జనం వద్దకే ఆఫీసర్లు..డిసెంబర్ 28 నుంచి గ్రామ సభలు

జనం వద్దకే  ఆఫీసర్లు..డిసెంబర్ 28 నుంచి గ్రామ సభలు
  • ఆరు గ్యారంటీలకు అప్లికేషన్ల స్వీకరణ: సీఎం రేవంత్
  • ఈ నెల 26 కల్లా ఊర్లకు దరఖాస్తు ఫారాలు.. వాటిని ప్రజలు నింపి గ్రామ సభల్లో ఇవ్వాలి
  • రోజూ 18 గంటలు పని చేయడం ఇబ్బందిగా ఉంటే ఆఫీసర్లు ట్రాన్స్​ఫర్​ అడగొచ్చు
  • ప్రజలతో శభాష్​ అనిపించుకునే ఉద్యోగులకే మాది ఫ్రెండ్లీ గవర్నమెంట్​
  • నకిలీ విత్తనాలు టెర్రరిజం కంటే డేంజర్.. ఆ కంపెనీల ఆస్తులు అటాచ్​ చేయండి
  • డ్రగ్స్, గంజాయి​ దందాలో ఎంతటివాళ్లున్నా వదలొద్దు.. పోలీసులకు ఫుల్​ పవర్స్
  • సన్​​ బర్న్​ పార్టీలపై కఠినంగా వ్యవహరించండి
  • జనం సమస్యల పరిష్కారానికే మనం ఉన్నామని గుర్తుంచుకోండి
  • స్వేచ్ఛను హరిస్తే పబ్లిక్​ రియాక్షన్​ చాలా వైల్డ్​గా ఉంటది.. కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం

హైదరాబాద్, వెలుగు : ఆరు గ్యారంటీలకు అర్హులను ఎంపిక చేసేందుకు ఈ నెల 28 నుంచి దరఖాస్తులు తీసుకోనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. రాష్ట్రంలోని ప్రతి ఊరిలో గ్రామ సభ నిర్వహించి.. అధికారులు అప్లికేషన్లు తీసుకుంటారని ఆయన స్పష్టం చేశారు. ‘‘రాష్ట్రవ్యాప్తంగా ప్రజాపాలన  దిశగా, ప్రజల సమస్యలు పరిష్కరించే దిశగా ఈ నెల  28 నుంచి వచ్చే నెల 6 వరకు (సెలవు రోజులు పోను.. ఎనిమిది పని దినాల్లో) ప్రజా పాలన పేరుతో  గ్రామ సభలు జరుగుతాయి. దీనికి సంపూర్ణమైన సహకారం కలెక్టర్లు, పోలీసు అధికారుల నుంచి ఉండాలి” అని ఆయన అన్నారు. ప్రజలకు ముందస్తుగా అప్లికేషన్లను అందుబాటులో ఉంచాలని, వాటిని నింపి గ్రామ సభలకు తీసుకువచ్చేలా చూడాలని అధికారులను ఆదేశించారు. దీంతో గ్రామసభలు సాఫీగా సాగుతాయని అన్నారు. ప్రజల సమస్యలను అర్థం చేసుకొని పరిష్కరించాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులు, అధికారులపై ఉందని సూచించారు. స్వేచ్ఛను హరించాలని ఎవరు చూసినా ప్రజల నుంచి రియాక్షన్​ చాలా వైల్డ్​గా ఉంటుందని, వారి హక్కులను కాపాడాలని ఆయన అన్నారు. ఆదివారం సెక్రటేరియెట్​లో కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులతో సీఎం రేవంత్​రెడ్డి సమావేశమయ్యారు. ఆరు గ్యారంటీల అమలుకు ప్రభుత్వం తీసుకున్న కార్యాచరణ, డ్రగ్స్ నిర్మూలన, నకిలీ విత్తనాల కట్టడి, ప్రభుత్వ పాలసీల అమలుపై దిశానిర్దేశం చేశారు. ప్రతి గ్రామంలో రెవెన్యూ డిపార్ట్​మెంట్ గ్రామ సభలను నిర్వహిస్తుందని, పోలీసు డిపార్ట్ మెంట్ వీటిని స్ట్రీమ్​ లైన్ చేయాలని సీఎం సూచించారు. ఎమ్మార్వో ఆధ్వర్యంలో ఒక టీమ్​, ఎంపీడీవో ఆధ్వర్యంలో ఇంకో టీమ్​ ఉంటాయని, ఈ రెండు టీంలు రోజూ రెండు గ్రామాల్లో రెండు సభలను  నిర్వహించాల్సి ఉంటుందని ఆదేశించారు. ఈ సభల్లో ప్రజల నుంచి అప్లికేషన్లు తీసుకోవాలన్నారు. 

