ప్రభుత్వ సమాచారం ముందే లీక్​!.. రెడీ చేస్తున్నప్పుడే ప్రతిపక్ష లీడర్ల చేతుల్లోకి

ప్రభుత్వ సమాచారం ముందే లీక్​!.. రెడీ చేస్తున్నప్పుడే ప్రతిపక్ష లీడర్ల చేతుల్లోకి
  • అసెంబ్లీలో ప్రవేశపెట్టకముందే శ్వేతపత్రాల్లోని వివరాలు బయటికి
  • వాటి ఆధారంగా కౌంటర్​ను ప్రిపేర్​ చేసుకున్న కొందరు ప్రతిపక్ష సభ్యులు
  • మంత్రుల కదలికలు, ఇంటర్నల్​ రివ్యూలు కూడా లీక్​ 
  • వ్యవహారాన్ని సీఎంకు చేర్చిన ఇంటెలిజెన్స్
  • అంతర్గత విషయాలు లీకైతే కఠిన చర్యలు 
  • తప్పవని ఆఫీసర్లకు సీఎం హెచ్చరిక

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన అంతర్గత సమాచారం బయటకు లీక్​అవుతున్నది. ప్రభుత్వం ఏం చెప్పబోతున్నది? సీఎం, మంత్రుల ఇంటర్నల్​ రివ్యూల్లో ఏం జరుగుతున్నది?  ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నరు.. అనే వివరాలు కొందరు ప్రతిపక్ష లీడర్లకు ముందే చేరిపోతున్నాయి. మొన్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం శ్వేత పత్రాలు విడుదల చేయగా.. ఆ వివరాలు కూడా ముందుగా కొందరు ప్రతిపక్ష సభ్యులకు చేరినట్లు తెలిసింది. లీక్​ సమాచారాన్ని ఆధారంగా చేసుకొని ప్రభుత్వ వైట్​పేపర్​కు కౌంటర్​ను ముందుగానే ఆ ప్రతిపక్ష సభ్యులు రెడీ చేసుకున్నట్లు ఇంటెలిజెన్స్​ వర్గాలు గుర్తించాయి. 

దీన్ని  సీఎం రేవంత్​రెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన ప్రభుత్వ యంత్రాంగాన్ని అలర్ట్​ చేశారు. ప్రభుత్వంలో జరుగుతున్న వ్యవహారాలతో పాటు నివేదికలు, సమీక్షల్లో అంతర్గతంగా మాట్లాడుకున్న విషయాలు బయటకు వెళ్తే కఠిన చర్యలుంటాయని సీఎం హెచ్చరించినట్లు తెలిసింది. అన్ని ప్రభుత్వ విభాగాల హెచ్​వోడీలకూ ఈ విషయాన్ని స్పష్టం చేసినట్లు సమాచారం. అంతేకాకుండా గత ప్రభుత్వానికి దగ్గరగా ఎవరైతే పనిచేశారో ఆ సిబ్బందిపై నిఘా పెట్టాలని ఇంటెలిజెన్స్​ వర్గాలను ఆదేశించినట్లు తెలిసింది.  

రివ్యూల నుంచి శ్వేతపత్రాల దాకా..! 

ఈ నెల 7న రాష్ట్రంలో కొత్తగా కాంగ్రెస్​ ప్రభుత్వం కొలువుదీరింది. ఆ రోజే తొలి కేబినేట్​ సమావేశం జరిగింది. ఆ మంత్రివర్గ సమావేశంలో సీఎం ఏం మాట్లాడారు ? మిగతా మంత్రులు, కొందరు ఉన్నతాధికారులు ఎవరెవరు ఏం మాట్లాడారు?.. అనే దానిపై పొల్లుపోకుండా ప్రధాన ప్రతిపక్షంలోని ఇద్దరు ముఖ్య లీడర్లకు చేరింది. ఆ తర్వాత ధరణి, డ్రగ్స్​ వంటి వాటిపై సీఎం చేసిన రివ్యూల్లోనూ ఏం జరిగిందనే వివరాలు బయటకు వెళ్లినట్లు ఇంటెలిజెన్స్​ వర్గాలు గుర్తించాయి. పదేండ్లలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై రిలీజ్​ చేసిన వైట్​పేపర్​తో పాటు విద్యుత్​పై అసెంబ్లీలో పెట్టిన శ్వేతపత్రం రెండింటిలోని పూర్తి సమాచారం తయారుచేస్తున్న క్రమంలోనే బయటకు లీక్​ అయినట్లు తెలిసింది. అసెంబ్లీలో చర్చ సందర్భంగా ప్రతిపక్ష సభ్యుడు ఒకరు.. ఆర్థిక పరిస్థితిపై  శ్వేతపత్రం ఎవరితో తయారు చేయించారో పేరు చెప్పమంటరా? ఏపీలో సస్పెండ్​ అయిన ఆఫీసర్ తో చేయించారు అని అన్నారు. పైగా ప్రభుత్వం శ్వేతపత్రాల్లో చెప్పిన అంశాలకు ముందుగానే పేజీల కొద్దీ కౌంటర్​ను రెడీ చేసుకొని వచ్చారు. వీటితోపాటు మంత్రుల కదలికలు, వారి ఇంటర్నల్​ రివ్యూల్లో ఏం జరుగుతుందనేది కూడా ముందుగానే బయటకు పొక్కుతుండటంపై ప్రభుత్వాన్ని ఇంటెలిజెన్స్​వర్గాలు అలర్ట్​ చేశాయి. దీంతో ఎవరు సమాచారాన్ని లీక్​ చేస్తున్నారు అనే వివరాలను ప్రభుత్వం ఆరా తీస్తున్నది. అలాంటి వారిపై చర్యలకు రెడీ అవుతున్నది.  

పాత ప్రభుత్వంలో ఉన్నోళ్లు వద్దు!

బీఆర్‌‌‌‌ఎస్ ప్రభుత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేల దగ్గర పీఏ, పీఎస్, అడిషనల్ పీఎస్, పీఆర్వోలుగా పని చేసిన వ్యక్తులను దూరం పెట్టాలని కొత్త ప్రభుత్వం భావిస్తున్నది. ఈ విషయంలో ఇంటెలిజెన్స్​ నుంచి రిపోర్టులు తెప్పించుకుంటున్నది. ప్రభుత్వాన్ని పకడ్బందీగా నడిపేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. అయితే  కొత్త మంత్రుల వద్ద పని చేసేందుకు గత ప్రభుత్వంలోని మంత్రుల దగ్గర పనిచేసిన వాళ్లంతా మళ్లీ క్యూ కడుతున్నారు. గతంలో ఏ డిపార్ట్​మెంట్​ మంత్రి దగ్గర చేశారో ఇప్పుడు అదే శాఖల మంత్రుల వద్ద కుదరకపోతే తమకు ఎక్కడ వర్క్​ అవుట్​ అవుతుందో వారి దగ్గర పాగా వేసేందుకు వాళ్లు ప్లాన్​ చేస్తున్నారు. ఇప్పటికే కొందరు ఆర్డర్లు రాకపోయినా.. ఆయా మంత్రుల చాంబర్ల దగ్గర దర్శనమిస్తున్నారు.