హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని సంక్షేమ గురుకులాల్లో చదువుతున్న విద్యార్థుల సంక్షేమం, భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్య మిస్తోంది. స్టూడెంట్లకు ఉన్నత ప్రమాణాలతో కూడిన వసతులు కల్పించా లని, ఏమైనా ఇబ్బందులు ఏర్పడితే వాటిని వేగంగా పరిష్కరించేలా పర్యవేక్షణ చేయాలని జిల్లా అధికారులను సర్కారు ఆదేశించింది. క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించడానికి నోడల్ అధికారులను నియమించాలని, డిటైల్డ్ ఎంక్వైరీ క్యాలెండర్‌ను ముందుగానే తయారు చేయాలని స్పష్టం చేసింది. జిల్లా షెడ్యూల్‌కు తగ్గట్టుగా, సంబంధిత అన్ని విభా గాలకు వాటిని అందజేయాలని చెప్పింది.
విద్యా సంస్థల సరైన పనితీరును నిర్ధారించడానికి ఆకస్మిక సందర్శనలు కూడా నిర్వహించాలని వెల్లడించింది. అధికారులు గురుకుల పాఠశాలలను సందర్శించిన తర్వాత అవసరమైన చర్యలు తీసుకోవడానికి తనిఖీ నివేదికలను తయారు చేసి వెంటనే అప్‌లోడ్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అనంతరం ఏయే చర్యలు తీసుకున్నారో కూడా వెంటనే తెలియజేయాలని స్పష్టం చేసింది. తీసుకున్న చర్యల నివేదికను ప్రతి నెల అయిదో తేదీలోపు సంబంధిత విభాగాధిపతులు, కార్యదర్శులకు తప్పకుండా సమర్పించాలని పేర్కొంది.
