
- హైకోర్టు స్టేపై అప్పీల్ చేసేందుకు ఏర్పాట్లు
- ఏజీ సుదర్శన్‌రెడ్డి, సీనియర్ లాయర్ సింఘ్వీతో మాట్లాడిన సీఎం
హైదరాబాద్, వెలుగు: స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ ఇచ్చిన జీవో 9పై హైకోర్టు ఇచ్చిన స్టే ఉత్తర్వులను రద్దు చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించనుంది. స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్‌ఎల్‌పీ) దాఖలు చేస్తేందుకు కసరత్తులు చేస్తున్నది. ఇదే విషయమై అడ్వకేట్‌జనరల్ సుదర్శన్‌రెడ్డి, సుప్రీంకోర్టు న్యాయవాది అభిషేక్ సింఘ్వీతో సీఎం రేవంత్ రెడ్డి ఫోన్లో మాట్లాడారు.
కుల గణన సర్వే నివేదిక, దాంట్లో బీసీల వెనకబాటుపై సైంటిఫిక్ డేటా, బీసీ డెడికేటెడ్ కమిషన్ నివేదిక వంటి అన్నింటిని సుప్రీంకోర్టుకు సమర్పించాలన్నారు. ఇందిరాసహాని కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో మాత్రమే రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదని చెప్పిందని రాష్ట్రం చెప్తున్నది. ఈ తీర్పు రాజకీయ పదవుల రిజర్వేషన్లకు వర్తించవని వాదనలు వినిస్తున్నది.
ఈ నేపథ్యంలోనే హైకోర్టు బీసీ రిజర్వేషన్ల పెంపుపై ఇచ్చిన స్టే ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ రాష్ట్ర సర్కార్ ఎస్‌ఎల్‌పీ దాఖలు చేసేందుకు న్యాయపరమైన ప్రయత్నాలు చేస్తున్నది. ఇదిలా ఉండగా.. రాష్ట్ర ప్రభుత్వం ఎస్‌ఎల్‌పీ దాఖలు చేస్తే, తమ వాదనలు విన్న తర్వాతే తగిన ఉత్తర్వులు ఇవ్వాలంటూ బీసీ రిజర్వేషన్లను సవాల్ చేసిన పిటిషనర్ మాధవరెడ్డి ఇతరులు సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలు చేయనున్నారు.
నోటిఫికేషన్‌పై స్టే ఇవ్వలే.. జీవోలపైనే ఇచ్చినం: హైకోర్టు
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను 25% నుంచి 42 శాతానికి పెంచడాన్ని మాత్రమే నిలుపుదల చేశామని, స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ అమలును నిలిపివేయలేదని హైకోర్టు స్పష్టం చేసింది. రిజర్వేషన్లను పెంచకుండా పాత విధానంలో ఎన్నికలు నిర్వహించేందుకు ఎలాంటి అడ్డంకులు లేవని ఉత్తర్వుల్లో పేర్కొంది. బీసీలకు 42 % రిజర్వేషన్ల పెంపు వల్ల మొత్తం రిజర్వేషన్లు 67 శాతానికి పెంచడం సుప్రీంకోర్టు తీర్పునకు వ్యతిరేకమని.. అందుకే స్టే ఇస్తున్నట్లు చెప్పింది.
50 శాతానికి మించి ఉన్న 17 శాతం రిజర్వేషన్లను జనరల్ కేటగిరీగా పరిగణించి పాత పద్ధతిలో ఎన్నికలు నిర్వహించేందుకు ఎలాంటి అభ్యంతరం లేదంది. అంటే బీసీలకు 25 %, ఎస్సీలకు 15, ఎస్టీలకు 10 % చొప్పున కేటాయిస్తూ ఎన్నికలు నిర్వహిం చవచ్చునని చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 26న జారీ చేసిన బీసీ రిజర్వేషన్ల పెంపునకు సంబంధించిన జీవో 9, గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ పదవులకు రిజర్వేషన్లను స్థిరీకరిస్తూ పంచాయతీరాజ్ శాఖ జారీ చేసిన జీవోలు 41, 42 అమలును నిలిపివేస్తూ మధ్యంతర స్టే ఆదేశాలిస్తున్నట్లు చెప్పింది.
కేశవ్ కిషన్‌రావు గవాలి కేసును పరిగణనలోకి తీసుకుని జీవోలపై స్టే ఇస్తున్నట్లు తెలిపింది. ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయ్యాక కోర్టుల జోక్యానికి వీల్లేదని సుప్రీం తీర్పు ఉన్నందున రాష్ట్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఎలక్షన్ నోటిఫికేషన్ విషయంలో జోక్యం చేసుకోవడం లేదంది. తదుపరి విచారణను డిసెంబర్ 3కి వాయిదా వేస్తున్నట్టు శుక్రవారం రాత్రి వెలువరించిన ఉత్తర్వుల్లో పేర్కొంది.