- జిల్లా యూనిట్‌గా జూనియర్ అసిస్టెంట్ల నియామకాలు
- పోలీసు శాఖలో పోస్టులపై సర్కార్ నిర్ణయం.. ఉత్తర్వులు జారీ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర పోలీస్ శాఖలోని మినిస్టీ రియల్ సర్వీస్ నిబంధనలకు సవరణలు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 1998 నాటి సర్వీస్ రూల్స్‌లోని రూల్ 4, రూల్ 13కు మార్పులు చేస్తూ సీఎస్ కె. రామకృష్ణారావు జీవో జారీ చేశారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన స్థానిక కేడర్లు, జోనల్ వ్యవస్థకు తగ్గట్టుగా ఈ నియామక ప్రక్రియలో స్పష్టత తీసుకువచ్చారు.
కొత్త నిబంధనల ప్రకారం, సూపరింటెండెంట్లు, మేనేజర్లు, సీనియర్ అసిస్టెంట్ స్థాయి పోస్టులకు ఆయా జోన్ల డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ నియామక అధికారిగా వ్యవహరిస్తారు. కాళేశ్వరం, బాసర, రాజన్న, భద్రాద్రి, యాదాద్రి, చార్మినార్ జోగు లాంబ అనే ఏడు జోన్ల పరిధిలోని కార్యాలయాలకు సంబంధించి ఈ నియామక బాధ్యతలను అప్పగించారు.
పదోన్నతులకు సీనియారిటీ లెక్కించేటప్పుడు సంబంధిత జోన్‌ను ఒక యూనిట్‌గా పరిగణనలోకి తీసుకుంటారు. జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, జూని యర్ స్టెనోగ్రాఫర్ వంటి పోస్టులకు సంబంధించి ఆయా జిల్లా పోలీస్ కార్యాలయాలు లేదా కమిషనరేట్లను విడి విడిగా 'యూనిట్ ఆఫ్ అపాయింట్‌మెంట్'గా నిర్ణయించారు. ఈ పోస్టులకు సంబంధిత జిల్లాల ఎస్పీలు లేదా కమిషనరేట్ల పరిధిలో కమిషనర్లు నియామక అధికారులుగా ఉంటారు. టీజీఎస్పీ బెటాలియన్లు, పోలీస్ ట్రైనింగ్ కాలేజీల విషయంలో కమాండెంట్లు లేదా ప్రిన్సిపాల్స్ ఈ బాధ్యతలను నిర్వర్తిస్తారు.
