- ఈ నెల 29 నుంచి జూన్ 3 వరకు కొత్త టైమింగ్స్: మంత్రి పొంగులేటి
- రిజిస్ట్రేషన్లలో వేగం, పారదర్శకతే లక్ష్యమని వెల్లడి
- స్లాట్ బుకింగ్‌ల సంఖ్య పెంచాలని అధికారులకు ఆదేశం
- భూముల విలువల క్రమబద్ధీకరణ నేపథ్యంలో రిజిస్ట్రేషన్లకు పెరిగిన డిమాండ్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో భూముల విలువలను వాస్తవ మార్కెట్ ధరలకు అనుగుణంగా క్రమబద్ధీకరించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించడంతో రాష్ట్రవ్యాప్తంగా రిజిస్ట్రేషన్లకు డిమాండ్ పెరిగింది. ఈ నేపథ్యంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే రాష్ట్రంలోని అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పని వేళలను పొడిగిస్తున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు.
ఈ నెల 29వ తేదీ నుంచి జూన్ 3వ తేదీ వరకు ఉదయం 9.30 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు కార్యాలయాలు పనిచేస్తాయని తెలిపారు. రిజిస్ట్రేషన్ల కోసం వచ్చే ప్రజలు గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి రాకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు మంత్రి స్పష్టం చేశారు.
"ప్రజలకు సేవ చేయడమే ప్రభుత్వ ధ్యేయం. రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో వేగం, పారదర్శకత, సౌకర్యం అనేవి మూడు ప్రధాన లక్ష్యాలు" అని మంత్రి పొంగులేటి తెలిపారు. ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని రోజువారీ స్లాట్ బుకింగ్‌ల సంఖ్యను కూడా పెంచాలని అధికారులను ఆదేశించారు. రిజిస్ట్రేషన్ల డిమాండ్‌ను బట్టి అవసరమైతే అదనపు సమయంతో పాటు మరిన్ని రోజులు కూడా పని వేళలను పొడిగించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడించారు.
వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు జరిగే తహసీల్దార్ కార్యాలయాలతో కూడా నిరంతరం సమన్వయం పెంచుకుంటూ ఎక్కడా ఆలస్యం లేకుండా రైతులకు సేవలు అందించాలని స్పష్టం చేశారు. ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన, సౌకర్యవంతమైన సేవలు అందించడంలో ఎలాంటి అలసత్వం వహించవద్దని రాష్ట్ర రిజిస్ట్రేషన్ల ఐజీ రాజీవ్ గాంధీ హనుమంతుకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు.
