కోర్టుకే అబద్ధం చెఫ్తావా?.. రూ.10 వేలు ఫైన్ కట్టు

కోర్టుకే అబద్ధం చెఫ్తావా?.. రూ.10 వేలు ఫైన్ కట్టు

హైదరాబాద్, వెలుగు: విచారణ సందర్భంగా అబద్ధం చెప్పినందుకు ఓ పిటిషనర్ కు హైకోర్టు రూ. 10 వేలు ఫైన్ విధించింది. రంగారెడ్డి జిల్లా  గండిపేట మండలానికి చెందిన ఎం.ప్రశాంత్ కుమార్  అక్రమ నిర్మాణాలు చేపట్టినట్లు నార్సింగ్ మున్సిపాలిటీ అధికారులు గుర్తించారు. పర్మిషన్ లేని అక్రమ నిర్మాణాలను 15 రోజుల్లోగా తొలగించాలని సెప్టెంబరు 20న ఉత్తర్వులిచ్చారు.  దాన్ని సవాలు చేస్తూ ప్రశాంత్ కుమార్ హైకోర్టును ఆశ్రయించారు. నార్సింగ్ మున్సిపల్ అధికారులు తనకు అసలు షోకాజ్ నోటీసు ఇవ్వలేదని తెలిపారు. నోటీసులు ఇవ్వకుండానే  ఇల్లు కూల్చివేతకు ఉత్తర్వులను ఇచ్చారని..దాన్ని రద్దు చేయాలని కోరారు. ఆయన పిటిషన్ ను జస్టిస్ వినోద్ కుమార్ విచారించారు.

 మున్సిపాలిటీ స్టాండింగ్ కౌన్సిల్ వాదిస్తూ.. ఆగస్ట్ 1న ప్రశాంత్ కుమార్ కు షోకాజ్ నోటీసు ఇచ్చామని తెలిపారు. పిటిషనరే స్వయంగా సంతకం పెట్టి నోటీసులు అందుకున్నారని చెప్పారు. దానికి సంబంధించిన ఆధారాలను హైకోర్టుకు అందజేశారు. ఆ పత్రాల్లోని సంతకం, పిటిషన్ లోని సంతకం ఒకేలా ఉండడాన్ని హైకోర్టు గమనించింది. అవి  ప్రశాంత్ కుమార్ సంతకాలేనని నిర్ధారించింది. కోర్టుకు అబద్ధం చెప్పిన పిటిషనర్ తీరును తీవ్రంగా తప్పుపట్టింది. న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించినందుకు రూ. 10 వేలు జరిమానా కట్టాలని ప్రశాంత్ కుమార్ ను ఆదేశించింది. ఆ మొత్తం రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థకు చెల్లించాలని స్పష్టం చేసింది.