- సచివాలయంలో హైలెవల్ మీటింగ్
- హాజరు కానున్న 3 కార్పొరేషన్ల కమిషనర్లు
- రూల్స్బ్రేక్చేస్తూ దండుకుంటున్న ఏజెన్సీలు
హైదరాబాద్ సిటీ, వెలుగు: క్యూర్ పరిధిలో అడ్వర్టైజ్మెంట్ పాలసీకి సంబంధించి కొత్త విధివిధానాలను ఖరారు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్న గైడ్‌లైన్స్‌పై చర్చించేందుకు శుక్రవారం సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరగనున్నది. దీనికి జీహెచ్‌ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీల కమిషనర్లు హాజరుకానున్నారు. అడ్వర్టైజ్మెంట్ల ద్వారా వచ్చే ఆదాయాన్ని పెంచుకోవడం, రూల్స్‌లో ఏమైనా మార్పులు చేయాలా అన్న అంశంపై చర్చించే అవకాశముంది.
ప్రభుత్వం 2 నెలల కింద కొత్త అడ్వర్టైజ్మెంట్ పాలసీ జీవో విడుదల చేసింది. అయితే, పూర్తిస్థాయి గైడ్‌లైన్స్ ఖరారు కాకపోవడంతో పాలసీ అమల్లోకి రాలేదు. దీంతో అటు ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన ఆదాయానికి భారీగా గండి పడుతున్నది. ఈ సమావేశం తర్వాత కొత్త పాలసీకి సంబంధించిన పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అడ్వర్టైజ్మెంట్ విభాగంలో ఉన్న గందరగోళానికి తెరపడే చాన్స్ ఉంది.
ప్రతి అడ్వర్టైజ్మెంట్ బోర్డుకి క్యూ ఆర్ కోడ్..
జీహెచ్ఎంసీలో ఇదివరకు ఉన్న నిబంధనలు ఏ ఒక్క అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీ పాటించలేదు. దీంతో కొత్త విధానం అమలులో పారదర్శకత కోసం ప్రతి అడ్వర్టైజ్మెంట్ బోర్డుకి ‘క్యూఆర్ కోడ్’, ‘జియో ట్యాగింగ్’ తప్పనిసరి చేయనున్నారు. అనుమతి లేని ప్రకటనలను ముందస్తు నోటీసు లేకుండా తొలగించే అధికారం ఆయా కార్పొరేషన్లకి జీవో84 లోనే కల్పించారు. ఎవరైనా రూల్స్బ్రేక్చేస్తే మొదటి తప్పు కింద వార్షిక ఫీజుకు ఏకంగా మూడింతల జరిమానా విధిస్తారు. రిపీట్ చేస్తే క్రిమినల్ కేసు నమోదు చేయడంతో పాటు, సదరు ఏజెన్సీని బ్లాక్ లిస్ట్‌లో పెడతారు. అలాగే ప్రకటన ఫీజు చెల్లింపులో 30 రోజులకు పైగా జాప్యం జరిగితే, వారు సమర్పించిన బ్యాంక్ గ్యారంటీని జప్తు చేసి, ప్రకటన అనుమతిని తక్షణమే రద్దు చేస్తామని జీవోలో పేర్కొన్నారు.
ఏ జోన్లలో ఎలా ఏర్పాటు చేయాలి?
జీహెచ్ఎంసీలో ఇదివరకు ఉన్న పాత మార్గదర్శకాలు, సర్క్యులర్లు అన్ని కొత్త జీవో తర్వాత రద్దయ్యాయి. కొత్త విధానం ప్రకారం ట్రై సిటీల్లో ప్రకటనల ఏర్పాటును రెగ్యులరైజ్చేసేందుకు ప్రాంతాలను, ట్రాఫిక్ రద్దీని, వాణిజ్య ప్రాధాన్యతను బట్టి నాలుగు జోన్లుగా (ఎస్,ఏ,బీ,సీ ) విభజించారు. అత్యంత రద్దీగా ఉండే సెంట్రల్ బిజినెస్ జిల్లాలు, ప్రధాన రవాణా మార్గాలు, ప్రీమియం నివాస ప్రాంతాలను 'జోన్- ఎస్' కిందకు, కొత్తగా అభివృద్ధి చెందుతున్న కమర్షియల్ ప్రాంతాలను 'జోన్-ఏ'గా, ..నివాస, రిటైల్ దుకాణాలు కలిసిన ప్రాంతాలను 'జోన్-బీ'గా.., రద్దీ తక్కువగా ఉండే సాధారణ నివాస ప్రాంతాలను 'జోన్-సీ'గా వర్గీకరించారు.
ప్రకటనల అనుమతులు, పర్యవేక్షణ, జోనింగ్ ప్లాన్ ఆమోదం కోసం ఎంఏ అండ్ యూడీ ప్రిన్సిపల్ సెక్రటరీ చైర్మన్‌గా ‘అడ్వర్టైజ్మెంట్ రెగ్యులేటరీ కమిటీ’ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇందులో ముగ్గురు కమిషనర్లతో పాటు ట్రాఫిక్ పోలీస్, హెచ్ఎండీఏ, రవాణా, పర్యాటక శాఖల ఉన్నతాధికారులు సభ్యులుగా ఉంటారు. ఏఆర్‌సీ అనుమతి ఉంటేనే పబ్లిక్ స్థలాల్లో హోర్డింగ్‌లకు అవకాశం ఉంటుంది. అయితే ఏ జోన్ లో ఎటువంటివి ఏర్పాటు చేయాలి? ఎంత సైజు, ఎంత ఎత్తులో ఏర్పాటు చేయాలనే దానిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. సెక్రటేరియేట్‌లో జరిగే మీటింగ్‌లో ఈ అంశాలపై చర్చ జరగనున్నది.
వ్యతిరేకిస్తున్న ఏజెన్సీలు
క్యూర్ పరిధిలో కొత్త పాలసీకి సంబంధించి జీవో విడుదలైంది. దీంతో పాత పాలసీ రద్దయ్యింది. దీని ప్రకారం క్యూర్ పరిధిలో ఎక్కడా హోర్డింగులు, ఫ్లెక్సీలు, కటౌట్లు, బ్యానర్లు పెట్టడానికి వీలులేదు. కానీ, ఎక్కడ చూసిన హోర్డింగ్స్, ఫ్లెక్సీలు, కటౌట్లు, ఆర్చ్ లు, రోడ్డు కి సెంట్రల్ మీడియన్ లో లాలిపాప్ లు ఏర్పాటు చేస్తున్నారు. వీటి ద్వారా ఏజెన్సీలు నెలకి రూ.కోట్లలో అక్రమ ఆదాయం పొందుతున్నాయి. వీటివల్ల ప్రభుత్వానికి నయా పైస ఆదాయం లేదు. దీనికి గండి పడే అవకాశం ఉండడంతో కొత్త అడ్వర్టైజ్మెంట్ పాలసీని యాడ్ ఏజెన్సీలు వ్యతిరేకిస్తున్నారు.

