కోటి జనాభా ఉన్న హైదరాబాద్​కు.. 4.80 టీఎంసీలేనా?

కోటి జనాభా ఉన్న  హైదరాబాద్​కు.. 4.80 టీఎంసీలేనా?
  • ఏపీపై అంత ప్రేమ ఎందుకనికృష్ణా బోర్డుపై తెలంగాణ గుస్సా
  • ఏపీకి ఎలా 25 టీఎంసీలు ఇచ్చారని నిలదీత

హైదరాబాద్, వెలుగు: లక్ష జనాభా కూడా లేని ఏపీ పట్టణాలు, నగరాల కోసం 25 టీఎంసీలు ఎలా కేటాయిస్తారని కృష్ణా రివర్ మేనేజ్​మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ)ని తెలంగాణ ప్రభుత్వం నిలదీసింది. కోటి జనాభా ఉన్న హైదరాబాద్​కు 4.80 టీఎంసీలు ఎలా సరిపోతాయని ప్రశ్నించింది. ఏపీ విషయంలో అంత ప్రేమ ఏంటని మండిపడింది. ఈ నెల 21న నిర్వహించిన కేఆర్ఎంబీ త్రీ మెంబర్ కమిటీ మీటింగ్ మినిట్స్​ను బోర్డు బుధవారం రిలీజ్ చేసింది. ఈ సమావేశాన్ని మరుసటి రోజుకు వాయిదా వేయాలని కోరినా బోర్డు పట్టించుకోకుండా అదే రోజు నిర్వహించడం, ఏపీ అడిగినన్ని నీళ్లు ఇవ్వడం ఏంటని మండిపడింది. మీటింగ్ మినిట్స్​పై తెలంగాణ అధికారులు బోర్డుకు లేఖ రాశారు. 

ఈ వాటర్ ఇయర్ ముగిసే దాకా తాగునీటికి 26.95 టీఎంసీలు, సెప్టెంబర్ నెలాఖరు వరకు సాగునీటి కోసం 38.73 టీఎంసీలు కేటాయించాలని తాము ఇండెంట్ సమర్పిస్తే కేవలం 6.04 టీఎంసీలు తీసుకోవడానికి మాత్రమే అనుమతి ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు. ఏపీ 30.09 టీఎంసీలు కావాలని ఇండెంట్​లో కోరితే 25.29 టీఎంసీల వినియోగానికి ఎలా అనుమతిస్తారని ప్రశ్నించారు. ఈ వాటర్ ఇయర్​లో ఏపీ ఇప్పటి దాకా 40 టీఎంసీలు ఉపయోగించుకుందని చెప్తే బోర్డు ఏపీ వినియోగం 7.42 టీఎంసీలేనని తేల్చడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. రెండు రాష్ట్రాల విషయంలో సమదృష్టితో  చూడాల్సిన బోర్డు.. ఏకపక్షంగా వ్యవహరించడం ఏంటని మండిపడ్డారు.