నీటి వృథాకు చెక్ డ్యాం!

నీటి వృథాకు చెక్ డ్యాం!
  • మండలానికి రెండు చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 1,128 నిర్మాణాలకు ప్రభుత్వం ప్రణాళిక 
  • ఉపాధి నిధులతో పనులు చేపట్టేలా ప్లాన్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం భూగర్భజల వనరులను ఒడిసిపట్టేందుకు పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నది. వాగులు, వంకలు, కొండలు, కోనల నుంచి జలువారుతూ వృథాగా పోతున్న నీటికి అడ్డుకట్ట వేసేందుకు చెక్​ డ్యాంలను నిర్మించనుంది. ఉపాధి హామీ నిధులతో రాష్ట్రవ్యాప్తంగా 1,128 చెక్​డ్యాంలు నిర్మించేలా ప్రణాళికలు రూపొందించింది. 

ఒక్కో చెక్​డ్యాం కోసం రూ.5 లక్షల వరకు కేటాయించనున్నది. మండలానికి రెండు చొప్పున వీటిని నిర్మించేలా కసరత్తు చేస్తున్నది. చెక్ డ్యాంల నిర్మాణంతో  వర్షపు నీటిని నిల్వ చేయడంతోపాటు భూగర్భజల  స్థాయులను పెంచి గ్రామీణ ప్రాంతాల్లో సాగునీటి అవసరాలను తీర్చాలన్నది ప్రభుత్వ లక్ష్యం. సాగునీటి లభ్యత పెరిగితే రైతులు ఏడాది పొడవునా రెండు పంటలు పండించే అవకాశం ఉంటుందని ప్రభుత్వ భావిస్తోంది. 

జల వనరులను కాపాడుకోవటం ద్వారా నీటి కొరతను తగ్గించి, పర్యావరణ సమతుల్యతను కాపాడవచ్చని చెప్పారు. చెక్​డ్యాంలు దీర్ఘకాలంలో నీటి వనరుల సంరక్షణకు దోహదపడతాయి. ఉపాధి హామీ పథకంలో వీటి నిర్మాణాలు చేపట్టడం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో కూలీలకు ఉపాధి కలుగుతుంది. ఉపాధి హామీ నిధులతో మండలానికి రెండు చొప్పున నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించింది.  మండలంలో ఎక్కడైతే అవసరమో గుర్తించి అక్కడ నిర్మించేలా చర్యలు చేపడుతున్నారు. 

అయితే, గతంలో చెక్ డ్యాంల నిర్మాణంలో పర్యవేక్షణ లోపంతో అక్రమాలు జరిగాయనే ఫిర్యాదులు అందడంతో విజిలెన్స్  ఎంక్వయిరీ చేశారు. ఈసారి చెక్ డ్యాంల నిర్మాణంలో అక్రమాలు, అవకతవకలకు తావు లేకుండా పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నారు. ఉపాధి పథకంలో ప్రజలకు ఉపయోగపడే, వ్యవసాయ అనుబంధ పనులు చేపడుతున్నామని ఈజీఎస్​ జేసీ శశికుమార్  పేర్కొన్నారు.