డిజిటలైజ్​ చేసి ప్రభుత్వానికి పంపాలి

గ్రామసభల్లో అప్లికేషన్లు అందిస్తే గందరగోళం ఏర్పడే పరిస్థితి ఉందని, అందుకే ఈ నెల 26 కల్లా గ్రామాలకు అప్లికేషన్లు పంపించనున్నట్లు సీఎం  రేవంత్​ తెలిపారు. గ్రామ కార్యదర్శులు, ఇతర వ్యవస్థలతో ముందుగానే అప్లికేషన్లను ప్రజలకు అందుబాటులో ఉంచాలని, దీంతో ప్రజలు ముందస్తుగా దరఖాస్తులు నింపి సభలకు తీసుకుని వస్తారని, ఆ రకంగానే ముందుకు వెళ్లాలని అధికారులను ఆయన ఆదేశించారు. ప్రాక్టికల్ గా అధికారులు గ్రామ సభల్లో పకడ్బందీగా సమాచారాన్ని సేకరించి, డిజిటలైజ్ చేసి ప్రభుత్వానికి పంపిస్తే.. ప్రభుత్వం వాటిని స్క్రూటిని చేసి అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని  అన్నారు. ప్రతి నాలుగు నెలలకు గ్రామ సభలను, వ్యవస్థను సమీక్షించుకుందామని సీఎం చెప్పారు. 

