- ముందు ఐఎల్ అండ్‌ఎఫ్‌ఎస్ సంస్థకే నోటీసులు
- సాఫ్ట్‌వేర్ నిర్వహణ లోపాలు, డేటా దుర్వినియోగంపై వివరాల సేకరణ
- 10 వేలకుపైగా అనుమానాస్పద లావాదేవీలను గుర్తించిన ధరణి ఫోరెన్సిక్ ఆడిట్
- టెండర్ల ప్రక్రియ, సిస్టమ్ ఆర్కిటెక్చర్, భూముల వర్గీకరణ మార్పులపై సమగ్ర దర్యాప్తు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ధరణి పోర్టల్ నిర్వహణ లోపాలు, సాంకేతిక, భూముల డేటా దుర్వినియోగంపై సమగ్ర విచారణ జరిపేందుకు ప్రభుత్వం ‘స్పెషల్ ఎంక్వైరీ టీమ్’ (సెట్) ను రంగంలోకి దించేందుకు సిద్ధమైంది. ఈ ప్రత్యేక దర్యాప్తు బృందంలో పోలీస్, రెవెన్యూ, ఐటీ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) విభాగాల నుంచి అధికారులను త్వరలోనే ఒక కమిటీగా నియమించనున్నది. ధరణి పోర్టల్ ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకూ జరిగిన సాఫ్ట్‌వేర్ వ్యవహారాలపై ప్రభుత్వం నిర్వహించిన ఫోరెన్సిక్ ఆడిట్‌లో దాదాపు 10 వేలకు పైగా అనుమానాస్పద లావాదేవీలు జరిగినట్టు ప్రాథమికంగా గుర్తించారు.
ఈ నేపథ్యంలో.. ధరణి పోర్టల్ సాంకేతిక రూపకల్పన, క్షేత్రస్థాయిలో జరిగిన అక్రమాలపై వివిధ దశల్లో దర్యాప్తు జరపాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా.. ధరణి పోర్టల్ నిర్వహణ బాధ్యతలను పర్యవేక్షించిన ‘ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లీజింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్’ (ఐఎల్ అండ్ ఎఫ్‌ఎస్ టెర్రాసిస్) సంస్థకు మొదటగా నోటీసులు జారీ చేయాలని భావిస్తున్నారు. డిజిటల్ రికార్డుల్లో జరిగిన మార్పులు, డేటా భద్రతలో వైఫల్యాలు, టెండర్ల కేటాయింపు ప్రక్రియలో చోటుచేసుకున్న నిబంధనల ఉల్లంఘనలపై లీగల్ నోటీసుల ద్వారా సమాధానాలు రాబట్టేందుకు తదుపరి చర్యలు తీసుకోనున్నారు.
నోటీసులు ఇద్దాం
ధరణి పోర్టల్ రూపకల్పన, నిర్వహణ బాధ్యతలను దక్కించుకున్న ప్రధాన సంస్థ అయిన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లీజింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్‌తోపాటు దాని అనుబంధ సంస్థగా ఉన్న టెర్రాసిస్ పాత్రపై ప్రత్యేక దర్యాప్తు బృందం దృష్టి సారించనున్నది. ఈ రెండు సంస్థల అంతర్గత ఒప్పందాలు, నిధుల మళ్లింపులు, పోర్టల్ నిర్వహణలో వాటికున్న వాస్తవ భాగస్వామ్యం ఎంత? అనే అంశంపై స్పష్టత తెచ్చుకునేందుకు వీలుగా ముందుగా వీరికి నోటీసులు పంపాలని నిర్ణయించారు. పోర్టల్ నిర్వహణ సంస్థ ఎంపిక ఏ ప్రాతిపదికన జరిగింది? అప్పట్లో నిర్వహించిన టెండర్ ప్రక్రియ నిబంధనల ప్రకారమే జరిగిందా? లేదా? అన్న కోణంలో ఫైళ్లను దర్యాప్తు బృందం పరిశీలించనున్నది. వెండర్‌కు కాంట్రాక్టు కేటాయింపు ప్రక్రియలో ప్రభుత్వ నిబంధనలను ఏ మేరకు పాటించారు? సిస్టమ్ ఆర్కిటెక్చర్‌లో కావాలనే లొసుగులు ఉంచారా? అనే సాంకేతిక అంశాలపై నియమితులయ్యే ఐటీ నిపుణుల సాయంతో నివేదికలు సిద్ధం చేయనున్నారు. ప్రజాధనంతో ముడిపడి ఉన్న ఇంతటి భారీ ప్రాజెక్టును ఒక ప్రైవేట్ వెండర్ చేతుల్లో పెట్టడం వెనుక ఉన్న ఒప్పంద పత్రాలను, కాంట్రాక్ట్ నిబంధనల ఉల్లంఘనలను గుర్తించి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు నోటీసుల ద్వారా ప్రక్రియను ప్రారంభించనున్నారు.
