ఆర్‌‌ అండ్‌‌ ఆర్‌‌ ప్యాకేజీ ఇవ్వాలన్నారు. పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేసినప్పుడు పినపాక, చర్ల, భద్రాచలం, బూర్గంపాడు, దుమ్ముగూడెం, మణుగూరు, అశ్వాపురం మండలాల్లో ప్రవహించే కిన్నెరసాని, ముర్రేడువాగు, జంపన్నవాగు సహా 35 ఉపనదులు/వాగుల ప్రవాహాలు గోదావరిలో కలువకుండా వెనక్కి తంతాయని దీంతో 40 వేల ఎకరాలు ముంపునకు గురవుతాయని తెలిపారు. మణుగూరు హెవీ వాటర్‌‌ ప్లాంట్‌‌ సైతం మునిగిపోతుందని, ఈ ముంపు నుంచి గట్టెక్కించేందుకు సేఫ్టీ వాల్స్‌‌ నిర్మించాలని సూచించారు. ఈ ఏడాది జులైలో వచ్చిన వరదల సందర్భంగా పోలవరం నుంచి డిశ్చార్జిపై ఏపీ ప్రభుత్వం, సీడబ్ల్యూసీ ఇచ్చిన నివేదికల్లో తేడాలున్నాయని తెలిపారు. పోలవరం ప్రాజెక్టుతో పడే ప్రభావంపై శాస్త్రీయంగా స్టడీ చేయించాలని విజ్ఞప్తి చేశారు.

  • ఏకాభిప్రాయం రాకున్నా, అటెండ్‌‌ కాకున్నా ఫెయిలైనట్టే
  • ఆర్‌‌ఎంసీ కన్వీనర్‌‌ రవికుమార్‌‌ పిళ్లై

కేఆర్‌‌ఎంబీ రిజర్వాయర్‌‌ మేనేజ్‌‌మెంట్‌‌ కమిటీ(ఆర్‌‌ఎంసీ) ఐదో సమావేశానికి సభ్యులు హాజరుకాకున్నా, సిఫార్సులపై ఏకాభిప్రాయం కుదరకున్నా ఈ కమిటీ ఫెయిల్‌‌ అయినట్టేనని బోర్డు సభ్యుడు, ఆర్‌‌ఎంసీ కన్వీనర్‌‌ రవికుమార్‌‌ పిళ్లై గురువారం సభ్యులకు ఘాటుగా లేఖ రాశారు. శ్రీశైలం, నాగార్జునసాగర్ రూల్‌‌ కర్వ్స్‌‌ (ఆపరేషన్‌‌ ప్రొటోకాల్‌‌), పవర్‌‌ జనరేషన్‌‌, ప్రాజెక్టులన్నీ నిండి నీళ్లు సముద్రంలోకి పోతున్న రోజుల్లో రెండు రాష్ట్రాలు వినియోగించుకున్న నీటి లెక్కింపు ప్రాతిపదికపై నిర్దారించేందుకు రెండు రాష్ట్రాల అంగీకారంతో ఆర్‌‌ఎంసీ ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. కమిటీ ఏర్పాటు చేసిన తర్వాత ఐదు నెలల్లో ఐదు సమావేశాలు జరిగినా ఒక్క అంశంపైనా ఏకాభిప్రాయం కుదరలేదన్నారు. నవంబర్‌‌లో మూడో వారంలో ఆర్‌‌ఎంసీ చివరి సమావేశాన్ని నిర్వహిస్తామని.. ఆ మీటింగ్‌‌కు రెండు రాష్ట్రాల మెంబర్లు అటెండ్‌‌ కాకపోయినా, మూడు అంశాలపై ఏకాభిప్రాయం కుదిరి సిఫార్సులపై సంతకాలు చేయకపోయినా ఆర్‌‌ఎంసీ ఫెయిల్‌‌ అయినట్టు కేఆర్ఎంబీకి నివేదిక ఇస్తామన్నారు.