కొత్త పెన్షన్లు ఆపడం వల్ల సర్కారు 7 వేల కోట్లు వెనకేసుకుంది

కొత్త పెన్షన్లు ఆపడం వల్ల సర్కారు 7 వేల కోట్లు వెనకేసుకుంది
  • మూడేండ్ల నుంచి అర్హుల ఎదురుచూపులు 
  • 57 ఏండ్లు నిండినోళ్ల వివరాలు 2019లోనే సేకరణ
  • హైదరాబాద్ బయటే 6.70 లక్షల మంది గుర్తింపు
  • మొన్న ఆగస్టులో 9.50 లక్షల అప్లికేషన్ల స్వీకరణ..
  • ఇంకా మొదలుకాని వెరిఫికేషన్
  • ఎంఐఎం అభ్యర్థనతో అప్లికేషన్లకు మరో చాన్స్​
  • ఉప ఎన్నికలు ఉన్న చోటనే కొత్త పెన్షన్లు అమలు

హైదరాబాద్, వెలుగు: రెండో సారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సీఎం కేసీఆర్​ కొత్త ఆసరా పెన్షన్ల అమలును వాయిదాల మీద వాయిదా వేస్తున్నారు. మాటిచ్చి మూడేండ్లవుతున్నా అమలవడం లేదు. 65 ఏండ్ల వాళ్లకే కాదు.. 57 ఏండ్లు నిండినోళ్లకు కూడా ఆసరా పెన్షన్లు ఇస్తామని  2018 ఎన్నికల మేనిఫెస్టోలో టీఆర్​ఎస్​ ప్రకటించింది. కానీ, పాత ఆసరా రూల్స్​  ప్రకారం కొత్తగా 65 ఏండ్లు నిండినోళ్లు కూడా పెన్షన్​కు నోచుకోవడం లేదు. ఈ మూడేండ్లలో కొత్తగా ఆసరా పరిధిలోకి వచ్చిన వితంతువులు, దివ్యాంగులు, పైలేరియా బాధితులు, ఒంటరి మహిళలు, 50 ఏండ్లు నిండిన చేనేత, గీత, బీడీ కార్మికులదీ ఇదే పరిస్థితి. వీళ్లు అప్లికేషన్లు పెట్టుకొని.. ఆఫీసుల చుట్టు తిరుగుతున్నా ఫాయిదా ఉంటలేదు.

57 ఏళ్లు నిండినోళ్ల లెక్క 2019లోనే సేకరణ

2019 జనవరిలో పంచాయతీ ఎన్నికలప్పుడు 57 ఏండ్లు నిండిన అర్హులను గుర్తిస్తున్నట్లు గ్రామాల్లో ప్రభుత్వం హడావుడి చేసింది. అప్పటి అసెంబ్లీ ఎన్నికల ఓటర్ లిస్టు ఆధారంగా హైదరాబాద్ మహానగరం మినహా మిగతా మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల్లో 6.70 లక్షల మంది అర్హులు ఉన్నట్లు గుర్తించింది. హైదరాబాద్ లో మరో 2 లక్షల మంది అర్హులు ఉండొచ్చని అంచనా. కానీ వీళ్లకు ఇప్పటివరకు పెన్షన్ మాత్రం ఇవ్వలేదు. కేవలం పంచాయతీ ఎన్నికల్లో ప్రయోజనం కోసమే సర్కారు హడావుడి చేసిందనే విమర్శలు ఉన్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వం మరోసారి మీ సేవ కేంద్రాల ద్వారా ఆగస్టు 15 నుంచి 31 వరకు అప్లికేషన్లు తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా 57 ఏండ్లు నిండినోళ్లు  సుమారు 9.50 లక్షల మంది అప్లయ్​ చేసుకున్నారు. అప్లికేషన్ గడువు ముగిసి నెల రోజులు దాటినా వెరిఫికేషన్ మొదలుపెట్టని ప్రభుత్వం.. ఎంఐఎం ఎమ్మెల్యే అభ్యర్థన మేరకు తాజాగా మరోసారి అప్లికేషన్ల స్వీకరణకు అవకాశమిచ్చింది. ప్రభుత్వానికి పెన్షన్లు ఇచ్చే ఉద్దేశమే ఉంటే ఇప్పటికే వచ్చిన 9.50 లక్షల అప్లికేషన్లను వెరిఫై చేయాలనే డిమాండ్ వినిపిస్తున్నది.

