కోల్‌కతా: టాటా స్టీల్ చెస్ ర్యాపిడ్ విభాగంలో కాంస్యం గెలిచిన తెలంగాణ గ్రాండ్ మాస్టర్ అర్జున్ ఎరిగైసి.. బ్లిట్జ్‌లోనూ బ్రాంజ్ మెడల్‌తో మెరిశాడు. మొత్తం 18 రౌండ్లలో అర్జున్ 11 పాయింట్లతో మూడో ప్లేస్‌లో నిలిచాడు. నీహల్ సరీన్ కూడా 11 పాయింట్లు సాధించినా మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా సిల్వర్‌ను సొంతం చేసుకున్నాడు. సో వెస్లీ (అమెరికా) 12 పాయింట్లతో గోల్డ్‌ను సాధించాడు.
ఆదివారం జరిగిన చివరి 9 రౌండ్లలో అర్జున్ మూడు విజయాలు, మూడు ఓటములు, మూడు డ్రాలు నమోదు చేశాడు. 12వ రౌండ్‌లో నీహల్ సరీన్ చేతిలో ఓడిన అర్జున్.. చెస్ లెజెండ్ విశ్వనాథన్ ఆనంద్‌తో జరిగిన 13వ రౌండ్‌లో గెలిచాడు. బ్లిట్జ్‌లో విషీని ఓడించడం రెండోసారి. అయితే ప్రజ్ఞానందతో జరిగిన 17వ రౌండ్‌లో ఓడాడు. విదిత్‌తో జరిగిన 18 రౌండ్‌ను డ్రా చేసుకున్నాడు. విమెన్స్ సెక్షన్‌లో వాంతిక అగర్వాల్ (10.5)కు సిల్వర్ లభించింది. ద్రోణవల్లి హారిక (8) తొమ్మిదో స్థానంలో నిలిచింది.
