V6 News

హైదరాబాద్ పబ్లిక్ కు గుడ్ న్యూస్... జూన్ 2 నుంచి MMTS రైళ్లలో ప్రయాణం ఉచితం...!

హైదరాబాద్ పబ్లిక్ కు గుడ్ న్యూస్... జూన్ 2 నుంచి MMTS రైళ్లలో ప్రయాణం ఉచితం...!

హైదరాబాద్ వాసులకు అదిరిపోయే గుడ్ న్యూస్ ఇది... సిటీలో మిడిల్ క్లాస్ జనాలకు రవాణా భారాన్ని తగ్గించి, ట్రాఫిక్ సమస్యకు చెక్ చెప్పే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం. MMTS రైళ్లలో అందరికీ ఉచిత ప్రయాణ సౌకర్యం కలిపించాలని నిర్ణయించింది రేవంత్ సర్కార్. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2 నుంచి ఈ పథకాన్ని అమలు చేసేందుకు సిద్ధమవుతోంది ప్రభుత్వం. ఏడాది పాటు ప్రయోగాత్మకంగా అమలు చేయాలని నిర్ణయించింది ప్రభుత్వం.

MMTS రైళ్లలో ప్రయాణికుల సంఖ్య ఆధారంగా ఏడాదికి దక్షిణ మధ్య రైల్వేకు రూ. 10 కోట్ల ఆదాయం వస్తున్నట్లు సమాచారం. ఉచిత ప్రయాణం అమల్లోకి వచ్చాక పెరిగే ప్రయాణికుల సంఖ్యతో సంబంధం లేకుండా ప్రస్తుతం వస్తున్న ఆదాయాన్ని ప్రభుత్వమే ఇవ్వడానికి సిద్దమైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం సంజయ్ కుమార్ శ్రీవాస్తవతో తెలంగాణ సీఎస్ రామకృష్ణారావు ఇటీవలే సమావేశమై చర్చినట్లు సమాచారం. 

MMTS రైళ్లలో అందరికీ ఉచిత ప్రయాణం అమలు చేయాలని... సీఎం రేవంత్ సూచనలు లేఖలో ప్రస్తావిస్తూ జీఎంకు లేఖ రాశారు మెట్రోపాలిటన్ ఏరియా, పురపాలక అభివృద్ధి శాఖ స్పెషల్ సీఎస్ జయేశ్ రంజన్. జూన్ 2 నుంచి ఏడాది పాటు ఈ పథకాన్ని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోందని లేఖలో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి ముసాయిదా ఏంఓయూను పంపాలని ప్రభుత్వాన్ని కోరింది రైల్వే శాఖ.

రద్దీ ఎక్కువగా ఉండే సమయాల్లో ట్రిప్పుల సంఖ్య పెంచాలని.. సమయపాలన మెరుగుపరచాలని.. స్టేషన్లలో సౌకర్యాలు మెరుగుపరచాలని లేఖలో పేర్కొన్నారు జయేశ్ రంజన్. ప్రయాణికులు ఇంటి నుంచి స్టేషన్ కు, స్టేషన్ నుంచి ఇంటికి వెళ్లేందుకు వీలుగా ఆర్టీసీ షటిల్ బస్సులు నడుపుతామని.. వాటికీ రైల్వే స్టేషన్ ప్రాంగణాల్లో స్థలం కేటాయించాలని కోరారు.

ఏయే సమయాల్లో ఎన్ని రైళ్లు నడపాలన్నది దక్షిణ మధ్య రైల్వే నిర్ణయిస్తుందని.. రైల్వే బోర్డు నిబంధనల ప్రకారం స్టేషన్లలో సౌకర్యాలు కల్పిస్తామని తెలిపింది రైల్వే శాఖ.