65 ఏండ్ల వాళ్లకు కూడా ఇస్తలే

2018 సెప్టెంబర్​లో ప్రభుత్వ రద్దుకు నెల రోజుల ముందు కొత్త పెన్షన్లు మంజూరైనప్పటికీ.. ఆ తర్వాత కొత్తవి మంజూరు కాలేదు. 2018 సెప్టెంబర్ నుంచి 2021 సెప్టెంబర్ వరకు మూడేండ్ల కాలంలో వితంతువులుగా మారినోళ్లు, ప్రమాదాల కారణంగా దివ్యాంగులుగా మారినోళ్లు, బోదకాల బాధితులు, 50 ఏండ్లు నిండిన గీత, చేనేత కార్మికులు, ఒంటరి మహిళలు, పాత ఆసరా రూల్ ప్రకారం 65 ఏండ్లు నిండిన వృద్ధులకు పెన్షన్ రావడం లేదు. వీళ్ల నుంచి పంచాయతీ సెక్రటరీలు, ఎంపీడీవోలు అప్లికేషన్లు తీసుకుని, అర్హులను గుర్తించి ఎప్పటికప్పుడు ఎంపీడీవో లాగిన్ లో అప్​లోడ్​ చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ కేటగిరీలకు చెందిన వాళ్ల అప్లికేషన్లు  ప్రతి నెలా సగటున 10 వేల వరకు వస్తున్నాయి. ఇట్లా ఇలాంటి అప్లికేషన్లు మూడేండ్ల కాలంలో మూడు లక్షల వరకు వచ్చాయి.  ఆన్​లైన్​లో ఈ అప్లికేషన్లు అప్రూవ్డ్​గా చూపిస్తున్నప్పటికీ ప్రభుత్వం నుంచి అనుమతి లేకపోవడంతో శాంక్షన్ చేయడం లేదని ఆఫీసర్లు చెప్తున్నారు.

ఇస్తామని చెప్పుడు తప్ప..!

57 ఏండ్లు నిండినోళ్లకు ఆసరా పెన్షన్లు కచ్చితంగా ఇస్తామని సీఎం కేసీఆర్ గత రెండున్నరేండ్లలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో పలుమార్లు ప్రకటించారు. 2019 – 20 బడ్జెట్​లో ఆసరా పెన్షన్ల కోసం అదనంగా నిధులు కేటాయించారు. కానీ, ఇప్పటివరకు ఇయ్యలేదు. ఈ ఏడాది ఆగస్టు నుంచే ఆసరా కొత్త పెన్షన్లు ఇస్తామంటూ జులైలో సిరిసిల్ల పర్యటనలో సీఎం ప్రకటించారు. అయితే ఆగస్టు నెలలో ఆసరా ఓల్డేజ్ పెన్షన్ అర్హత వయసును 57 ఏండ్లకు తగ్గిస్తూ సర్కార్ నుంచి ఉత్తర్వులు మాత్రమే వెలువడ్డాయి. అదే నెలలో అప్లికేషన్లు తీసుకున్నారు.  ఆగస్టు, సెప్టెంబర్ పోయి అక్టోబర్ వచ్చినా కొత్త పెన్షన్ల జాడ లేదు. అసలు అప్లికేషన్ల వెరిఫికేషన్​నే  ఇప్పటివరకు ప్రారంభించలేదు. కనీసం ఏ శాఖ అధికారులు వెరిఫికేషన్ చేయాలనే విషయంపైనా ఆదేశాలు రాలేదు. తాజాగా మరోసారి అప్లికేషన్లు స్వీకరిస్తుండడంతో ఈ నెల కూడా ప్రభుత్వానికి కొత్త పెన్షన్లు ఇచ్చే ఉద్దేశం ఉన్నట్లు కనిపించడం లేదు. సర్కార్ చేస్తున్న ఆలస్యం వల్ల  కొత్త పెన్షన్ మంజూరు మరింత ఆలస్యమయ్యే పరిస్థితి కనిపిస్తున్నది. 

