ఫాంహౌస్ కేసుపై ప్రభుత్వం అప్పీల్ కు వెళ్లే చాన్స్: మాజీ JD లక్ష్మీనారాయణ

ఫాంహౌస్ కేసుపై ప్రభుత్వం అప్పీల్ కు వెళ్లే చాన్స్: మాజీ JD లక్ష్మీనారాయణ

ఫాంహౌస్ కేసును సీబీఐకి అప్పగించడంపై రాష్ట్ర ప్రభుత్వం అప్పీల్కు వెళ్లే అవకాశం ఉందని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ తెలిపారు. ప్రభుత్వం డివిజన్ బెంచ్ లేదా సుప్రీంకోర్టుకు వెళ్లొచ్చని చెప్పారు. హైకోర్టు ఆర్డర్స్ వచ్చిన తర్వాత పూర్తి డిటెయిల్స్ తెలుస్తాయన్నారు. ఇక ఇప్పటి వరకూ సిట్ జరిపిన దర్యాప్తు డిటేయిల్స్, వారి దగ్గర ఉన్న సాక్ష్యాధారాలను సీబీఐకీ అప్పగించాల్సి ఉంటుందన్నారు. సిబీఐ అధికారులకు సిట్ సహకరించాల్సి ఉంటుందన్న ఆయన సీబీఐ మళ్లీ ఫ్రెష్ గా కేసు రిజిస్టర్ చేస్తుందని చెప్పారు. 

కేసీఆర్ సర్కారుకు హైకోర్టులో ఎదురుదెబ్బ

ఫాంహౌస్ కేసులో కేసీఆర్ సర్కారుకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసుకు సంబంధించి హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసును సీబీఐకు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కేసును దర్యాప్తు చేస్తున్న స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం.. సిట్ను రద్దు చేసిన న్యాయస్థానం తక్షణమే దాన్ని సీబీఐకి అప్పగించాలని ఆదేశించింది. సిట్ వద్ద ఉన్న వివరాలు, ఇప్పటి వరకు జరిపిన దర్యాప్తునకు సంబంధించిన మొత్తం సమాచారాన్ని  సీబీఐకు ఇవ్వాలని చెప్పింది. 

ఫాంహౌస్ కేసులో సిట్ దర్యాప్తుపై నమ్మకం లేదని నిందితులు హైకోర్టును ఆశ్రయించారు. సీబీఐ లేదా ఇండిపెండెంట్ దర్యాప్తు సంస్థ ద్వారా ఎంక్వైరీ చేయాలని అభ్యర్థించింది. దర్యాప్తు వివరాల లీకులపై పిటిషనర్లు మొదటి నుంచి అభ్యంతరం వ్యక్తం చేస్తూనే ఉన్నారు. సీఎం కేసీఆర్ సైతం ఆధారాలను లీక్ చేసిన విషయాన్ని న్యాయమూర్తి దృష్టికి తెచ్చారు. పిటిషనర్ల తరఫున మహేశ్ జఠ్మలానీ, సిట్ తరఫున సుప్రీంకోర్టు సీనియర్ అడ్వొకేట్ దుష్యంత్ దవే వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న  న్యాయస్థానం పిటిషనర్ల వాదనలతో ఏకీభవించింది. సిట్ను క్వాష్ చేయడంతో పాటు కేసును సీబీఐకి అప్పగించాలంటూ తీర్పు వెలువరించింది.