- సభ్యులుగా కోదండరాం, మంత్రి పొన్నం, ఎమ్మెల్సీ అద్దంకి, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్
- సోమవారం కేకే ఇంట్లో మొదటిసారి సమావేశం
- 3 కేటగిరీల్లో ఉద్యమకారులను గుర్తించాలని నిర్ణయం
- గుర్తింపు అనంతరం వారికి ఇచ్చే అవార్డులు, రివార్డులపైనా చర్చ
- మరోసారి సమావేశమై పలు సిఫారసులతో సీఎంకు నివేదిక ఇవ్వనున్న కమిటీ
- గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో గుర్తించని వారికి జాబితాలో చోటు
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి.. వారిని ఆదుకునేందుకు కాంగ్రెస్ సర్కార్ వేగంగా అడుగులు వేస్తోంది. ఉద్యమకారుల గుర్తింపు కోసం సీఎం రేవంత్ రెడ్డి తాజాగా ఓ కమిటీని నియమించారు. సీనియర్ రాజకీయ నేత, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కే. కేశవరావు చైర్మన్ గా ఏర్పాటు చేసిన ఈ కమిటీలో సభ్యులుగా మంత్రి పొన్నం ప్రభాకర్, టీజేఎస్ చీఫ్ కోదండరాం, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ ఉన్నారు.
ఈ కమిటీ సోమవారం మధ్యాహ్నం బంజారా హిల్స్ లోని కేకే ఇంట్లో సమావేశమైంది. మంత్రి పొన్నం.. సీఎం రేవంత్ వెంట కాళేశ్వరం వెళ్లడంతో ఆయన మినహా మిగితా సభ్యులు ఇందులో పాల్గొన్నారు. ఇందులో పలు అంశాలపై చర్చించారు. మరోసారి కమిటీ సమావేశమై పలు నిర్ణయాలు తీసుకొని వాటిని సీఎం రేవంత్ రెడ్డికి సిఫారసు చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ఇందులో ముఖ్యంగా గత బీఆర్ఎస్ సర్కార్ గుర్తించి, సహాయం పొందిన తెలంగాణ ఉద్యమకారులను మినహాయించి, ఆ ప్రభుత్వంలో గుర్తింపు పొందని వారిని ఆదుకోవాలనే నిర్ణయానికి వచ్చారు. ఇందులో మూడు కేటగిరీలుగా తెలంగాణ ఉద్యమకారులను గుర్తించాలని సమావేశం నిర్ణయించింది.
‘ఏ’ కేటగిరీలో.. అమరులైన కుటుంబాలను, ‘బీ’ కేటగిరీలో.. ఉద్యమంలో దివ్యాంగులైన వారిని, ‘సీ’ కేటగిరీలో.. జైలుకు వెళ్లిన వారిని గుర్తించి ఆదుకోవడంపై ఈ సమావేశంలో చర్చించారు. ఇక ఉద్యమంలో పాల్గొని పోలీసు కేసులు ఉన్న వారిని, ఇతరులను ఆ తర్వాత విడతలో గుర్తించాలని నిర్ణయించారు. గుర్తింపు అనంతరం వీరికి ఇచ్చే అవార్డులు, రివార్డులపై కూడా చర్చించారు. వైద్యాన్ని పూర్తి ఉచితంగా, విద్యలో ఎంత శాతం వరకు మినహాయింపు ఇవ్వాలనే దానిపై చర్చ జరిగింది.
వీటితో పాటు ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఏ శాతం మేరకు అమలు చేయాలి, ప్రభుత్వ పథకాలైన ఇందిరమ్మ ఇండ్లు, ఇతర స్కీముల్లో వీరికి ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వాలనే విషయాలపై కూడా ఈ కమిటీ చర్చించింది. త్వరలోనే మరోసారి సమావేశమై దీనిపై విధి విధానాలను రూపొందించి, వాటిని సీఎం రేవంత్ రెడ్డికి సిఫారసు చేయాలని కమిటీ నిర్ణయించింది. ఆ తర్వాత సీఎం ఈ కమిటీ సిఫారసులను పరిగణనలోకి తీసుకుని తుది నిర్ణయం తీసుకోనున్నారు.
హామీ మేరకు కమిటీ ఏర్పాటు
వాస్తవానికి తెలంగాణ ఉద్యమంలో 1,200 మంది ఆత్మబలిదానం చేసుకున్నారని అప్పటి బీఆర్‌ఎస్ సర్కార్ స్వయంగా అసెంబ్లీలోనే ప్రకటించింది. అయితే, గుర్తింపు ప్రక్రియలో మాత్రం కొన్ని పరిమితులను అప్పటి ప్రభుత్వం విధించడంతో కేవలం 585 మందిని అధికారికంగా అమరవీరులుగా గుర్తించింది. గుర్తించిన వారికి రూ.10 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందించింది. 2014 అక్టోబర్ లో మొదటి విడతలలో 459 మందికి, ఆ తర్వాత 2020 వరకు మరో 126 మందికి ఎక్స్‌గ్రేషియా అందించారు.
దీంతో మిగిలిన అమరుల కుటుంబాలకు కూడా న్యాయం చేయాలని పలువురు అమరుల కుటుంబాల సభ్యులు, జేఏసీలు డిమాండ్ చేస్తూ వచ్చాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ.. తెలంగాణ అమరుల కుటుంబాలను, ఉద్యమకారులను ఆదుకుంటామని పీసీసీ చీఫ్ హోదాలో రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు ఇప్పుడు ఈ కమిటీని నియమించి బీఆర్ఎస్ సర్కార్ నుంచి సహాయం పొందని అసలైన తెలంగాణ అమరులను, ఉద్యమకారులను గుర్తించేందుకు సిద్ధమయ్యారు. ఈ ప్రభుత్వ హయాంలో తమకు న్యాయం జరుగుతుందనే ఆశతో అమరుల కుటుంబాలు, ఉద్యమకారులు ఉన్నారు. అయితే ఈ కమిటీ నియామకంతో వారిలో ఆశలు పెరిగాయి.

