కవిత అరెస్ట్.. బీఆర్ఎస్, బీజేపీల డ్రామా: విప్ అడ్లూరి లక్ష్మణ్

కవిత అరెస్ట్.. బీఆర్ఎస్, బీజేపీల డ్రామా: విప్ అడ్లూరి లక్ష్మణ్

హైదరాబాద్, వెలుగు: కవిత అరెస్ట్.. బీఆర్ఎస్, బీజేపీలు ఆడుతున్న డ్రామా అని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ అన్నారు. ఆ రెండు పార్టీలు ఒక్కటేనన్న అభిప్రాయం ప్రజల్లో నుంచి పోవడానికే ఇదంతా చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ మీద ఈడీకి, కేంద్రానికి చిత్తశుద్ధి ఉంటే స్కామ్ బయటపడినప్పుడే ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. శనివారం అసెంబ్లీ మీడియా హాల్ లో ఆయన మాట్లాడారు. కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేస్తున్న సమయంలో ఆమెలో పశ్చాత్తాపం, బాధ ఏం లేదన్నారు. ‘‘ప్రజల కోసం ఏదో త్యాగం చేసి అరెస్ట్ అయినట్లు  ఆమె హావభావాలు ఉన్నాయని పబ్లిక్ అంటున్నారు. 

మాజీ సీఎం కూతురు లిక్కర్ స్కామ్​లో ఉండడాన్ని ప్రజలు అసహ్యించుకుంటున్నారు. ఈ స్కామ్​తో రాష్ర్ట పరువు, ప్రతిష్టలకు భంగం కలిగాయి. కవిత అరెస్టుకు వ్యతిరేకంగా బీఆర్ఎస్  నేతలు ఆందోళనలు చేయడం  విడ్డూరంగా ఉంది. దేశం, రాష్ర్టం కోసం ఆమె అరెస్ట్ అయ్యారా? బీఆర్ఎస్ ఆందోళనలను తీవ్రంగా ఖండిస్తున్నాం” అని లక్ష్మణ్​  పేర్కొన్నారు. హరీశ్ రావు  బీజేపీ, అమిత్ షాతో టచ్ లో ఉన్నాడో లేదో చెప్పాలని, ఆయన కాల్ డేటాను పరిశీలిస్తే నిజం తెలుస్తుందని వివరించారు. బీజేపీ, బీఆర్ఎస్ డ్రామాలను రాష్ర్ట ప్రజలు పట్టించుకోరని ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ డబుల్ డిజిట్ సీట్లు గెలుస్తుందని లక్ష్మణ్ ధీమా వ్యక్తం చేశారు.