మళ్లీ స్కూళ్లు బంద్ చేసే యోచనలో తెలంగాణ సర్కార్!

మళ్లీ స్కూళ్లు బంద్ చేసే యోచనలో తెలంగాణ సర్కార్!
  • పెరుగుతున్న కరోనా కేసులతో క్లాసులు ఆపే యోచనలో సర్కార్
  • పరిశీలనలో ఉందన్న సీఎం కేసీఆర్
  • స్టూడెంట్లు, పేరెంట్స్‌‌లో భయం
  • కేజీబీవీలు, గురుకులాల్లో అటెండెన్స్ అంతంతే

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో మళ్లీ కరోనా టెన్షన్ మొదలైంది. పెరుగుతున్న కేసులతో స్కూళ్లు, హాస్టళ్లు, గురుకులాల్లో స్టూడెంట్స్​ భయం భయంగానే ఉంటున్నారు. పిల్లలకు ఏం జరుగుతుందోనని పేరెంట్స్‌‌, స్టాఫ్ ఆందోళన చెందుతున్నారు. మరోపక్క కేజీబీవీలు, సొసైటీ గురుకులాల్లో స్టూడెంట్ల అటెండెన్స్ 40శాతానికి దాటడం లేదు. కరోనా కేసులు పెరుగుతుండటంతో స్కూళ్లకు మళ్లీ సెలవులు ఇచ్చే విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని సీఎం కేసీఆర్ ప్రకటించారు. రెండు, మూడు రోజుల్లో 6, 7, 8 తరగతులకు ఫిజికల్ క్లాసులు బంద్ చేసే అవకాశం కనిపిస్తోంది.
 

తక్కువగా అటెండెన్స్‌‌
కరోనా కారణంగా నిరుడు బంద్ అయిన స్కూళ్లను ఈ ఏడాది ఫిబ్రవరిలోనే మళ్లీ తెరిచారు. ఫిబ్రవరి 1 నుంచి 9, 10 క్లాసులు, నెల చివరిలో 6, 7, 8 తరగతులకు ఫిజికల్ క్లాసులు స్టార్ట్ అయ్యాయి. రాష్ట్రంలో 18,487 హైస్కూల్స్ ఉండగా, వాటిలో 14,34,962 మంది 6 నుంచి 8వ క్లాసు వరకు చదువుతున్నారు. వీరిలో 6,94,679 మంది (48 శాతం) మాత్రమే స్కూళ్లకు అటెండ్ అవుతున్నారు. 9,10 క్లాసుల్లో 9,46,713 మందికి ఉండగా, 7,37,446 మంది బడికెళ్తున్నారు. అయితే లోకల్ బాడీ, ప్రైవేటు స్కూళ్లలో అటెండెన్స్ కొంత మెరుగ్గా ఉన్నా, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు (కేజీబీవీ), తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ సొసైటీల్లో (సొసైటీ గురుకులాలు) మాత్రం తక్కువగానే ఉంది. మొత్తం 475 కేజీబీవీలుండగా, 49,915 మంది 6 నుంచి 8 క్లాస్ వరకు చదువుతున్నారు. వీరిలో బుధవారం నాటికి 38శాతం మాత్రమే హాజరయ్యారు. సొసైటీ గురుకులాల్లోనూ ఇదే ట్రెండ్ కొనసాగుతోంది. మొత్తం 37 గురుకులాల్లో 8216 మందికి గాను 2711 మంది (33 శాతం) మాత్రమే అటెండ్ అయ్యారు. 9,10 క్లాసుల్లో మాత్రం 70శాతం వరకు అటెండెన్స్ ఉంది. 

 

ఏ ఒక్కరికి పాజిటివ్‌‌ వచ్చినా బంద్
స్కూల్, హాస్టల్స్‌‌లో ఏ ఒక్కరికి కరోనా పాజిటివ్‌‌ వచ్చినా మొత్తం స్టూడెంట్లు, టీచర్లు, స్టాఫ్ ఐసోలేషన్‌‌లోకి వెళ్లడం తప్పనిసరి. దీంతో మరో దారి లేక ఆ స్కూళ్లు కొన్నాళ్ల పాటు పూర్తిగా క్లోజ్ చేయాల్సి వస్తోంది. మరోపక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా శానిటైజేషన్‌‌కు నిధులు ఇవ్వకపోవడంతో ఈ సమస్యలు వస్తున్నాయని అధికారులే చెబుతున్నారు.

 

బంద్ చేసే యోచనలో సర్కార్
కరోనా కేసులు పెరుగుతుండటంతో మళ్లీ స్కూళ్లు బంద్ చేసి, సెలవులు ఇచ్చే యోచనలో సర్కార్ ఉంది. దీనిపై ప్రభుత్వం పరిశీలిస్తోందని అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రకటన నేపథ్యంలో ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రస్తుతం 6 నుంచి 8 వరకు క్లాసులను మాత్రమే బంద్ చేయాలా?  టెన్త్ వరకూ బంద్ చేయాలా అనే దానిపై రెండు, మూడు రోజుల్లో నిర్ణయం తీసుకునే అవకాశముంది. బుధవారం స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌‌మెంట్‌‌ నుంచి స్టూడెంట్ల అడ్మిషన్‌‌ ఎన్‌‌రోల్‌‌మెంట్‌‌ వివరాలను సీఎంవో అధికారులు సేకరించారు. అయితే బోర్డు ఎగ్జామ్స్ నేపథ్యంలో టెన్త్ స్టూడెంట్లకు క్లాసులు పెట్టే ఆలోచన ఉన్నట్లు తెలుస్తోంది. ఇంటర్, డిగ్రీ క్లాసులపైనా ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశముంది.