- మూడు నెలల్లోగా పనులు పూర్తి చేయాలని విద్యాశాఖ ఉత్తర్వులు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని సర్కారు బడుల్లో మౌలిక వసతులను మరింత మెరుగుపరిచేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా సమగ్ర శిక్షా అభియాన్ కింద 325 బడుల్లో కొత్తగా 415 టాయిలెట్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీటి నిర్మాణానికి రూ.19.71 కోట్లను మంజూరు చేస్తూ స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
యూడైస్ డేటా, క్షేత్రస్థాయి అవసరాల ఆధారంగా మంజూరైన ఈ నిధులతో 415 టాయిలెట్లను నిర్మించనున్నారు. వీటిలో 344 బాలుర, 71 బాలికల టాయిలెట్లు ఉన్నాయి. ఒక్కో టాయిలెట్ నిర్మాణానికి రూ.4.75 లక్షల చొప్పున నిధులు కేటాయించారు. టీజీఈడబ్ల్యూఐడీసీ ఆధ్వర్యంలో ఈ-ప్రొక్యూర్మెంట్ విధానం ద్వారా టెండర్లు పిలిచి నిర్మాణ పనులను చేపట్టనున్నారు. కేవలం మూడు నెలల్లోగా పనులన్నీ పూర్తి చేసి విద్యార్థుల వినియోగంలోకి తీసుకురావాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.
ఇప్పటికే ఇతర పథకాల కింద టాయిలెట్లు నిర్మించిన చోట ఇవి పునరావృతం కాకుండా, జిల్లా విద్యాశాఖ అధికారులు పకడ్బందీగా పర్యవేక్షించాలని ఆదేశించారు. కాగా, కొత్తగా కట్టబోయే టాయిలెట్లలో మహబూబ్‌నగర్ జిల్లాకు అత్యధికంగా 32 స్కూళ్లలో మంజూరయ్యాయి. వికారాబాద్‌లో 22 స్కూళ్లలో, జోగులాంబ గద్వాలలో 21 స్కూళ్లలో, రంగారెడ్డిలో 20 స్కూళ్లలో, వనపర్తిలో 16 స్కూళ్లలో, కామారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం, సంగారెడ్డి జిల్లాల్లో చెరో 15 చొప్పున స్కూళ్లలో టాయిలెట్లు నిర్మించనున్నారు.
