ఆలోచనలు చేస్తున్న సర్కార్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర సర్కారు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) లో మరో పేపర్ పెంచాలనే యోచనలో ఉంది. ఇప్పటికే ఎస్జీటీకి పేపర్ 1, స్కూల్ అసిస్టెంట్లకు పేపర్-2 నిర్వహిస్తున్నారు. బీఈడీ పూర్తిచేసిన తెలుగు, హిందీ, ఉర్దూ లాంగ్వేజీ పండిట్ అభ్యర్థులు కూడా పేపర్ 2 నే రాస్తున్నారు. ఈ పేపర్లో పండిట్లకు సంబంధంలేని సబ్జెక్టులైన సోషల్, మ్యాథ్స్ లోంచి 60 మార్కులు ఉండటం వల్ల తాము టెట్‌లో క్వాలిఫై కాలేకపోతున్నామని, ప్రత్యేకంగా పేపర్- 3 పెట్టాలని భాషాపండిట్లు కోరుతున్నారు. ఏపీలో ప్రస్తుతం లాంగ్వేజీ పండిట్ల కోసం టెట్ పేపర్–3 విధానం కొనసాగిస్తున్నారు. తెలంగాణలోనూ లాంగ్వేజీ పండిట్లకు రిలవెంట్ సబ్జెక్టులతో కూడిన ప్రశ్నాపత్రం రూపొందించాలని పండిట్అభ్యర్థులతో కలిసి ఆర్‌యూపీపీ రాష్ట్ర అధ్యక్షుడు సి.జగదీశ్, ఆర్‌యూపీపీటీ రాష్ట్ర అధ్యక్షుడు మహ్మద్ అబ్దుల్లా ఈమధ్యే విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్సీలను, అధికారులను కలిసి వినతిపత్రం అందించారు. టెట్ సిలబస్ మార్చి, పేపర్ 3 ఎగ్జామ్ పెట్టాలని, దీంతో 30వేల మంది అభ్యర్థులకు లాభం చేకూరుతుందని చెప్పారు. ఈ నేపథ్యంలో మంత్రితో పాటు అధికారులు సానుకూలంగా స్పందించారు. ఈ క్రమంలో ఎస్సీఈఆర్టీ అధికారులు పేపర్ –3 పెట్టేందుకు ఉన్న సానుకూల అంశాలతో కూడిన రిపోర్టును సర్కారుకు పంపించారు. దీంతో త్వరలోనే దీనిపై స్పష్టత వచ్చే అవకాశముందని అధికారులు చెప్తున్నారు.
