- 10లోగా పంపాలని డీఈఓలకు డైరెక్టర్ ఆదేశం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని సర్కారు ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ స్కూళ్లలో వచ్చే ఏడాది ప్రీ-ప్రైమరీ (ఎల్‌కేజీ, యూకేజీ) సెక్షన్లను మరిన్ని ప్రారంభించేందుకు విద్యాశాఖ అధికారులు కసరత్తు వేగవంతం చేశారు. తమ జిల్లాల పరిధిలో ప్రీ-ప్రైమరీ సెక్షన్లు ప్రారంభించడానికి వీలున్న స్కూళ్ల జాబితా ను సిద్ధం చేసి, ఈ నెల 10లోగా పంపించాలని డీఈఓలకు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఆదేశాలు జారీ చేశారు. ఈ విద్యా సంవత్సరం (2025–-26)లో స్థానిక అవసరాల దృష్ట్యా ఇప్పటికే ప్రీ-ప్రైమరీ క్లాసులు నడుపుతూ, ఇంకా ప్రభుత్వం నుంచి అధికారిక అనుమతి లభించని స్కూళ్ల వివ రాలను ప్రాధాన్యత క్రమంలో పంపాలని సూచించారు.
అలాగే, విద్యార్థుల ఎన్‌రోల్‌మెంట్ ఎక్కువగా ఉండి, ఆయా బడుల పరిధిలో ప్రీ-ప్రైమరీ వయసు పిల్లలు అందుబాటులో ఉన్న చోట కొత్త సెక్షన్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. అయితే, ఆయా బడుల్లో ప్రీ-ప్రైమరీ క్లాసుల నిర్వహణకు అదనంగా గదులు అందుబాటులో ఉండటం తప్పనిసరి అని పేర్కొన్నారు.