భూకబ్జాలు.. డ్రగ్స్ మాట వినిపించొద్దు

‘‘పోలీస్ శాఖకు, అధికారులకు నేను ఇక్కడి నుంచే ఆదేశాలు ఇస్తున్న. భూకబ్జాలు, డ్రగ్స్ వంటివి మీరు ఉక్కు పాదంతో అణచివేయాల్సిన అవసరం ఉంది” అని సీఎం రేవంత్​రెడ్డి ఆదేశించారు. ‘‘గంజాయి అనే పదం ఈ రాష్ట్రంలో వినిపించకూడదు.  ఉద్యమ నేపథ్యం ఉన్న తెలంగాణలో గంజాయి లాంటివి, డ్రగ్స్ లాంటివి ఇక్కడొచ్చి ఇక్కడి యువతను ఆక్రమించుకుంటున్నయ్​.  ఇది అత్యంత ప్రమాదకరం.  రాష్ట్రంలోని చిన్నచిన్న పట్టణాల్లో కూడా ఎక్కడ పడితే అక్కడ డ్రగ్స్, గంజాయి దొరుకుతున్నది. జూనియర్ కాలేజీల్లో, స్కూళ్లలో కూడా మత్తు పదార్థాలు అందుబాటులోకి వచ్చినయ్.. ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి..  ఇట్లాంటి వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వం క్షమించదు.  మీరు గతంలో తీవ్రవాదులను కూకటి వేళ్లతో పెకిలించడానికి ఏ రకంగా చర్యలు తీసుకున్నారో.. ఇప్పుడు  డ్రగ్ మహమ్మారిని కూడా నిర్మూలించేందుకు అట్లనే పనిచేయాలి” అని ఆయన అధికారులకు సూచించారు. ‘‘అడిషనల్ డీజీ స్థాయి అధికారులను నియమించాం. కింది స్థాయి వ్యవస్థలను కూడా బలోపేతం చేసే అధికారులను నియమిస్తాం.  నార్కోటిక్ బ్యూరో అనేది అత్యంత కీలకమైన పాత్ర పోషించాల్సిన అవసరం ఉన్నది. మన కండ్ల ముందు కుప్పకూలిపోయిన పంజాబ్ రాష్ట్రం కనిపిస్తున్నది. తెలంగాణ.. పంజాబ్ రాష్ట్రం వంటి పరిణామాల వైపు వేగంగా ప్రయణిస్తున్నది. డ్రగ్స్​, గంజాయిని నిషేధించి నిర్మూలించాల్సిన బాధ్యత పోలీస్ అధికారులది. ఎక్కడ ఏమి జరుగుతున్నదో పోలీస్ అధికారుల వద్ద సమాచారం ఉందో లేదో కానీ, స్వయంగా నా దగ్గర కొంత సమాచారం ఉంది. గంజాయి మన దగ్గర పండించేది చాలా తక్కువగా ఉండొచ్చు..  కానీ వినియోగించేది ఎక్కువైంది.  లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడం ఒక్కటే కాదు మీరు చేసే పని.. ప్రతి జిల్లా ఎస్పీ పట్టాణాలు, మండలాల్లో గంజాయి, డ్రగ్స్​పై నిఘా పెట్టాలి. ఇందుకోసం  ప్రత్యేకంగా అధికారులను నియమించుకోవాలి. సమాచారాన్ని సేకరించాలి. డ్రగ్స్​, గంజాయి దందాలో ఎవ్వరినీ వదలడానికి వీల్లేదు” అని సీఎం రేవంత్​రెడ్డి తేల్చిచెప్పారు. మతాల మధ్య, కులాల మధ్య వైషమ్యాలు పెంచే సోషల్ మీడియాలో కొందరు పోస్టులు చేస్తుంటారని, వారిపై కూడా కన్నేసి ఉంచాలని సూచించారు. ఇలా చేసేవారి సమాచారం సేకరించి, వారందరినీ ఒక లైన్ లో పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అన్నారు. 

ప్రజలతో ఉంటేనే ఉద్యోగులకు ఫ్రెండ్లీ గవర్నమెంట్

‘‘ఇక్కడ ఉన్న మా ఉన్నతాధికారులకు, మా జిల్లా కలెక్టర్లకు, మా ఎస్పీలకు, మా అడిషనల్ కలెక్టర్లకు  నా సూచన ఒక్కటే..  ఈ ప్రభుత్వం అనేది ఫ్రెండ్లీ గవర్నమెంట్.  ప్రెండ్లీ గవర్నమెంట్ అంటే అధికారులు ప్రజల చేత శభాష్ అనిపించుకున్నంత వరకే” అని సీఎం రేవంత్​రెడ్డి చెప్పారు. ‘‘ఈ ప్రభుత్వం మీతో ఫ్రెండ్లీగా ఉంటుంది. మీ పరిపాలనలో నిర్లక్ష్యం వహించినా.. లేదా ఉద్దేశపూర్వకంగా రకరకాల నిర్ణయాలు తీసుకున్నప్పుడు తప్పకుండా ఈ ప్రభుత్వం వాటన్నింటినీ సమీక్షిస్తుంది. అఖిల భారత సర్వీసెస్  అధికారుల గురించి చర్చించాల్సి వచ్చినప్పుడు ఎస్.ఆర్. శంకర్​ను గుర్తు చేసుకోవాలి. ఆయన జీవిత కాలం  సచివాలయానికి ఉదయం 9.30 గంటలకు నడుచుకుంటూ వచ్చి రాత్రి వరకు ఆయన దగ్గరకు వచ్చిన ప్రతి ఫైల్​ను క్షుణ్ణంగా పరిశీలించి, విధానపరమైన నిర్ణయాలు తీసుకునే వారు. ఆనాటి కేంద్ర ప్రభుత్వం ఆయనసేవలను గుర్తించి  పద్మభూషణ్ అవార్డు ఇస్తే కూడా సున్నితంగా తిరస్కరించారు. ఆయన ఆదర్శవంతమైన అధికారిగా చరిత్రలో నిలిచిపోయారు” అని సీఎం  గుర్తుచేశారు.  

