
- రూ.9 కోట్లు మంజూరు చేసిన ఆర్థికశాఖ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర పశుసంవర్ధక శాఖలో విధులు నిర్వహిస్తున్న 1,484 మంది గోపాలమిత్రలకు ఆరు నెలల పెండింగ్ వేతనాలు రూ. 9 కోట్లను ఆర్థిక శాఖ విడుదల చేసింది. శుక్రవారం ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా విడుదల చేశారు. రాష్ట్ర గోపాలమిత్ర సర్వీస్ అసోసియేషన్ అధ్యక్షుడు చెరుకు శ్రీనివాస్ ఈ సందర్భంగా ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. వేతనాల విడుదలకు ప్రత్యేక సహకారం అందించిన సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టికి కృతజ్ఞతలు తెలిపారు.
గోపాలమిత్రలు గ్రామీణ ప్రాంతాల్లో పాడి రైతులకు మెరుగైన సేవలు అందించడంలో, వ్యాక్సినేషన్ వంటి కీలక విధుల్లో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. వేతనాల విడుదలతో వారి ఆర్థిక ఇబ్బందులు తీరి, సేవలు మరింత సమర్థవంతంగా అందించేందుకు ఊతం లభిస్తుందని అసోసియేషన్ ఆశాభావం వ్యక్తం చేసింది. సహకారం అందించిన పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ చిన్నారెడ్డికి అసోసియేషన్ ధన్యవాదాలు తెలిపింది.