డేటా దుర్వినియోగం
ధరణి పోర్టల్ వేదికగా జరిగిన భూముల లావాదేవీలకు సంబంధించిన ప్రతి ఒక్క డిజిటల్ రికార్డును, అధికారుల లాగిన్ వివరాలను క్షుణ్నంగా పరిశీలించేందుకు స్పెషల్ ఎంక్వైరీ టీం పనిచేయనున్నది. ఈ కమిటీలో నియమితులయ్యే పోలీస్, రెవెన్యూ, ఐటీ అధికారులు ఒక బృందంగా ఏర్పడి సమగ్ర విచారణ జరపనున్నారు. గత కొన్నేండ్లుగా పోర్టల్ రికార్డుల్లో చేసిన మార్పులు చేర్పులు, ఆయా మార్పులకు ఉన్నతాధికారుల నుంచి లభించిన అనుమతులు, నిషేధిత జాబితా నుంచి భూముల వర్గీకరణ మార్చిన విధానాలపై ఈ విచారణ ప్రధానంగా కేంద్రీకృతం కానున్నది. ఏయే సమయాల్లో ఏ లాగిన్ ఐడీల ద్వారా రికార్డులు సవరించారు?.. లబ్ధిదారుల వివరాల మార్పిడి వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరు? అనే కోణంలో ఐటీ, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా డేటాను స్క్రీనింగ్ చేయనున్నారు.
భూ రికార్డుల డిజిటలైజేషన్ ప్రక్రియలో భద్రతా నిబంధనలను పక్కనబెట్టి ప్రైవేట్ వ్యక్తులకు లేదా వెండర్లకు రికార్డుల యాక్సెస్ ఇవ్వడం ద్వారా భూముల డేటా దుర్వినియోగం ఏ మేరకు జరిగిందనే కోణంలో వివిధ దశల్లో సాక్ష్యాలను సేకరించనున్నారు. అనుమానాస్పద లావాదేవీలకు సంబంధించిన లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలు, రిజిస్ట్రేషన్ పత్రాలను సేకరించి, క్షేత్రస్థాయి పరిశీలన ద్వారా ప్రభుత్వ భూములు, ప్రైవేట్ భూముల బదలాయింపుల్లో జరిగిన అసలు నిజాలను ఈ త్రిసభ్య కమిటీ నిష్పాక్షికంగా వెలికితీయనున్నది.10 వేల అనుమానాస్పద లావాదేవీలకు సంబంధించిన ప్రతి క్లిక్‌ను, డిజిటల్ సిగ్నేచర్లను ట్రాక్ చేసేందుకు పోలీస్ శాఖలోని సైబర్ క్రైమ్ నిపుణుల సేవలను కూడా ఈ ప్రత్యేక బృందానికి అనుసంధానించనున్నారు. ఏ నిబంధనల ఆధారంగా నిషేధిత భూములను జనరల్ కేటగిరీలోకి మార్చారు? తద్వారా లబ్ధి పొందిన వ్యక్తులు ఎవరు? వారికి సహకరించిన సాంకేతిక బృందంలో ఎవరున్నారు? అనే పూర్తి వివరాలతో కూడిన సమగ్ర నివేదికను సిద్ధం చేసి ప్రభుత్వానికి సమర్పించేందుకు ప్రత్యేక విచారణ బృందం తదుపరి చర్యలు చేపట్టనున్నది.