సన్​బర్న్​ ఈవెంట్లపై చర్యలు 

‘‘సన్ బర్న్ పార్టీకి సంబంధించి డిజిటల్ మార్గంలో టికెట్లు అమ్ముతున్నారు. బుక్ మై షో లాంటి కొన్నింటిని నేను స్వయంగా గమనించిన.. వాళ్లు ప్రభుత్వ అనుమతి పొందలేదు.. అనుమతి పొందకుండా డిసెంబర్​ 31 రాత్రి సన్ బర్న్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పార్టీకి సంబంధించి టికెట్లు విక్రయిస్తున్నారు.  దీనిపై సైబరాబాద్ కమిషనర్ చర్యలు తీసుకోవాలి” అని సీఎం రేవంత్​రెడ్డి ఆదేశించారు. బుక్ మై షో  ఫ్లాట్ ఫామ్​పై ఎంక్వైరీ చేయాలని, అనుమతి లేకుండా ఇలాంటి పార్టీలు చేసుకోవడానికి వీల్లేదని తేల్చిచెప్పారు. ‘‘ఇలాంటి ఈవెంట్స్ ను ఆదాయ వనరుగా చూడొద్దు. ఇవి యువతను పెడద్రోవ పట్టిస్తున్నయ్​. ఈ ఈవెంట్స్​ను  జల్లెడ పట్టండి. హుక్కా సెంటర్స్, పబ్స్  లో జరిగే వ్యవహారాలు గానీ, ఇట్లాంటి సన్ బర్న్ పార్టీలను గానీ పలు రాష్ట్రాలు నిషేధించాయి. మనం కూడా చాలా కఠినంగా వ్యవహరించాలి. ఎంత పెద్దవాళ్లయినా, వాళ్ల బ్యాక్ గ్రౌండ్ ఏమున్నా ఎవ్వరినీ ఉపేక్షించొద్దు.  ఎవ్వరినీ వదిలిపెట్టొద్దు. ఈ విషయంలో  సంపూర్ణంగా పోలీస్ అధికారులకు పవర్స్​ ఇస్తున్న” అని చెప్పారు. 

నకిలీ విత్తనాలు అమ్మే కంపెనీల ఆస్తుల అటాచ్​

‘‘నకిలీ విత్తనాలు.. ఇది టెర్రరిజం కంటే ప్రమాదకరం. ఆరుగాలం కష్టపడే రైతుల ఆత్మహత్యలకు నకిలీ విత్తనాలు కారణమవుతున్నాయి. నకిలీ విత్తనాలు అమ్మే కంపెనీలపై ఉక్కుపాదం మోపాలి.  కంపెనీ ఓనర్లను బాధ్యులను చేసినప్పుడే నకిలీ విత్తనాలకు అడ్డుకట్టపడుతుంది.  రైతులకు నష్ట పరిహారం ఇవ్వడానికి నకిలీ విత్తన కంపెనీల ఆస్తులను రెవెన్యూ రికవరీ యాక్టు కింద జప్తు చేయాలి. అటాచ్​ చేయాలి. చట్టంలో సీజ్ చేసే అవకాశం లేకుంటే చట్టాన్ని సవరించుకోవాల్సిన అవసరం ఉంది” అని సీఎం రేవంత్​ అన్నారు. 

సమన్వయంతో సాగాలి

ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు, తీసుకున్న నిర్ణయాలు అమలు జరగాలంటే..  అధికారులు, ప్రజాప్రతినిధులు సేవకుల్లాగా పనిచేయాలని, జోడెద్దుల్లా ముందుకు సాగాలని సీఎం రేవంత్​రెడ్డి సూచించారు. ‘‘ప్రజా ప్రతినిధులుగా మేము.. ప్రభుత్వ పథకాలు ముందు తీసుకెళ్లే వాళ్లుగా మీరు సమన్వయంతో ముందుకు సాగాలి. అప్పుడే అనుకున్న లక్ష్యం దిశగా  ప్రయాణం చేయడానికి అవకాశం ఉంటుంది” అని అధికారులతో ఆయన అన్నారు.  ‘‘సచివాలయంలో ఏ నిర్ణయం జరిగినా క్షేత్రస్థాయిలో అమలు చేయాల్సిన బాధ్యత ఒక పక్కన కలెక్టర్లది, ఇంకో పక్కన పోలీస్ అధికారులది. ప్రత్యక్షంగా ప్రజలతో సంబంధాలు ఉండేవాళ్లు జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎస్పీలు,  పోలీస్ కమిషనర్లు. చివరి వరుసలో ఉన్నవాళ్లకు కూడా  సంక్షేమ పథకాలు చేరాలి. వారికి చేరవేయాల్సిన వారధి మీరే.  మీమీదనే మా ప్రభుత్వం పూర్తి స్థాయిలో బాధ్యత  పెడ్తున్నది” అని కలెక్టర్లకు, ఎస్పీలకు సీఎం సూచించారు.  ‘‘మానవీయ కోణంతో ప్రజలు లెవనెత్తిన అంశాలను అర్థం చేసుకోలేకపోతే మనం ఏ సమస్యకు కూడా పరిష్కారం చూపించలేం.  మనం ఈ కుర్చీలో కూర్చున్నది ప్రజల సమస్యలను పరిష్కంచడానికే అని గుర్తుంచుకోవాలి” అని చెప్పారు. ప్రజల మనసులను గెలుచుకోవాలని, జవాబుదారీతనంతో వ్యవహరించాలని అన్నారు.  

ఇబ్బంది అనుకుంటే చెప్పండి.. మార్చేస్తం

ఆరు గ్యారంటీలను ప్రజలకు చేరవేయడానికి అధికారులే ప్రభుత్వ సాధకులని సీఎం రేవంత్​రెడ్డి పేర్కొన్నారు. వీటిని అమలు పరిచే క్రమంలో అధికారులకు ఇబ్బంది అనిపిస్తే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి గానీ, పోలీసు డిపార్ట్ మెంట్ లో డీజీపీకి  గానీ తెలియజేయాలని, ఈ టాస్క్​లో పనిచేయడానికి ఇబ్బందిగా ఉంటే ఇతర ప్రాంతానికి బదిలీ చేయడానికి, బాధ్యతల నుంచి మార్చడానికి ప్రభుత్వానికి ఎటువంటి అభ్యంతరం లేదని  ఆయన తేల్చిచెప్పారు. ‘‘ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వ ఆదేశాలను బాధ్యతగా నిర్వర్తించాల్సిందే. 18 గంటలు పనిచేయాల్సి వచ్చినప్పుడు..  మానసికంగా, శారీరకంగా ఇబ్బంది ఎందుకు అనిపిస్తే మాకు చెప్పండి. కలెక్టర్లుగా , ఎస్పీలుగా అక్కడి నుంచి మార్చి వేరోచోటికి బదిలి చేస్తం. 18 గంటలు పనిచేయాల్సిన అవసరం లేని ప్రాంతానికి బదిలీ చేయడానికి ఎటువంటి అభ్యంతరం లేదు” అని సీఎం స్పష్టం చేశారు. ప్రజలతో మమేకం కావడానికి ఇది మంచి అవకాశం అని, గ్రామ సభల ద్వారా జనంలోకి వెళ్లాలని అధికారులకు సూచించారు. ప్రజలకు మరింత బెటర్​గా పాలన అందించేందుకు అధికారులు సూచనలు చేస్తే తప్పకుండా  స్వీకరిస్తామని చెప్పారు.  

