హ‌రిత‌హారం వ‌ల్లే తెలంగాణ‌లో 4% ప‌చ్చ‌ద‌నం పెరిగింది

హ‌రిత‌హారం వ‌ల్లే తెలంగాణ‌లో 4% ప‌చ్చ‌ద‌నం పెరిగింది

హైద‌రాబాద్ : జీవ వైవిధ్యంతోనే మానవ మనుగడ సాధ్యమని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ‌, దేవాదాయ శాఖ అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి తెలిపారు. శ‌నివారం అంత‌ర్జాతీయ జీవవైవిధ్య దినోత్స‌వం సంద‌ర్భంగా రాష్ట్ర జీవ‌వైవిధ్య మండ‌లి నిర్వ‌హించిన వ‌ర్చువ‌ల్ స‌మావేశంలో మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ..జీవ వైవిధ్యాన్ని కాపాడుకోకపోతే మానవ మనుగడ ప్రమాదంలో పడుతుందన్నారు. మా ప‌రిష్కారాలు ప్ర‌కృతిలో ఉన్నాయని గ‌త ఏడాది నినాదానికి కొన‌సాగింపుగా మేము ప‌రిష్కారంలో భాగం (We are part the Solution) అనే థీమ్ తో ఈ సంవ‌త్స‌రం అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవాన్ని జ‌రుపుకుంటు‌న్నామ‌న్నారు. మ‌నమంద‌రం ప్రకృతితో కలసి సామరస్యంగా జీవించడమేన‌న్నారు. 

మానవ జీవితంపై ప్రకృతి విపత్తులు, కరోనా మహమ్మారులు ఒకదాని వెంట మరొకటి దాడి చేస్తూ.. మనుగడకు ముప్పు వాటిల్లజేస్తున్నాయని తెలిపారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మ‌నం యధార్థాన్ని గ్రహించి మసలుకోవాల్సిన అవసరముందన్నారు. లేదంటే భవిష్యత్తు ప్రశ్నార్థకమయ్యే అవకాశముంద‌ని.. అభివృద్ధి పేరుతో మనం ఇప్పటికే ఎంతో విలువైన ప్రకృతి సంపదను కొల్పోయామన్నారు. అయినా ఇప్పటికీ ఎంతో మిగిలి ఉన్న ప్ర‌కృతి సంపందను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి మనిషిపైనా ఉందన్నారు.

సీఎం కేసీఆర్ ప‌ర్యావ‌ర‌ణ పరిరక్షణ, జీవ‌వైవిధ్య సంర‌క్ష‌ణ‌కు అధిక ప్రాధ‌న్య‌త‌నిస్తూ చేపట్టిన కార్యక్రమాలు సత్ఫలితాలు ఇస్తున్నాయన్నారు. హ‌రిత‌హార కార్య‌క్ర‌మ ఫలితాలు ఇప్పుడు రాష్ట్రమంతా మన కళ్లముందు కనిపిస్తున్నాయని తెలిపారు. పెద్ద ఎత్తున మొక్క‌లు నాటి, వాటిని సంరక్షించ‌డం వ‌ల్ల తెలంగాణ‌లో 4% ప‌చ్చ‌ద‌నం పెరిగింద‌ని చెప్పుకొచ్చారు మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి.