విధులకు డుమ్మా కొట్టే ఉద్యోగులకు షాక్..ఇక డైరెక్ట్ ఇంటికే!

విధులకు డుమ్మా కొట్టే ఉద్యోగులకు షాక్..ఇక డైరెక్ట్  ఇంటికే!
  •     ఫారిన్ సర్వీస్ గడువు దాటితే వేటే
  •     తెలంగాణ సివిల్ సర్వీసెస్ రూల్స్‌‌‌‌‌‌‌‌లో సర్కార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సవరణలు 

హైదరాబాద్, వెలుగు: విధులకు డుమ్మా కొట్టే ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. అనధికారికంగా దీర్ఘకాలం పాటు విధులకు హాజరుకాని వారిపై కఠిన చర్యలు తీసుకునేలా నిబంధనలను సవరించింది. అనుమతి లేకుండా విధులకు గైర్హాజరయ్యే వారిని నేరుగా సర్వీసు నుంచి తొలగించేలా ‘తెలంగాణ సివిల్ సర్వీసెస్ (క్లాసిఫికేషన్, కంట్రోల్ అండ్ అప్పీల్) రూల్స్- 1991’కి కీలక సవరణలు చేస్తూ సీఎస్​ రామకృష్ణారావు శుక్రవారం జీవో జారీ చేశారు. 

ఈ ఉత్తర్వుల ప్రకారం.. ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా ముందస్తు అనుమతి లేకుండా ఒక సంవత్సరానికి మించి విధులకు గైర్హాజరైతే, వారిని సర్వీసు నుంచి తొలగించినట్లే పరిగణిస్తారు. అలాగే, సెలవు ఉన్నా లేకున్నా.. వరుసగా ఐదేళ్ల పాటు విధులకు దూరంగా ఉంటే వారిపై కూడా వేటు పడుతుంది. 

దీంతో పాటు ప్రభుత్వం అనుమతించిన గడువు దాటిన తర్వాత కూడా ఫారిన్ సర్వీసులో కొనసాగితే వారిని కూడా సర్వీసు నుంచి తొలగించేలా నిబంధనలను కఠినతరం చేశారు. ఈ నిబంధనలను అమలు చేసే ముందు సదరు ఉద్యోగికి వివరణ ఇచ్చుకునే అవకాశం కల్పిస్తారు. విధులకు ఎందుకు హాజరు కాలేదో, లేదా ఫారిన్ సర్వీసులో ఎందుకు కొనసాగుతున్నారో వివరించాలని షోకాజ్ నోటీసు జారీ చేస్తారు. ఇకపై, విధుల్లో నిర్లక్ష్యాన్ని, దీర్ఘకాలిక గైర్హాజరును ఉపేక్షించేది లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది.