ఆటిజం పిల్లలకు సర్కార్ ఆసరా!..దివ్యాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో స్పెషల్ సెంటర్ల ఏర్పాటుకు నిర్ణయం

ఆటిజం పిల్లలకు సర్కార్ ఆసరా!..దివ్యాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో స్పెషల్ సెంటర్ల ఏర్పాటుకు నిర్ణయం
  •     ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిన అధికారులు
  •     ఫ్రీగా స్పీచ్, బిహేవియరల్, ఆక్యుపేషనల్ థెరపీలు
  •     ప్రైవేటు, కార్పొరేట్‌‌ సెంటర్లకు దీటుగా సెంటర్లు ఉండేలా ప్రణాళికలు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఆటిజంతో బాధపడుతున్న పిల్లలకు ప్రభుత్వం అండగా నిలవనుంది. తొలిసారిగా ఆటిజం పిల్లల కోసం అత్యాధునిక సౌకర్యాలతో ఒక ‘ఎక్స్‌‌క్లూజివ్ ఆటిజం సెంటర్’ఏర్పాటు చేయాలని దివ్యాంగులు, వయోవృద్ధులు, ట్రాన్స్‌‌జెండర్ల సాధికారత శాఖ నిర్ణయించింది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను ఆ డిపార్ట్‌‌మెంట్ అధికారులు ప్రభుత్వానికి పంపారు. సర్కారు ఓకే చెప్తే ఆటిజం బాధితులకు కార్పొరేట్ స్థాయి చికిత్స ఉచితంగా అందనుంది. ప్రభుత్వం ఈ ప్రతిపాదనపై నిర్ణయం తీసుకుంటే దివ్యాంగుల సంక్షేమ శాఖ, ఎన్జీవోల సహకారంతో సెంటర్‌‌‌‌ను ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.

అన్ని థెరపీలు ఒకే చోటా... 

ఆటిజం ఉన్న పిల్లలకు మందుల కంటే థెరపీలే ముఖ్యం. కొత్తగా ఏర్పాటు చేయబోయే సెంటర్‌‌‌‌లో మాటలు రాని పిల్లలకు స్పీచ్ థెరపీ, కోపం-మొండితనం తగ్గించేందుకు బిహేవియరల్ థెరపీ, బట్టలు వేసుకోవడం-, తినడం వంటివి నేర్పించే ఆక్యుపేషనల్ థెరపీలను నిపుణులు అందిస్తారు.

అయితే.. ప్రస్తుతం రాష్ట్రంలో ఆటిజం కోసం స్పెషలైజ్డ్ ప్రభుత్వ హాస్పిటల్ ఒక్కటి కూడా లేదు. నిలోఫర్‌‌‌‌లో చిన్న పిల్లల కోసం ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ ఉన్నా.. అక్కడ రద్దీ ఎక్కువ. ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్‌‌లోనూ ఆటిజం కోసం స్పెషల్ వింగ్ లేదు. ఈ నేపథ్యంలోనే ఆటిజం పిల్లల కోసం ప్రత్యేకంగా ఒక సెంటర్ ఉండాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయం తీసుకుంటే పేద పిల్లలకు, వారి తల్లిదండ్రులకు ఊరట లభించనుంది.

చిన్న వయసులోనే చికిత్స అందిస్తే...

ఆటిజం లక్షణాలు ఉన్న పిల్లలను చిన్నతనంలోనే గుర్తించి సరైన చికిత్స అందిస్తే త్వరగా కోలుకుంటారని వైద్య నిపుణులు చెబుతున్నారు. ప్రైవేట్ సెంటర్లలో ఆటిజం చికిత్సకు నెలకు రూ.20 వేల నుంచి రూ.50 వేల దాకా వసూలు చేస్తున్నాయి. పేద, మధ్య తరగతి కుటుంబాలు ఆ భారాన్ని మోయలేక ప్రైవేట్ సెంటర్లకు వెళ్లలేని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే దివ్యాంగుల సంక్షేమ శాఖ అధికారులు పక్కా ప్లాన్‌‌తో ప్రతిపాదనలు రెడీ చేశారు. భవనం ఎక్కడ తీసుకోవాలి? ఎంతమంది స్టాఫ్ కావాలి? బడ్జెట్ ఎంతవుతుంది? అనే వివరాలను ప్రభుత్వానికి నివేదించారు. అవసరమైతే ఎన్జీవోల సహాయం కూడా తీసుకోనున్నట్లు అధికారులు వెల్లడించారు. 

కార్పొరేట్‌‌కు ధీటుగా... 

ఆటిజం సెంటర్ అంటే ఏదో సాదాసీదాగా కాకుండా కార్పొరేట్ స్థాయిలో ఏర్పాటు చేసేలా అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. పిల్లలకు ఒక ప్రత్యేక ప్రపంచంలా అనుభూతి చెందేలా సెంటర్‌‌‌‌ను డెవలప్ చేయనున్నారు. రంగురంగుల లైట్లు, మెత్తటి పరుపులు, ఊయలలతో కూడిన సెన్సరీ ఇంటిగ్రేషన్ రూమ్స్ వంటివి పిల్లలకు అందుబాటులో ఉండనున్నాయి. పిల్లలు ఆడుకుంటూనే నేర్చుకునేలా స్పెషల్ ప్లే థెరపీ ఏరియాలు, బయటి సౌండ్స్ వినిపించకుండా ఏకాగ్రత పెంచే సౌండ్ ప్రూఫ్ రూమ్స్‌‌ను ఏర్పాటు చేయనున్నారు. ఒకే చోట సైకాలజిస్టులు, థెరపిస్టులు, స్పెషల్ ఎడ్యుకేటర్లు అందుబాటులో ఉండి పిల్లలను పర్యవేక్షించేలా మల్టీ డిసిప్లినరీ అప్రోచ్‌‌ పద్ధతిని తీసుకురానున్నారు.