ఫ్రెండ్లీ పోలీసింగ్  అనేది క్రిమినల్స్​కు  కాదు

ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది పౌరులతో ఉండాలని, క్రిమినల్స్ తో కాదని సీఎం రేవంత్​ అన్నారు. ‘‘ఫ్రెండ్లీ పోలీసింగ్, ప్రెండ్లీ అప్రోచ్ అనేది క్రిమినల్స్ తో కాదు. గంజాయి, హెరాయిన్, కొకైన్ వాడే వాళ్లతో ఫ్రెండ్లీగా ఉండాలని కాదు.  నేరాలు, హత్యలు చేసిన వాళ్లు పోలీస్ స్టేషన్ కు వస్తే.. వాళ్లను ఫ్రెండ్స్ లా ట్రీట్ చేయడం కాదు ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే. సామాన్యమైన పౌరుడు పోలీస్ స్టేషన్ కు వస్తే ఆ వ్యక్తిని  కూర్చోబెట్టి మర్యాదగా వాళ్ల సమస్యను అడిగి తెలుసుకోవాలి. అది ఫ్రెండ్లీ పోలీసింగ్​ అంట.  ఫ్రెండ్లీ పోలీసింగ్ ను మిస్ యూస్ చేసినా అబ్యూస్ చేసినా.. ప్రభుత్వం ఉపేక్షించదు” అని  తేల్చిచెప్పారు. 

స్వేచ్ఛను హరిస్తే.. రియాక్షన్​ చాలా వైల్డ్​గా ఉంటది

దేశంలో ఉండే మిగతా రాష్ట్రాలకంటే  తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ ప్రజలకు ప్రత్యేకత ఉంది. ఇక్కడి డీఎన్ఏ దేన్నైనా సహిస్తుంది.. కానీ, స్వేచ్ఛను హరించాలన్న ఆలోచన ఉంటే.. సామాజిక న్యాయాన్ని దెబ్బతీయాలనుకున్నా.. ఏ మాత్రం సహించదు. ప్రజల రియాక్షన్  చాలా వైల్డ్ గా ఉంటది. తెలంగాణ ప్రజల చైతన్యం, శక్తి ఎంతటి వారినైనా ఇంటికి పంపించేస్తది. ఈ విషయాన్ని ప్రతి అధికారి తెలుసుకొని ప్రజల్లోకి వెళ్లాలి. ప్రజల సమస్యల పరిష్కారానికే మనం ఉన్నామని గుర్తంచుకొని పనిచేయాలి.
- సీఎం రేవంత్​రెడ్డి

అభివృద్ధి అంటే రంగుల గోడలు కాదు

అభివృద్ధి చెందడమంటే అద్దాల మేడలు, రంగుల గోడలు కాదు. పౌరుల నైతికాభివృద్ధే నిజమైన దేశాభివృద్ది. అద్దాల మేడలు కట్టో.. రంగుల గోడలు చూపించో.. అభివృద్ధి జరిగిందని ఎవరైనా భ్రమపడితే... దాంతో పేదలకు ఎలాంటి ప్రయోజనం ఉండదు. చివరి వరుసలో ఉన్నవాళ్లకు కూడా సంక్షేమ పథకాలు అందినప్పుడే రాష్ట్రంగానీ, దేశంగానీ అభివృద్ధి చెందినట్లు.
- సీఎం రేవంత్​రెడ్డి