మూడేండ్లలో తీసేసిన పెన్షన్లు 2.50 లక్షలు

అనారోగ్యం, ఇతర కారణాలతో చనిపోయిన లబ్ధిదారులు, వరుసగా మూడు నెలలు పెన్షన్​ తీసుకోని లబ్ధిదారుల పేర్లను రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు తొలగిస్తున్నది. ఇట్లా ప్రతి నెలా 5 వేల నుంచి 6 వేల మంది పేర్లను ఆసరా పెన్షనర్ల జాబితా నుంచి తీసేస్తున్నది. 2019లోనే 1,16,534 పేర్లను ఆసరా జాబితా నుంచి ప్రభుత్వం తొలగించింది. 2019 డిసెంబర్ లో నిర్వహించిన స్పెషల్ డ్రైవ్​లో 52,082 మంది పేర్లను ఒకేసారి తీసేసింది. మొత్తంగా గడిచిన మూడేండ్లలో రెండున్నర లక్షల మందిని తొలగించినట్లు తెలిసింది. 2019 జనవరి నాటికి రాష్ట్రంలో ఆసరా పెన్షన్​ పొందుతున్నవారి సంఖ్య 39.14 లక్షలు ఉండగా.. ప్రస్తుతం 37 లక్షల్లోపు చేరింది. దీంతో ప్రతి నెలా సుమారు రూ. 50 కోట్లకుపైగా ఆసరా నిధులు మిగిలిపోతున్నాయి. తొలగించిన వారి స్థానంలో ఎప్పటికప్పుడు కొత్త వాళ్లకు  ఇచ్చే అవకాశం ఉన్నా.. ప్రభుత్వం స్పందించడం లేదు.
ఇప్పటివరకు ఒక్కొక్కరికి రూ. 68 వేలు అందేవి రాష్ట్ర ప్రభుత్వం ఓటరు లిస్టు ఆధారంగా జిల్లాల్లో గుర్తించిన 6.70 లక్షల మంది అర్హులతోపాటు హైదరాబాద్ లోని మరో 2 లక్షల మందికి ఓల్డేజ్ పెన్షన్ (రూ. 2,016) ను 2019 జనవరి నుంచి ఇస్తే ఇప్పటి వరకు ఒక్కొక్కరికి దాదాపు రూ. 68 వేలు అందేవి. ఇలా గడిచిన 34 నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా 8.70 లక్షల మందికి సుమారు రూ. 6 వేల కోట్లు వచ్చేవి. వీరితో పాటు ఏడాదికి సగటున లక్ష మంది చొప్పున ఈ మూడేండ్లలో కొత్తగా ఆసరా పరిధిలోకి వచ్చిన వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, పైలేరియా బాధితులు, 50 ఏండ్లు పైబడిన చేనేత, గీత, బీడీ కార్మికులు 3 లక్షల మంది ఉన్నారు. వీరికి ఎప్పటికప్పుడు పెన్షన్ క్లియర్​ చేస్తే  మరో రూ. వెయ్యి కోట్లు ఖర్చయ్యేదని అంచనా. ఇట్లా దాదాపు రూ. 7 వేల కోట్ల పెన్షన్​ డబ్బులను సర్కారు తన దగ్గర పెట్టుకున్నది. 

ఎన్నికలున్న చోటనే ఇచ్చుడు

ఉప ఎన్నికలు ఎక్కడ ఉంటే అక్కడనే కొత్త ఆసరా పెన్షన్లను సర్కారు మంజూరు చేస్తున్నది. మొన్నామధ్య హుజుర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్, దుబ్బాక, నాగార్జునసాగర్ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరిగినప్పుడు అక్కడి పెండింగ్ పెన్షన్ అప్లికేషన్లలో కొన్నింటిని బయటకు తీసి మంజూరు చేసింది. ఇప్పుడు హుజూరాబాద్​లో ఉప ఎన్నిక ఉండటంతో అక్కడ కూడా కొత్త పెన్షన్​  మంజూరు చేస్తున్నది. హుజూరాబాద్​ సెగ్మెంట్​లో పెండింగ్ లో ఉన్న అప్లికేషన్లన్నీ జులైలోనే క్లియర్ చేసింది.  అయితే.. అది కూడా 57 ఏండ్లు నిండినోళ్లవి కావు.  కొత్త పెన్షన్ ఇవ్వాలంటే.. ఎన్నికలు రావాల్సిందేనా అనే అభిప్రాయం రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల ప్రజల్లో వ్యక్తమవుతున్నది.