పోలవరం–నల్లమలసాగర్‌‌ ప్రాజెక్టుపై సుప్రీంకు.. పిటిషన్ దాఖలు చేసే యోచనలో తెలంగాణ

పోలవరం–నల్లమలసాగర్‌‌ ప్రాజెక్టుపై సుప్రీంకు.. పిటిషన్ దాఖలు చేసే యోచనలో తెలంగాణ
  • ఢిల్లీలో న్యాయనిపుణులతో ఇరిగేషన్ అధికారుల చర్చ 
  • సీనియర్ అడ్వకేట్ అభిషేక్ మనుసింఘ్వీతో మాట్లాడిన ఉత్తమ్
  • ఇయ్యాల ఆయనతో భేటీ అయ్యే అవకాశం

న్యూఢిల్లీ, వెలుగు: గోదావరి జలాలను అక్రమంగా తరలించేందుకు ఏపీ చేపడుతున్న పోలవరం–నల్లమలసాగర్‌‌ ప్రాజెక్టుపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలని తెలంగాణ యోచిస్తున్నది. ఈ మేరకు పిటిషన్ దాఖలు చేయాలని సమాలోచనలు చేస్తున్నది. ఇందులో భాగంగా ఆదివారం ఢిల్లీల్లోని శబరి బ్లాక్‌లో న్యాయ నిపుణులతో ఇరిగేషన్ శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా, ఈఎన్సీ అంజద్ హుస్సేన్, మరో 8 మంది అధికారులు చర్చలు జరిపారు. అలాగే సుప్రీంకోర్టు సీనియర్ అడ్వొకేట్, రాజ్యసభ సభ్యుడు అభిషేక్ మనుసింఘ్వీతో ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రత్యేకంగా మాట్లాడారు. ఆదివారం ఢిల్లీ పర్యటనకు రానున్న మంత్రి.. అభిషేక్ మనుసింఘ్వీతో సమావేశం కానున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ భేటీ తర్వాత నల్లమలసాగర్‌‌పై సుప్రీంలో పిటిషన్ దాఖలు చేయనున్నారు.

కాగా, ఏపీ సర్కార్ గతంలో పోలవరం–బనకచర్ల లింక్ ప్రాజెక్టు ప్రీ ఫీజిబిలిటి రిపోర్టును కేంద్ర జలశక్తి శాఖకు పంపింది. దీనిపై కృష్ణా, గోదావరి బోర్డులు, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అభ్యంతరం తెలిపాయి. ఈ ప్రాజెక్టును ముందు నుంచీ తెలంగాణ వ్యతిరేకిస్తూ వస్తున్నది. 

సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ పలుమార్లు జలశక్తి శాఖకు, సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ)కు ఫిర్యాదు చేసింది. దీంతో ఈ ప్రాజెక్టు డీపీఆర్‌‌కు టెండర్లు పిలిచిన ఏపీ ప్రభుత్వం.. వాటిని రద్దు చేసింది. అయితే ప్రస్తుతం పోలవరం–బనకచర్ల లింక్ ప్రాజెక్ట్ పేరు మార్చి కొత్తగా పోలవరం– నల్లమలసాగర్‌‌గా తెరపైకి తెచ్చింది. దీంతో దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలని తెలంగాణ నిర్ణయించింది. 

జలశక్తి శాఖ అధికారులతో భేటీ..  
కేంద్ర జలశక్తి, సీడబ్ల్యూసీ ఉన్నతాధికారులతో శనివారం రాష్ట్ర ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులు భేటీ అయ్యారు. ఢిల్లీలోని శ్రమశక్తి భవన్‌లో జరిగిన ఈ సమావేశంలో జలశక్తి శాఖ కార్యదర్శి కాంతారావు, సీడబ్ల్యూసీ చైర్మన్ అనుపమ్ ప్రసాద్, రాష్ట్ర ఇరిగేషన్ శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా, ఈఎన్సీ అంజద్ హుస్సేన్, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీ నిర్మించ తలపెట్టిన పోలవరం–నల్లమలసాగర్‌‌తో పాటు ఇతర జల వివాదాలను తక్షణమే పరిష్కరించాలని రాష్ట్ర అధికారులు కోరారు.