- రెగ్యులర్ టీచర్లు 5,089.. స్పెషల్ టీచర్లు 1,523
- టెట్ రిజల్ట్ తర్వాత నోటిఫికేషన్
- విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నట్టు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. మొత్తం 6,612 పోస్టులను భర్తీ చేస్తామని.. ఇందులో 5,089 రెగ్యులర్ టీచర్ పోస్టులు ఉండగా 1,523 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులు ఉన్నాయని తెలిపారు. స్కూల్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ (డీఎస్సీ)ల ద్వారా పోస్టులను భర్తీ చేస్తామని తెలిపారు. ఈ పోస్టుల భర్తీకి ఫైనాన్స్ డిపార్ట్ మెంట్ ఇప్పటికే ఆమోదం తెలిపిందని పేర్కొన్నారు. గురువారం హైదరాబాద్ లోని ఎస్సీఈఆర్టీ భవనంలో సబిత మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో మొదటిసారి 2017లో 8,972 టీచర్ పోస్టులను టీఆర్టీ ద్వారా భర్తీ చేశామని ఆమె గుర్తు చేశారు.
ప్రస్తుతం రాష్ట్రంలో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. రెండ్రోజుల్లో డీఎస్సీ షెడ్యూల్ రిలీజ్ చేస్తాం. సెప్టెంబర్ 15న టెట్ ఎగ్జామ్ ఉంది. టెట్ రిజల్ట్ తర్వాత డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తాం” అని వెల్లడించారు. ‘‘రాష్ట్రవ్యాప్తంగా సర్కార్ బడుల్లో మొత్తం 1,22,386 శాంక్షన్డ్ టీచర్ పోస్టులు ఉన్నాయి. ప్రస్తుతం 1,03,343 మంది పని చేస్తున్నారు. ఖాళీగా ఉన్న పోస్టుల్లో 1,947 గెజిటెడ్ హెడ్మాస్టర్.. 2,162 ప్రైమరీ స్కూల్ హెడ్మాస్టర్.. 5,870 స్కూల్ అసిస్టెంట్ పోస్టులను ప్రమోషన్ల ద్వారా భర్తీ చేయాల్సి ఉంది” అని అన్నారు.
ఇక మిగిలిన 6,612 పోస్టులను డీఎస్సీ ద్వారా భర్తీ చేస్తాం. వీటిలో ఎస్జీటీ 2,575, స్కూల్ అసిస్టెంట్ 1,739, లాంగ్వేజ్ పండిట్ 611, పీఈటీ పోస్టులు 164 ఉన్నాయి. వీటితో పాటు ప్రత్యేక అవసరాలు ఉన్న విద్యార్థుల కోసం ప్రైమరీ స్కూళ్లలో 796 పోస్టులు, అప్పర్ ప్రైమరీ స్కూళ్లలో 727 పోస్టులను భర్తీ చేస్తాం” అని తెలిపారు.
విద్యారంగానికి తొమ్మిదేండ్లలో రూ.1.87 లక్షల కోట్లు..
తెలంగాణ కోసం ‘నీళ్లు, నిధులు, నియామకాలు’ నినాదంతో సీఎం కేసీఆర్ అన్ని వర్గాలను ఏకం చేశారని సబిత అన్నారు. ఇప్పుడు దాన్ని నిజం చేస్తున్నారని చెప్పారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత విద్యా రంగానికి అధికంగా నిధులు కేటాయిస్తున్నారని తెలిపారు. ‘‘2014–-15లో ఎడ్యుకేషన్‌కు మొత్తం రూ.9,518 కోట్లు ఖర్చు చేశారు. ఈ ఏడాది (2023–-24) రూ.29,611 కోట్లు కేటాయించారు. కేజీ టు పీజీలో భాగంగా గురుకుల విద్యను సర్కార్ ప్రోత్సహిస్తోంది.
9 ఏండ్ల కింద రూ.973 కోట్లు ఖర్చు చేస్తే, ఈ ఏడాది రూ.4,049 కోట్లు కేటాయించింది. గత తొమ్మిదేండ్లలో విద్యారంగానికి మొత్తం రూ.1,87,269 కోట్లు ఖర్చు చేశాం. మన ఊరు–మన బడి స్కీమ్ ద్వారా మూడు దశల్లో 26 వేల స్కూళ్లను రూ.7,289 కోట్లతో అభివృద్ధి చేస్తున్నాం. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తొలుత గురుకులాల్లో 11,715 టీచర్ పోస్టులను భర్తీ చేశాం. ఇప్పుడు మరో 12,150 టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల రిక్రూట్ మెంట్ ప్రక్రియ కొనసాగుతోంది” అని వివరించారు.
కాలేజీల్లోనూ ఖాళీల భర్తీ..
రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్, డిగ్రీ కాలేజీల్లోనూ ఖాళీ పోస్టులను భర్తీ చేస్తున్నట్టు మంత్రి సబిత తెలిపారు. డిగ్రీ కాలేజీల్లో 491 లెక్చరర్, 24 లైబ్రేరియన్, 54 పీడీ పోస్టులు.. ఇంటర్ కాలేజీల్లో 1,392 జేఎల్, 40 లైబ్రేరియన్, 91 పీడీ పోస్టులు.. పాలిటెక్నిక్ కాలేజీల్లో 317 పోస్టులను టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీ చేస్తున్నట్టు చెప్పారు. వీటితో పాటు కాలేజీలు, వర్సిటీల్లో గ్రూప్ 4 ద్వారా 742 పోస్టులను భర్తీ చేయనున్నట్టు వెల్లడించారు. ఇక టెక్నికల్ ఎడ్యుకేషన్‌లో 520, కాలేజ్ ఎడ్యుకేషన్‌లో 280, ఇంటర్ ఎడ్యుకేషన్‌లో 3,096 కాంట్రాక్ట్ పోస్టులను రెగ్యులరైజ్ చేశామని పేర్కొన్నారు. సమావేశంలో విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, గ్రంథాలయ చైర్మన్ ఆయాచితం శ్రీధర్, స్కూల్ ఎడ్యుకేషన్ అడిషనల్ డైరెక్టర్ లింగయ్య, ఎస్ఎస్ఏ ఏఎస్పీడీ రమేశ్ తదితరులు పాల్గొన్నారు.