ఎండలతో ఏ ఒక్క ప్రాణం పోవద్దు!..వ‌‌‌‌‌‌‌‌డ‌‌‌‌‌‌‌‌గాల్పుల‌‌‌‌‌‌‌‌తో అలర్ట్గా ఉండండి: మంత్రి పొంగులేటి

ఎండలతో ఏ ఒక్క ప్రాణం పోవద్దు!..వ‌‌‌‌‌‌‌‌డ‌‌‌‌‌‌‌‌గాల్పుల‌‌‌‌‌‌‌‌తో అలర్ట్గా ఉండండి: మంత్రి పొంగులేటి
  • వడదెబ్బ బారిన పడకుండా ప్రజలకు అవగాహన కల్పించండి
  • ఇప్పటికే ఏడు జిల్లాల్లో16 మంది మృతి
  • మృతుల కుటుంబాల‌‌‌‌‌‌‌‌కు రూ.4 ల‌‌‌‌‌‌‌‌క్షల చొప్పున ప‌‌‌‌‌‌‌‌రిహారం 
  • ఎండల తీవ్రత నేపథ్యంలో అధికారులతో సమీక్ష

హైదరాబాద్, వెలుగు: వ‌‌డ‌‌గాల్పుల‌‌పై అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని, ప్రజల ప్రాణాలకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ తక్షణ చర్యలు చేపట్టాలని రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి  పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి ఆదేశించారు. రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరగడంతో శనివారం సెక్రటేరియెట్​లో రెవెన్యూ ఉన్నతాధికారులతో అత్యవసర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతి కలెక్టర్ తమ జిల్లాలోని హీట్ వేవ్ పరిస్థితులను స్వయంగా పర్యవేక్షించాలని, గ్రామస్థాయి సిబ్బంది వరకు అందరూ క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని సూచించారు. 

వడదెబ్బకు గురైన వారికి తక్షణమే ప్రాథమిక చికిత్స అందించేలా అత్యవసర వైద్య సేవలను సిద్ధం చేయాలన్నారు. వడదెబ్బతో మరణించిన వారి కుటుంబాలకు రూ. 4 లక్షల చొప్పున నష్టపరిహారం అందించనున్నట్లు ఆయన ప్రకటించారు. ఇందుకు సంబంధించిన ప్రక్రియను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని స్పష్టం చేశారు. వచ్చే మూడు రోజుల పాటు వడగాల్పుల తీవ్రత మరింత పెరిగే ప్రమాదం ఉన్నందున, మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ‘‘ఎండలతో ఏ ఒక్క ప్రాణం కూడా పోవడానికి వీల్లేదు’’ అని మంత్రి స్పష్టం చేశారు. 

ఈ నెల 26 వరకు నిప్పుల కొలిమే

వాతావరణ శాఖ తాజా హెచ్చరికల ప్రకారం.. ఈ నెల 26వ తేదీ వరకు కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్‌‌నగర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో తీవ్రస్థాయి వడగాల్పులు వీచే అవకాశం ఉందని మంత్రి తెలిపారు. ఆయా జిల్లాల యంత్రాంగం అనునిత్యం అప్రమత్తంగా ఉండి, విపత్తు నిర్వహణ చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. ప్రభుత్వం అన్ని విభాగాలతో సమన్వయం చేసుకుంటూ తగిన చర్యలు తీసుకుంటోందని, ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలని పొంగులేటి విజ్ఞప్తి చేశారు.