తెలంగాణ దగా పడ్డది.. ఒక్క ఫ్యామిలీ చేతిలో బందీ అయింది

తెలంగాణ దగా పడ్డది.. ఒక్క ఫ్యామిలీ చేతిలో బందీ అయింది
  • అమరవీరుల ఆకాంక్షలకు తగ్గట్టుగా రాష్ట్ర సర్కారు పని చేస్తలే
  • అరాచక శక్తులను పోషిస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నరు
  • బీఆర్​ఎస్​ నేతలకు ఫామ్‌‌హౌస్‌‌లు పెరుగుతున్నయ్​.. పేదోళ్లకు ఇండ్లు కూడా ఇస్తలే
  • గోల్కొండ కోటలో కేంద్రం ఆధ్వర్యంలో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ సమాజం ఒక కుటుంబం చేతిలో బందీ అయిందని, దగా పడిన రాష్ట్రంలా  తెలంగాణ మారిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కుటుంబ పార్టీల జోక్యం లేని, నియంతృత్వం లేని ప్రజాపాలన తెలంగాణలో రావాలని, వస్తుందని తాను ఆశిస్తున్నానని ఆయన చెప్పారు. శుక్రవారం రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గోల్కొండ కోటలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. 

తర్వాత ఆయన మాట్లాడుతూ.. ‘‘అమరవీరుల ఆకాంక్షలకు తగ్గట్టుగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేయడం లేదు. రాష్ట్రం అప్పుల కుప్పగా మారింది. ప్రపంచంలో అప్పు ఇవ్వగలిగే అన్ని సంస్థల వద్ద రాష్ట్ర సర్కారు రుణం తీసుకుంది. ఈ అప్పుల కోసమా మనం తెలంగాణ తెచ్చుకున్నది?’’ అని ప్రశ్నించారు. ఏ ఒక్క కుటుంబం, ఏ ఒక్క పార్టీతోనో తెలంగాణ రాలేదని, యావత్ తెలంగాణ ప్రజలు సంఘటితంగా పోరాటం చేస్తేనే రాష్ట్రం వచ్చిందని చెప్పారు. పార్లమెంట్‌‌‌‌లో ప్రతిపక్ష హోదాలో ఉన్న బీజేపీ.. నాటి ప్రభుత్వ మెడలు వంచి బిల్లు పెట్టించిందని గుర్తు చేశారు. తెలంగాణ జేఏసీలో బీజేపీ క్రియాశీలక పాత్ర పోషించిందని చెప్పారు. తెలంగాణ ఏర్పాటులో బీజేపీ అన్ని రకాలుగా సహకరించిందన్నారు.

మాఫియాల రాజ్యం

‘‘ధరణి మాఫియా, లిక్కర్ మాఫియా, ఇసుక మాఫియా, ఉద్యోగాల పేరుతో మాఫియా, టీఎస్‌‌‌‌పీపీఎస్సీ పేపర్ లీకేజీ మాఫియా, దళితబంధు దోపిడీ మాఫియా, కాంట్రాక్టర్ల మాఫియా, గొర్రెల పంపిణీలో మాఫియా, డబుల్​ బెడ్రూం​ఇండ్లలో మాఫియా, బొగ్గు గనుల కేటాయింపులో మాఫియా, పెద్ద నగరాల్లో ఇండ్ల నిర్మాణానికి పర్మిషన్లలో మాఫియా, చెరువుల భూముల ఆక్రమణలో మాఫియా.. ఇదేనా తెలంగాణ?” అని కిషన్‌‌‌‌రెడ్డి ప్రశ్నించారు.చేసిన అప్పులను రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమానికి పెట్టకుండా.. వేల కోట్ల అవినీతి చేస్తున్నారని ధ్వజమెత్తారు. ‘‘బీఆర్ఎస్ నేతల ఫామ్‌‌‌‌హౌస్‌‌‌‌లు పెరుగుతున్నయ్​.. పేదోడికి డబుల్ బెడ్రూం ఇండ్లు మాత్రం వస్తలేవు. ఉద్యమ ద్రోహులకు అధికారంలో, పదవుల్లో పెద్దపీట వేస్తున్నారు. తెలంగాణ బంగారం కాలేదు.. అధికారంలో ఉన్న నేతల కుటుంబాలు మాత్రం బంగారం అయ్యాయి” అని మండిపడ్డారు.

ప్రజలకు అనుమతి లేని సెక్రటేరియెట్ ఎందుకు?

కేజీ టు పీజీ విద్య ఏమైందని, గిరిజనులకు రిజర్వేషన్లు ఏమయ్యాయని, దళితులకు మూడెకరాల భూమి, దళిత సీఎం హామీలు ఏమయ్యాయని కిషన్‌‌‌‌రెడ్డి ప్రశ్నించారు. ‘‘రుణమాఫీ కాక, అప్పులు తీర్చే మార్గం లేక రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. చేసిన పనులకు బిల్లులు రాక సర్పంచ్​లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి నిరుద్యోగులను వెన్నుపోటు పొడిచారు. సెక్రటేరియెట్​లోకి, ప్రగతిభవన్​లోకి ప్రజలు వెళ్లడానికి అవకాశం లేనప్పుడు.. అవి ఎందుకని ప్రశ్నించారు. 

ఇస్తాంబుల్ చేస్తమన్నరు.. ఏదీ..?

‘‘తెలంగాణలోని నగరాలను ఇస్తాంబుల్ చేస్తాం.. సింగపూర్, డల్లాస్ చేస్తామని చెప్పారు. ఏదీ? కనీస సౌకర్యాలు లేక నగర ప్రజలు ఇబ్బందిపడుతున్నారు. నిమ్స్ లాంటి హాస్పిటల్స్ కడతామన్నారు.. ఏమైంది? ఉస్మానియాకు తాళం వేశారు. ఉస్మానియాలోకి మూసీ వరద నీళ్లు వస్తున్నాయి. హాస్టల్ విద్యార్థులకు పురుగుల అన్నం, నీళ్ల చారు పెడుతున్నరు. రాష్ట్ర ఆదాయమంతా చేసిన అప్పులకు వడ్డీలు కట్టేందుకే సరిపోతున్నది. మరి తెలంగాణ ఎలా అభివృద్ధి చెందుతుంది” అని కిషన్‌‌‌‌రెడ్డి నిలదీశారు.

గోల్కొండ కోటలో ఫొటో ఎగ్జిబిషన్

మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తొమ్మిదేండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ (సీబీసీ) హైదరాబాద్‌‌‌‌ ప్రాంతీయ కార్యాలయం ఆధ్వర్యంలో  ‘కేంద్ర ప్రభుత్వం 9 ఏళ్లలో సాధించిన విజయాలు’ అనే అంశంపై గోల్కొండ కోటలో ఏర్పాటు చేసిన రెండు రోజుల ఫొటో ఎగ్జిబిషన్‌‌‌‌ను కిషన్ రెడ్డి ప్రారంభించారు. తర్వాత అమరవీరుల కుటుంబాలను సత్కరించి, వారికి పాదాభివందనం చేశారు. మరికొన్ని రోజుల్లో కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు.. అమరవీరుల కుటుంబాల దగ్గరికి వెళ్తారని, వారితో మాట్లాడి కావాల్సిన సాయం అందిస్తారని మంత్రి చెప్పారు. మరోవైపు గోల్కొండ కోటలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. ప్రతిభ చూపిన కళాకారులకు, పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు కిషన్ రెడ్డి బహుమతులు అందించారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి, టీచర్ ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి, పలువురు అధికారులు పాల్గొన్నారు.